UK : కడుపునొప్పని టాయిలెట్‌కి వెళ్లి.. మగబిడ్డకు జన్మనిచ్చిన యువతి

ABN , First Publish Date - 2022-06-28T18:40:58+05:30 IST

కడుపునొప్పితో టాయిలెట్‌కు వెళ్లిన 20 ఏళ్ల యువతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

UK : కడుపునొప్పని టాయిలెట్‌కి వెళ్లి.. మగబిడ్డకు జన్మనిచ్చిన యువతి

లండన్ : కడుపునొప్పి(Stomach Pain)తో టాయిలెట్‌(Toilet)కు వెళ్లిన 20 ఏళ్ల యువతి పండంటి మగబిడ్డ(babyboy)కు జన్మనిచ్చింది. యూకే(UK)లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ(Southapton University) విద్యార్థి(Student)నికి ఎదురైన ఈ ‘షాకింగ్ డెలివరీ(Delivery)’కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూన్ 11న జెస్ డేవిస్(Jess Davis) తీవ్రమైన కడుపునొప్పితో నిద్రలేచింది. సరిగా నడవలేకపోయింది. బెడ్‌మీదా పడుకోలేకపోయింది. నెలసరి ఆరంభమైందేమోనని ఆమె భావించింది. మరుసటి రోజు తన బర్త్‌డే పార్టీ ఏర్పాట్ల దృష్ట్యా నొప్పిని లెక్కచేయలేదు. స్నానం చేసి ఫ్రెషప్ అయినా ఫలితం కనిపించలేదు. పైగా నొప్పి మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆమె అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. నొప్పితో కింద కూర్చుని, పొట్టని కిందికి నొక్కడం ప్రారంభించింది. ఈ క్రమంలో కడుపులోకి శిశువు బయటకొచ్చింది.


అసలు బిడ్డకు జన్మనిస్తున్నట్టే తనకు తెలియదని బ్రిస్టోల్‌కి చెందిన జెస్ డేవిస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకానొక సమయంలో  ఏడ్చాను. బిడ్డ ఏడుపు వినిపించేదాకా ఏం జరుగుతుందో తనకు అర్థంకాలేదని చెప్పింది. ఇంట్లో ఒక్కదాన్నే ఉండడంతో స్నేహితురాలికి ఫోన్ చేశాను. అంబులెన్స్‌కి ఫోన్ చేయాలని ఆమె సూచించిందని పేర్కొంది. క్షణాల్లోనే ఇంటికి చేరుకున్న అంబులెన్స్ ద్వారా ప్రిన్సెస్ అన్నే హాస్పిటల్‌కు తల్లిబిడ్డను తరలించారు. శిశువుని ఇంక్యూబేటర్‌లో ఉంచారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. గర్భధారణ జరిగిన 35 వారాల తర్వాత ప్రసవమయ్యిందని డాక్టర్లు చెప్పారు.

 

గర్భవతినని నాకు తెలియదు : జెస్ డేవిస్

కాగా జెస్ డేవిస్ సౌతాప్టంన్ యూనిర్సిటీలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. తాను గర్భవతిననే విషయం తెలియదని చెప్పింది. గర్భానికి సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదు. కడుపు కూడా ఉబ్బెత్తుగా కనిపించలేదు. పురిటి నొప్పులను నెలసరి నొప్పిగా భావించానని ఆమె తెలిపింది. అయితే రుతుస్రావం సక్రమంగా ఉండేదికాదని, కొంతకాలంగా పిరియడ్ ఆగిపోయిన విషయాన్ని తాను గుర్తించలేదని జెస్ డేవిస్ వివరించారు. జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చానని ఆమె చెప్పింది. శిశువు బరువు 3 కేజీలు ఉందని బాలింత జెస్ డేవిస్ వివరించింది. ‘‘ నా జీవితంలో ఇదే అతిపెద్ద షాక్. తొలుత కలగానే అనిపించింది. శిశువు ఏడ్చేవరకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఈ అకస్మాత్తు పరిణామం నేను ఎంతో ఎదగాల్సి ఉందని చెబుతోంది. షాక్ నుంచి బయటపడడానికి కొంతసమయం పట్టింది. నా కొడుకుతో చక్కటి బంధం ఏర్పడింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను’’ అని ఆమె తెలిపింది.

Updated Date - 2022-06-28T18:40:58+05:30 IST