అన్‌..‘లక్కీ’.. పాత యజమానులకు దక్కని Wine Shops.. లక్షల్లో డిమాండ్‌ చేస్తున్న విజేతలు..

ABN , First Publish Date - 2021-11-22T17:02:59+05:30 IST

నూతన మద్యం షాపుల కేటాయింపులో ఇప్పటివరకు దుకాణాలు...

అన్‌..‘లక్కీ’.. పాత యజమానులకు దక్కని Wine Shops.. లక్షల్లో డిమాండ్‌ చేస్తున్న విజేతలు..

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్‌ : నూతన మద్యం షాపుల కేటాయింపులో  ఇప్పటివరకు దుకాణాలు నిర్వహించిన  వైన్‌షాపు యజమానులకు నిరాశే మిగిలింది. ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 29 వైన్‌షాపులు ఉండగా అందులో పాత వైన్‌షాపు యజమానులకు 5 నుంచి  ఆరుగురికి మాత్రమే అదృష్టం వరించింది. మిగతా యజమానులకు లక్కీ డ్రాలో వైన్‌షాపులు లభించకపోవడంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని 29 వైన్‌షాపులకుగాను 473 మంది దరఖాస్తు చేసుకోగా లక్కీ డ్రా తీయడంతో అందులో కొత్త వారికే అధికంగా వైన్‌షాపులు దక్కాయి. ముషీరాబాద్‌లో ఓ పాత వైన్‌షాపు యజమానులు 13, 15 దరఖాస్తులు చేయగా  అదృష్టం కలిసి రాలేదు. 


ముషీరాబాద్‌కు చెందిన ఓ నాయకుడు గతంలో మూడు వైన్‌షాపులు కొనసాగించగా ఈ సారి ఆయనకు ఒకే  వైన్‌ షాపు  వచ్చింది. తమ పాత వైన్‌షాపులను దక్కించుకోవడానికి ఒక్కొక్క వ్యాపారి ఒక్క షాపు కోసం 5 నుంచి 13 దరఖాస్తులు వేసినప్పటికీ లక్కీ డ్రాలో వైన్‌షాపులు దక్కకపోవడంతో  ఏం చేయాలో    తెలియని పరిస్థితి. మద్యం వ్యాపారానికి ఆలవాటుపడ్డ వారు తమ పాత వైన్‌షాపు కొనసాగించే షాపును ఇతరులకు ఇవ్వలేక, ప్రతి నెల అద్దెలు చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు. 


లక్షల్లో డిమాండ్‌ ..

లక్కీ డ్రాలో విజేతలకు అదృష్టం వరించింది. పాత వైన్‌షాపు యజమానులు లైసెన్స్‌ తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తుండగా కొంత మంది ససేమిరా అంటుండగా, కొందరు లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారని  సమాచారం. స్టేషన్‌ పరిధిలోని  వైన్‌షాపు నిర్వాహకులు  30, 35 లక్షల ఆఫర్‌ ఇచ్చినా విజేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా వైన్‌ షాపులను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-11-22T17:02:59+05:30 IST