కట్టల మాటున కట్టడాలు

ABN , First Publish Date - 2021-04-22T05:39:29+05:30 IST

కట్టల మాటున కట్టడాలు

కట్టల మాటున కట్టడాలు
వన్‌టౌన్‌ కేఎల్‌ రావు పార్కు ప్రాంతంలో అక్రమ నిర్మాణం

నగరంలో భారీగా అక్రమ నిర్మాణాలు

మంత్రి అండతో ఇళ్ల మాఫియా వసూళ్లు

మునిసిపల్‌ అధికారులకూ వాటాలు

మేయర్‌ సొంత డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి

నిబంధనలు పాటిస్తే వీఎంసీకి రూ.40 లక్షల ఆదాయం

మంత్రి అనుచరులకు రూ.25లక్షలు ఇస్తే చాలు

సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే సవాలక్ష నిబంధనలు పెట్టే అధికారులు.. బడాబాబులు అక్రమంగా భారీ భవంతులు నిర్మిస్తున్నా కన్నెత్తి చూడట్లేదు. మంత్రి నీడలోని ఇళ్ల మాఫియా అండగా నిలవడంతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.కోట్లలో గండి పడుతోంది. మంత్రి ఖజానాకు మాత్రం మూటలు బాగానే చేరుతున్నాయి. ఇందుకు మేయర్‌ భాగ్యలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న 46వ డివిజన్‌ మినహాయింపేమీ కాదు. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌ : విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న 46వ డివిజన్‌లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మంత్రి అనుచరులు కొందరితో కలిసి టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఈ అక్రమ కట్టడాల యజమానుల నుంచి వసూళ్లు చేసుకుని జేబులు నింపుకొంటున్నారు. మేయర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌.. పైగా మంత్రి అనుచరులు అక్రమ కట్టడాలపై దృష్టిసారిస్తే తమ సీటుకు ఎసరు వస్తుందనే ఉద్దేశంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మంత్రి అనుచరులతో మిలాఖత్‌ అవుతున్నారు. వసూళ్లలో వాటాలు పంచుకోవడానికే పరిమితమవుతున్నారు.

అలా అడ్డుకున్నారు.. ఇలా మార్చేశారు..

కేఎల్‌ రావు పార్కు వద్ద, కోస్టల్‌ స్కూల్‌ వెనుక నిబంధనలకు విరుద్ధంగా ఓ భారీ నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. మంత్రి అనుచరులకు మామూళ్లు అందడంతో ఈ నిర్మాణం ఎలాంటి అడ్డంకి లేకుండా చేపడుతున్నారు. వారం క్రితం  టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఈ పనులు ఆపమంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేరుగా మంత్రి జోక్యం చేసుకుని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఆ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడి నుంచి మార్చేశారు.  ఆ తర్వాత మూడు రోజుల్లో భారీ నిర్మాణం శ్లాబు పనులు పూర్తి చేశారు. ఈ డీల్‌ విలువ రూ.25 లక్షలు అని సమాచారం. ఈ పరిణామంతో వీఎంసీ సిబ్బంది సైతం అక్రమ కట్టడాలను అడ్డుకోవడం కంటే వాటి నుంచి పిండుకోవడంపైనే దృష్టి సారించారు. కేఎల్‌ రావు పార్కు పక్కనే నిర్మించిన ఈ భారీ నిర్మాణానికి నిబంధనల ప్రకారం ఫ్లోర్‌ బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వీఎంసీకి రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ, మంత్రి అనుచరులు రూ.25 లక్షలు పిండేసి వీఎంసీకి రూ.40 లక్షలకు గండికొట్టారు. 46వ డివిజన్‌లో ఇలాంటి అక్రమ కట్టడాలు వీధికొకటి ఉన్నాయి. 

నగరమంతా ఇదే రూటు.. ఏరియాకో రేటు..

నగరమంతా ఇదే దందా నడుస్తోంది. పాత బస్టాండ్‌, బీసెంట్‌ రోడ్డు, జైహింద్‌ కాంప్లెక్స్‌, కృష్ణలంక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్మితమవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని కిందిస్థాయి సిబ్బందితో కలిసి మంత్రి అనుచరులు మాఫియాగా ఏర్పడి అక్రమ కట్టడాల యజమానుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. వ్యాపార కూడళ్లలో అక్రమ నిర్మాణాలకు ఒక  రేటు, శివారు ప్రాంతాల్లో మరో రేటు నిర్ణయించారు. చైన్‌మెన్లు ముందుగా అక్రమ కట్టడాల సమాచారాన్ని మంత్రి అనుచరులకు చేరవేస్తారు. వారు నేరుగా సదరు భవన యజమానితో బేరాలు సాగించి పేమెంట్‌ నిర్ణయిస్తారు. అంతా ఓకే అనుకుంటే ఆ బిల్డింగ్‌ మనదేనంటూ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లకు తెలియజేస్తారు. లేదనుకుంటే బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ భవనం ముందు మందీమార్బలంతో వాలిపోతారు. సవాలక్ష నిబంధనలు చెప్పి, యజమానిని భయపెట్టి దారిలోకి తెస్తారు. అప్పటికీ వినకుంటే నిర్మాణం ముందుకు సాగకుండా ఆపేయడమో.. కూల్చేయడమో చేస్తారు. బందరు రోడ్డులో ఇటీవల రెండు, మూడు భారీ అక్రమ నిర్మాణాలు జరిగాయి. రోడ్డును సైతం ఆక్రమించి నిర్మించారు. వీటికి సంబంధించి రూ.లక్షల్లో చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారే నేరుగా ఓ భవన నిర్మాణంలో సూత్రధారిగా వ్యవహరించి పని ముగించడం గమనార్హం. 

సామాన్యులది మరో బాధ

నగరంలో ఇళ్ల మాఫియా దందా సామాన్యుల సొంత ఇంటి కలను ఛిద్రం చేస్తోంది. తమకున్న చిన్న జాగాలో ఇల్లు కట్టుకుందామని శంకుస్థాపన చేసుకున్న మరుక్షణం గద్దల్లా వాలిపోతున్న మాఫియాను చూసి సామాన్యులు వణికిపోతున్నారు. వీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది సైతం ఈ మాఫియాతో జత కలవడంతో సామాన్యుడి ఇంటి నిర్మాణ బడ్జెట్‌లో మాఫియా వాటాకూ చోటు కల్పించాల్సిన పరిస్థితి. భారీ అక్రమ కట్టడాల నుంచి మంత్రి అనుచరుల స్థాయిలో వసూళ్లు జరుగుతుంటే, చిన్నచిన్న ఇళ్ల నిర్మాణదారుల నుంచి సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ సెక్రటరీలు, వీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కలిసి వసూళ్లు చేస్తున్నారు.  

అది అక్రమ నిర్మాణమే..

కేఎల్‌ రావు పార్కు వద్ద వద్ద జరుగుతున్నది అక్రమ నిర్మాణమే. త్వరలో నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటాం. 

- లక్ష్మణరావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి 

గట్టు దాటి ఘాట్లపైకి..

కృష్ణలంక : పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఫుడ్‌కోర్టులో కొందరు షాపు యజమానులు నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడ పద్మావతి ఘాట్‌లో నిర్మించిన ఫుడ్‌కోర్టులో ఓ షాపు  నిర్వాహకుడు ఇరిగేషన్‌ మంత్రి తమ బంధువంటూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేశారు. పద్మావతి ఘాట్‌ ప్రాంతంలో ఉన్న స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఓ వ్యక్తికి 12 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఆయన ఆ ఆవరణను ఫుడ్‌కోర్టుగా చేసి పలు షాపులకు అద్దెకు ఇచ్చారు. ఇలా షాపు తీసుకున్న ఓ వ్యక్తి పద్మావతి ఘాట్‌ను ఆక్రమించేసి రేకుల షెడ్డును నిర్మించారు. ఇంత జరుగుతున్నా వీఎంసీ అధికారులు కానీ, ఇరిగేషన్‌ అధికారులు కానీ అటువైపే చూడలేదు. ఈ ఘాట్‌పై నిర్మించిన స్టీల్‌ రెయిలింగ్‌ను సైతం ఆ షాపు నిర్వాహకుడు తొలగించేశారు. ఇరిగేషన్‌ మంత్రి తనకు బాల్యమిత్రుడని, అందుకే అధికారులెవరూ ఇటువైపు చూసే సాహసం చేయరని సదరు షాపు నిర్వాహకుడు చెబుతుండటం గమనార్హం. 








Updated Date - 2021-04-22T05:39:29+05:30 IST