Be Careful : అమ్మాయిలూ.. మ్యాట్రిమోనిలో ఫొటోలు పెడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

ABN , First Publish Date - 2021-09-03T16:34:23+05:30 IST

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాస్త పేరున్న మ్యాట్రిమోని వెబ్‌సైట్లను...

Be Careful : అమ్మాయిలూ.. మ్యాట్రిమోనిలో ఫొటోలు పెడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

సైబర్‌ మోసాలకు మ్యాట్రిమోని సైట్స్‌ అడ్డాగా మారుతున్నాయి. ఏదో ఒక పేరుతో ఆయా సైట్లలో రిజిస్టర్‌ చేయించుకుంటున్న కేటుగాళ్లు హైప్రొఫైల్‌ యువతులను టార్గెట్‌ చేసి ట్రాప్‌ చేస్తున్నారు. గతం కంటే ఈ ఏడాది పెరిగిన మోసాలే ఇందుకు నిదర్శనం. మోసపోయిన వారిలో యువతులే ఎక్కువగా ఉంటున్నారు.


హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : విదేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నా మనీ, వ్యాపారాల్లో స్థిరపడ్డామని నమ్మిస్తున్న కేటుగాళ్లు యువతులను మభ్యపెట్టి లక్షలు కాజేస్తున్నారు. మ్యాట్రీమోని వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా అమ్మాయిని ట్రాప్‌ చేస్తున్నప్పుడు ఆ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న తర్వాతే విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఫార్మా రంగంలో ఉన్నవారు ఎక్కువగా కేటుగాళ్ల చేతికి చిక్కి లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా ప్రేమ పేరుతో మోసపోయి మానసిక క్షోభకు గురవుతున్నారు.


ప్రేమిస్తున్నామంటూ ముగ్గులోకి...

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాస్త పేరున్న మ్యాట్రిమోని వెబ్‌సైట్లను ఎంపిక చేసుకుంటున్న కేటుగాళ్లు రాష్ట్రాలను బట్టి పేర్లను మార్చుకుని అమ్మాయిలకు ఎరవేస్తున్నారు. సంపన్నుల కుటుంబాలకు చెందిన యువతులనే ఎంపిక చేసుకుంటున్నారు. వారిని బుట్టలో వేయడానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల యాసలో, ఆంగ్లభాషలో పట్టు సాధించేలా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అమ్మాయిల ప్రొఫైల్స్‌లో ఉండే వివరాలతో ఎఫ్‌బీ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ఫోన్‌ నెంబర్‌ తీసుకుని వాట్సప్‌ చాటింగ్‌ మొదలెడుతున్నారు. పోష్‌ ఇంగ్లిష్‌ మాట్లాడే వారిపై సంపన్న కుటుంబాల వారికి ఉండే అంచనాకు అనుగుణం గా మోసగాళ్లు వ్యవహరిస్తూ సులువుగా దగ్గరవుతున్నారు. స్నేహం, తర్వాత ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగుతున్నారు. మెల్లిగా తమ దారికి తెచ్చుకుంటున్నారు.


పెద్దవాళ్లకు చెప్పొద్దు..

పేరెంట్స్‌కు కులమతాల పట్టింపులు ఉంటాయి కాబట్టి ప్రేమ వ్యవహారం వారితో చెప్పవద్దని, వారికి తెలియకుండా పెళ్లి చేసుకుందామని మభ్యపెడుతున్నారు. అనంతరం అసలు పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రేమకు గుర్తుగా ఖరీదైన గిఫ్టులు పంపిస్తున్నామని, లేదంటే తాము ఇండియాకు వచ్చేస్తున్నామని, సామగ్రిని ముందే పంపిస్తామని, ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకోవాలని నమ్మిస్తున్నారు. అదీ కుదరకపోతే తాము ఉండే చోటుకు రావాలని, ఇక్కడే పెళ్లి చేసుకుందామని మభ్యపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులుగా ఫోన్‌ చేసి గిఫ్ట్‌ ట్యాక్స్‌, సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్టీ, చెల్లించాలని ఖరీదైన గిఫ్ట్‌లకు జరిమానా విధిస్తున్నామని.. ఇలా రకరకాలుగా డబ్బులు లాగేస్తున్నారు. 


నిర్ధారణ లేకుండానే రిజిస్ట్రేషన్లు

ఎవరిదో ఫొటో, మరెవరివో వివరాలు పెట్టి మ్యాట్రిమోని సంస్థలకు చెందిన సైట్లలో సైబర్‌ కేటుగాళ్లు ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోగలుగుతున్నారు, ప్రొఫైల్స్‌ వివరాలను సంస్థల నిర్వాహకులు నిర్ధారించుకోవడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే క్రమంలో తమ వివరాలను ఎంతో నమ్మకంతో మ్యాట్రిమోని సంస్థలకు అందచేస్తున్న వారిని సంస్థల నిర్వాహకులు మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పేరున్న సంస్థలు కూడా రిజిస్టర్‌ చేసుకున్న సభ్యుల వివరాల భద్రతను గాలికి వదిలేస్తున్నట్లు కనిపిస్తోందని ఓ బాధితురాలు ఆరోపించారు. 


ఫొటోలు, ఆధార్‌ తదితర గుర్తింపు కార్డులను వీడియో కాలింగ్‌ ద్వారా నిర్ధారించుకునే అవకాశాలు ఉంటున్నప్పటికీ సంస్థలు పట్టించుకోవడం లేదని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నామని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న వారు నిజంగానే అక్కడే ఉంటున్నారా, లేదా అనే విషయాన్ని కూడా ఆయా సంస్థలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఎవరు పడితే వారు తప్పుడు ప్రొఫైల్స్‌తో మ్యాట్రిమోని సైట్లలోకి చొరబడి మోసాలకు పాల్పడుతున్నారని మరో యువతి ఆరోపించారు. మ్యాట్రిమోని సంస్థలు నిర్వహించే వెబ్‌సైట్లకు పూర్తి భద్రతతో గ్యారంటీ ఇచ్చే విధంగా నిబంధనలు విధించాల్సిన అవసరముందని, పోలీసు శాఖ కూడా ఈ తరహా మోసాల కట్టడికి అడ్డుకట్ట వేయాలని బాధితులు కోరుతున్నారు.


బాధితుల ఫిర్యాదులలో కొన్ని...

- జూబ్లీహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ యువతిని మూడు నెలల క్రితం పెళ్లి పేరుతో మభ్యపెట్టిన కేటుగాడు రూ.30 లక్షలకు పైగా కాజేశాడు.

- జూబ్లీహిల్స్‌కు చెందిన మరో మహిళ రెండో వివాహం కోసం వరుడు కావాలని ఓ పేరున్న మ్యాట్రిమొనీ సంస్థలో తన ప్రొఫైల్‌ రిజిస్టర్‌ చేసుకుంది. విదేశాల్లో ఫార్మాసంస్థలో  ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నానని ఆమెను ఉచ్చులోకి లాగిన ఓ కేటుగాడు ఖరీదైన గిఫ్ట్‌ పంపిస్తున్నానని చెప్పి రూ.50లక్షలకు పైగా కాజేశాడు.

- పాతబస్తీకి చెందిన యువతిని ఇదే తరహాలో మోసం చేసిన ఓ కేటుగాడు ఇండియాకు వచ్చేస్తున్నానని, విదేశంలో ఉన్న ఇంటి సామగ్రిని ఎయిర్‌ లాజిస్టిక్స్‌ ద్వారా పంపిస్తున్నానని, ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకోవాలనీ నమ్మించి రూ.18 లక్షలు కాజేశాడు.

- మారేడుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అమెరికాలో స్థిరపడ్డానని నమ్మించిన ఓ కేటుగాడు ప్రేమకు గుర్తుగా ఖరీదైన గిఫ్ట్‌ పంపుతున్నానని చెప్పి... ఆ తర్వాత ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారి పేరుతో భయపెట్టి రూ.20 లక్షలకు పైగా ఆమె నుంచి కాజేశాడు. 

- తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన యువతి వివరాలు ఓ సైట్‌ ద్వారా సేకరించిన బాల వంశీకృష్ణ అనే కేటుగాడు పెళ్లి పేరుతో మభ్యపెట్టి రూ.22 లక్షలకు పైగా ఆమె నుంచి కాజేశాడు. ఇదే మోసగాడు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అమ్మాయిలను ఇదే తరహాలో మోసం చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంంచారు. 

Updated Date - 2021-09-03T16:34:23+05:30 IST