అనవసర వివాదం

ABN , First Publish Date - 2021-06-02T06:41:23+05:30 IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే సంప్రదాయ వైద్యుడి చుట్టూ నెలకొన్న వివాదం సద్దుమణిగింది. కానీ, ఆయన మందుల కోసం దూరాల నుంచి పెద్ద సంఖ్యలో జనం రాకుండా...

అనవసర వివాదం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే సంప్రదాయ వైద్యుడి చుట్టూ నెలకొన్న వివాదం సద్దుమణిగింది. కానీ, ఆయన మందుల కోసం దూరాల నుంచి పెద్ద సంఖ్యలో జనం రాకుండా, ఆ సమ్మర్దం కారణంగా కొవిడ్ నిబంధనలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి వస్తోంది. మందు కోసం ఎవరూ ఆయన దగ్గరికి రావద్దని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వమే మందు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. పంపిణీని తాను చేపడతానన్న తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కు తగ్గగా, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. యాప్ ద్వారా సరఫరా చేస్తారట. ఇప్పుడిక భారీ స్థాయిలో దినుసులను సమకూర్చి, పెద్ద ఎత్తున మందును తయారుచేయించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకున్నట్టుంది. ఇక పంపిణీ ఎట్లా జరుగుతుందో, డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటే దాన్ని ఎట్లా నెరవేరుస్తారో వేచి చూడవలసి ఉన్నది. 


ఆనందయ్య అందిస్తున్న ఔషధాలలో అన్నిటికీ ఆమోదం లభించలేదు. కేవలం మూడు రకాల మందులకే ‘హానికరం కాద’న్న యోగ్యతాపత్రం లభించింది. కంటిలో వేసే చుక్కల మందు పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ప్రమాదకరం కాదని చెప్పినవి కూడా కొవిడ్‌ను తగ్గించే ఔషధాలుగా నిపుణులు అంగీకరించలేదు. అవి ఆయుర్వేద ఔషధాలని కూడా అంగీకరించినట్టు లేదు. హానికరం కాని వాటినే ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఆనందయ్య మందుల సమస్యను జనరంజకంగా పరిష్కరించినందుకు రాజకీయంగా మున్ముందు లాభం సమకూరుతుందని ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ ఆశపడుతూ ఉండవచ్చు. భారత ఉపరాష్ట్రపతి నుంచి కేంద్ర హోం సహాయమంత్రి దాకా ఆనందయ్య వైద్యం గురించి ప్రశంసాపూర్వకంగా ప్రస్తావించడం వెనుక కేవలం సంప్రదాయ వైద్యంపై గౌరవమేనా మరేదైనా ఉన్నదా తెలియదు. 


ఆనందయ్య మందుల విషయంలో ఎందుకింత రాద్ధాంతం జరిగిందో, సమాజం రెండుగా ఎందుకు చీలిపోయి తగాదా పడిందో, ఆయన తన వైద్యాన్ని పదిమంది ముందు ఎందుకు ప్రదర్శించి నిరూపించుకోవలసి వచ్చిందో తెలియదు. ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక మందులు, స్థానికంగా, సంప్రదాయికంగా ఉపయోగించే అనేక ‘చెట్ల మందులు’, ‘పసరు మందులు’ ఏవీ వివాదంలో లేవు. అవి ఆరోగ్యసమస్యలను పరిష్కరిస్తాయని భావించేవారు ఆ మందులను వాడతారు. ఆయుర్వేద ఫార్మసీలు తయారుచేసే బ్రాండెడ్ ఔషధాలకు ఏవైనా నాణ్యతా పరీక్షలు ఉంటే ఉండవచ్చును కానీ, అటువంటివి ఏవీ లేని ఔషధ సంప్రదాయాలు భారతీయ సమాజంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని సమాజాలలో కూడా అమలులో ఉన్నాయి. మానవులు ఒక సమాజంగా పరిణామం చెందుతున్న క్రమంలో, అనుభవాల నుంచి, పరిశీలనల నుంచి, ప్రయోగాల నుంచి అనేక రోగనిదానాలను కనుగొన్నది. అవేవీ సర్వరోగ నివారిణులు కావు. ఆధునిక వైద్యం కూడా సర్వరోగ నివారిణి కాదు. జలుబుకి, అతిసారకి, ఉబ్బసానికి, కేన్సర్‌కు నివారణ, నిరోధం, చికిత్స ఆధునిక వైద్య విధానాలలో లేవు. వైద్యశాస్త్రం ఇంకా రూపొందుతూ ఉన్నది, నిరంతరంగా రూపొందుతూ ఉంటుంది. సంప్రదాయ వైద్యాలు అని మనం పిలుస్తున్న విధానాలు, అనేక చారిత్రక కారణాల వల్ల, నిరంతర పరిణామానికి లోనుకాకుండా, కొంత స్తబ్దతకు లోనయ్యాయి. పాత, కొత్త వైద్యాలు పరస్పరం శత్రువులు కావు. అన్ని శాస్త్రరంగాలలో ఉన్నట్టుగానే, అనేక భావధారలు వైద్యశాస్త్రంలోనూ ఉన్నాయి. సంప్రదాయ వైద్యాలు శరీరనిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను, సమస్యలను ఎదుర్కొనే పద్ధతులను భిన్నంగా నిర్వచించి ఉండవచ్చు. ఆధునిక వైద్యశాస్త్రాల వైద్యతాత్వికత మరొక కోవకు చెందినది అయి ఉంటుంది. 


కలరా, ప్లేగ్ వంటి గత్తరలు వ్యాపించినప్పుడు పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోవడం, అప్పటికి అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు ప్రాణరక్షణలో విఫలం కావడం చరిత్రలో అనేక సందర్భాలలో చూస్తాము. ఇప్పుడు కూడా అంతే, మునుపెన్నడూ ఎరుగని ఒక అర్ధక్రిమి దాడిచేస్తే, దానిని ఎదుర్కొనడానికి మానవాళి సన్నద్ధంగా లేదు. ఇప్పటికే ఉన్న రోగనిరోధకత కాపాడినవారిని పక్కన పెడితే, నూటికి పది మందిని ఇబ్బంది పెడుతూ, అందులో ఒకరి నుంచి నలుగురైదుగురు దాకా ప్రాణాలు తీయడం చూస్తున్నాము. ఈ క్రిమే కొత్తది కాబట్టి, అది కలిగించే ఆరోగ్యసమస్యకు మందు లేదు. ఇటువంటి సందర్భాలలో ఉపయోగించిన ఇతర మందులను ప్రయోగాత్మకంగా ఈ సందర్భంలోనూ ఉపయోగించారు. ఆ మందులు అన్ని వేళలా పనిచేయలేదు కూడా. మొదటి దశలో వాడిన మందులను తరువాతి దశలో అనవసరమన్నారు, పనికిరావన్నారు, ప్రమాదకరమన్నారు. మానవ సమాజం తన మీద తాను ప్రయోగాలు చేసుకున్నది. ఆనందయ్య వంటి వారు తయారుచేసే మందులు కూడా రోగ లక్షణాలను దృష్టిలో పెట్టుకుని అనుభవం ద్వారా రూపొందించినవి. అటువంటి ఔషధాలను శంకించడం, ఆయనను చెప్పరాని ఇబ్బందులు పెట్టడం, పరీక్షలకు గురిచేయడం ఏ మాత్రం సభ్యసమాజం చేయవలసినవి కావు. స్థానిక సమాజాలలో వైద్యసేవలు అందించేవారు ప్రమాదకరమైన దినుసులను ఉపయోగించనే ఉపయోగించరు. అట్లా ఉపయోగిస్తే, ప్రమాదకర పర్యవసానాలు కనుక ఉంటే, ఆ వైద్యుడు ఆ సమాజంలో బతకలేడు. సమాజంతో వైద్యునికి ఉన్న అవినాభావ సంబంధమే అక్కడ ఔషధ నాణ్యతకు పూచీ పడుతున్నది. ఇక, ఒకటో రెండో సందర్భాలలో మందు వికటించడం, ఎక్కడ మాత్రం జరగడం లేదు? అల్లోపతిలో ఎన్ని ఉదంతాలు వింటున్నాము? 


ఇదే అదనుగా, కొవిడ్ ఉత్పాతాన్ని సమర్థంగా ఎదుర్కొనలేని ప్రభుత్వాలు, ఆనందయ్య వంటి ఉదాహరణలను ఉపయోగించుకుని, అల్లోపతి మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ, తద్వారా తమ వైఫల్యాన్ని వైద్యవిధానం మీదకు నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. బాబా రామ్‌దేవ్ ప్రయత్నం అదే. అల్లోపతిలో లోపాలు అనేకం ఉండవచ్చును. కానీ, ప్రస్తుతం దాన్ని ప్రధానాయుధంగా చేసుకుని మానవాళి పోరాడుతున్నది. ఆ వైద్యాన్ని సక్రమంగా అందించడంలో ప్రభుత్వాల, వ్యవస్థల వైఫల్యం కారణంగా అనేక మరణాలు సంభవించాయి, సంభవిస్తున్నాయి. మానవ తప్పిదం వల్ల జరిగిన ఆ ప్రాణనష్టానికి బాధ్యత వహించవలసిన వారు, ఆయుర్వేద- అల్లోపతి వివాదం వెనుక తలదాచుకుని రక్షణ పొందాలనుకోవడం మంచిది కాదు. దేశీయంగా టీకాలు కనిపెడితే అది ఘనత, వైఫల్యం ఎదురయితే మాత్రం అల్లోపతిదే తప్పు- అన్న ధోరణి మంచిది కాదు. 


ఆయుర్వేదం వేరు, మూఢనమ్మకాలతో ముడిపడిన వైద్యపద్ధతులు వేరు. పేడపులుముకుని, మూత్రపానం చేయడం ఏ రకంగానూ ఆయుర్వేదం కాదు. మన దేశీయ వైద్య పద్ధతులకు గౌరవం పెంచాలంటే, ఆయుర్వేదాన్ని, ఇతర దేశీయ వైద్య విధానాలను సమకాలీన అవసరాలతో అనుసంధానం చేయాలి. అవసరమైన సందర్భాలలో ఆధునికీకరణ, ప్రమాణీకరణ ఎట్లా చేయవచ్చునో పరిశీలించాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు కేటాయించి, ఆయుర్వేదాన్ని సమకాలీన వైద్య విధానంగా తీర్చిదిద్దాలి.

Updated Date - 2021-06-02T06:41:23+05:30 IST