వైభవంగా ఊంజల్‌ సేవోత్సవం

Jul 24 2021 @ 01:21AM
ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహిస్తున్న అర్చకులు

స్వామికి సువర్ణ పుష్పార్చనలు 

యాదాద్రి టౌన్‌, జూలై 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవాపర్వాలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. అనంతరం నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించిన పూజారులు హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు ఆగమ శాస్త్ర రీతిలో చేశారు. సాయంత్రంవేళ బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ఊంజల్‌సేవలో తీర్చిదిద్దారు. అమ్మవారి సేవకు అర్చకులు విశేష పూజలు నిర్వహించగా మహిళా భక్తులు మంగళనీరాజనాలు పాడారు. స్వామికి శుక్రవారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3,27,236 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

రథశాలకు ఆధ్యాత్మిక హంగులు

యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన స్వామివారి రథశాల నిర్మాణం పూర్తయింది. రథశాలను పూర్తి ఐరన్‌తో నిర్మించారు. రథశాలకు ఆధ్యాత్మిక హంగులను దిద్దే పనులను కోల్‌కతాకు చెందిన కళాకారులకు అప్పగించగా, వారు రథశాల మూడువైపులా అధ్యాత్మిక ఫైబర్‌ నిర్మాణాలను అమర్చారు. కృష్ణరాతి శిలలను పోలే విధంగా నలుపురంగుతో తీర్చిదిద్దారు. రథశాల పైభాగంలో ఏడు ఫైబర్‌ కలశాలను అమర్చి ఆలయ ఆకృతితో  తీర్చిదిద్దారు. రెండో ఘాట్‌రోడ్డులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో బండరాళ్లు తొలగించి రహదారి పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు.  

Follow Us on: