టీచర్లకు నేటికీ జమ కాని రెమ్యునరేషన

ABN , First Publish Date - 2022-10-08T05:31:52+05:30 IST

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, వాటికి సంబంధించిన మూల్యాంకనం ముగిసి నెలలు గడిచింది. ఫలితాలు కూడా వచ్చా యి. కానీ పరీక్షల్లోనూ, స్పాట్‌లో పనిచేసిన సిబ్బందికి మాత్రం నేటికీ డబ్బులు చెల్లించలేదు. జూలై నెలలో పరీక్షలు, స్పాట్‌ నిర్వహణ పూర్తయినా ఇప్పటి వరకూ ఎవరికీ డబ్బులు చెల్లించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

టీచర్లకు నేటికీ జమ కాని రెమ్యునరేషన
స్పాట్‌లో పేపర్లు దిద్దుతున్న టీచర్లు (ఫైల్‌)

‘పది’ నిధులకు ‘స్పాట్‌’ పెట్టారా !

సప్లిమెంటరీ పరీక్షల డబ్బులపై తప్పని నిరీక్షణ 

జూలై 15నే ముగిసిన పరీక్షలు 

స్పాట్‌ డ్యూటీ డబ్బుల ఊసే వినిపించని దుస్థితి 

రూ.13 లక్షలపైనే చెల్లించాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం


అనంతపురం విద్య : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, వాటికి సంబంధించిన మూల్యాంకనం ముగిసి నెలలు గడిచింది. ఫలితాలు కూడా వచ్చా యి. కానీ పరీక్షల్లోనూ, స్పాట్‌లో పనిచేసిన సిబ్బందికి మాత్రం నేటికీ  డబ్బులు చెల్లించలేదు. జూలై నెలలో పరీక్షలు, స్పాట్‌ నిర్వహణ పూర్తయినా ఇప్పటి వరకూ ఎవరికీ డబ్బులు చెల్లించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్‌లో 657 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.2 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కేవలం స్పాట్‌లో పని చేసిన వారికే రూ. 13 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉన్నా... రెండున్నర నెలలు కావస్తున్నా రెమ్యునరేషన్‌ ఇవ్వకపో వడంపై విమర్శలు వస్తున్నాయి.  


పరీక్షల డ్యూటీ డబ్బులకు చెక్‌ పెట్టారా..!

2022 ఏడాది పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలైలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 112 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో 61, శ్రీసత్యసాయి జిల్లాలో 51 పరీక్షాకేంద్రాల్లో  26 వేల మంది విద్యార్థులకు జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించారు. 112 కేంద్రాలకు 112 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లతోపాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది వందలాది మంది పనిచేశారు. వారికి ఇప్పటి వరకూ రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు. దీనికితోడు 112 పరీక్షా కేంద్రాల నిర్వహణలో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ. 8 చొప్పున చెల్లించే కంటింజెన్సీ చార్జీలు కూడా ఇవ్వలేదని సమాచారం. ఇటు కేంద్రాల నిర్వహణ డబ్బులు అటు, పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి చెల్లించాల్సిన డబ్బులేవీ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


స్పాట్‌ డబ్బులు ఏవీ..? 

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌ జూలై 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్‌ హైస్కూల్‌లో స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం ఏర్పాటుచేసి జూలై 18,19,20 తేదీల్లో స్పాట్‌ నిర్వహించారు. పరీక్షల విభాగ అధికారుల లెక్కల ప్రకారం స్పాట్‌ విధుల్లో క్యాంపు ఆఫీసర్లు ఐదుగురు, చీఫ్‌ ఎగ్జామినర్లు ఎనిమిదిమంది, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 469 మంది, స్పెషల్‌ అసిస్టెంట్లు 180 మంది పనిచేశారు. అయితే వీరికి మూడు రోజుల కాలానికి ఒక్కొక్కరికి దాదాపు రూ.2వేలు వరకూ చెల్లించాలి. స్పాట్‌ డూటీలు ముగిసి  రెండున్నర  నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎవరికి రెమ్యునరేషన్‌డబ్బులు చెల్లించలేదు. అక్కడి నుంచి డబ్బులు వచ్చినా.. అధికారులు చెల్లించలేదా..? వచ్చిన వాటిని స్వాహా చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  


Updated Date - 2022-10-08T05:31:52+05:30 IST