అపూర్వ సంఘీభావం

ABN , First Publish Date - 2020-12-09T06:42:26+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి గురువారం నాడు దేశవ్యాప్తంగా అనూహ్యమైన...

అపూర్వ సంఘీభావం

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి గురువారం నాడు దేశవ్యాప్తంగా అనూహ్యమైన సంఘీభావం వ్యక్తమైంది. ఈ సమస్య ఒకటి రెండు రాష్ట్రాల సమస్య కాదని, ఉద్యమిస్తున్న రైతాంగం డిమాండ్లు యావత్ వ్యవసాయరంగ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నవని భారత్ బంద్-కు లభించిన స్పందన చాటి చెప్పింది. సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడి, ఢిల్లీ నగరంలో బైఠాయించిన లక్షలాది మంది రైతులు, దేశంలో రకరకాల ఉద్యమాలకు కూడా ప్రేరణగా మారుతున్నారు. చర్చల ప్రక్రియలో భాగంగా తరువాతి విడత చర్చలు బుధవారం నాడు జరగనున్నాయి. ఆ చర్చల కంటె ముందు కొత్త ప్రతిపాదనలపై మాట్లాడడానికి కాబోలు, మంగళవారం సాయంత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు ప్రతినిధులను సంప్రదింపులకు పిలిచారు.


మొత్తంగా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంలో తొలిమెట్లు ఈ చట్టాలని రైతుసంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ఏదో అనాలోచితంగా ఈ చట్టాలు తెచ్చిందని, తప్పును తన దృష్టికి తెస్తే సవరించుకుంటుందని ఉద్యమసంఘాలు భావించడం లేదు. కార్పొరేట్ దిగ్గజాలకు సహాయపడడం కోసమే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నారని విశ్వసిస్తూ, నిర్దిష్టంగా కేంద్రప్రభుత్వానికి సన్నిహితులుగా పేరుపడిన అంబానీ, అదానీలను పేరు పెట్టి మరీ ప్రస్తావిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంతో ఇంత భారీస్థాయిలో తలపడడం మన దేశంలో ఇదే ప్రథమం కావచ్చును. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతో లాభం జరుగుతుందని ఇంకా వాదిస్తూనే ఉన్న ప్రభుత్వం, అధికార పార్టీ, మరోవైపు తమ నిస్సహాయతను కూడా వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం. ప్రపంచ వాణిజ్యసంస్థ కట్టుబాట్లు, ప్రపంచీకరణ విధివిధానాలు- వ్యవసాయరంగానికి రక్షణలు కల్పించడానికి అనుమతించవని అధికారపార్టీ ప్రతినిధులు మీడియా చర్చల్లో వాదిస్తున్నారు. మరి ఆత్మనిర్భరత సంగతేమిటి? స్వదేశీ మాటేమిటి? చైనా మొబైల్ యాప్‌లను నిషేధించడం తప్ప, మరే విధంగానూ రక్షణచర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాదా? చైనాలో, అమెరికాలో, ఐరోపా దేశాలలో వ్యవసాయరంగానికి ఇస్తున్న సబ్సిడీలను చూస్తే, ప్రపంచీకరణ కాలంలో రక్షణలు ఉండవు అనే వాదన ఎంత అబద్ధమో తెలిసిపోతుంది. ఎవరు ఎంతగా తమ సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన స్వతంత్రతను ప్రదర్శిస్తారన్నది ముఖ్యం తప్ప, ప్రపంచ వాతావరణం కాదు. పంట తక్కువ పండిన దుర్భిక్ష కాలంలోను, తెగ పండిన సుభిక్ష కాలంలోనూ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కని దేశం మనది, అటువంటిది డిమాండ్ ఆధారంగా వ్యవసాయోత్పత్తులు మంచిధర పొందడం అన్నది కలలో మాట. ఉన్న మద్దతు ధర రక్షణ కూడా తీసివేస్తే బడా కార్పొరేట్ రాకాసుల ముందు బక్కరైతు నిరాయుధంగా నిలబడాలి!


ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలు ఇప్పటికీ సబ్సిడీ బియ్యాన్ని, గోధుమలను అందిస్తున్నాయి. సబ్సిడీలను వస్తురూపంలో కాదు, నగదురూపంలో ఇవ్వాలన్న ప్రపంచబ్యాంకు నిర్దేశాలను ఒక్కొక్క రంగంలో పాటిస్తూ వస్తున్న ప్రభుత్వాలు, రేపు సబ్సిడీ ఆహారాన్ని ఉపసంహరించుకుంటే, అప్పుడు భారత ఆహార సంస్థా ఉండదు, సేకరణా ఉండదు, మద్దతు ధరా ఉండదు. ఉత్పత్తి రేటు పెరుగుతున్న కాలంలో, ధాన్యాన్ని తెగనమ్ముకోవలసిన దుస్థితిలో రైతు పడిపోతాడు. ఇంత మాత్రమే కాదు, మారుమూల ప్రాంతాలలోని చిన్న కమతపు రైతు, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చునని చెప్పడం- పరిహాసం తప్ప మరొకటి కాదు. 


మనదేశపు వెనుకబాటుతనం లోని ఒక సానుకూల కోణం, రైతు అన్నా, వ్యవసాయం అన్నా ఇంకా సమాజం ఉద్వేగపూరితంగా స్పందించడం. మంగళవారం నాటి ఆందోళనకు లభించిన మద్దతుకు అదే కారణం. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రైతులకు అండగా నిలబడుతున్నారు. అనేకమంది, ఉద్యమకారులకు ఆర్థికమైన అండదండలందిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనను ప్రపంచమంతా గమనిస్తున్నది. ప్రవాస భారతీయులే కాదు, వారితోపాటు సంఘీభావంగా స్థానికులు కూడా అనేక దేశాలలో ఊరేగింపులలో, ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ఒకవైపు సామాజిక మాధ్యమాలలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేసే శక్తులు చేస్తూనే ఉన్నాయి. కానీ, రైతుల నైతికశక్తి ముందు ఆ జిత్తులేవీ పారడం లేదు. 


జనం పెద్దసంఖ్యలో పాలుపంచుకునే ఆందోళనలను కేంద్రమే కాదు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనా ఆందోళనకు పిలుపునివ్వడం ఆలస్యం, అర్ధరాత్రి ఇళ్ల మీద దాడులు, గృహనిర్బంధాలు, క్రూర చట్టాల విధింపు జరుగుతున్నాయి. భారత్ బంద్‌కు ఇప్పుడు సమర్థన ఇచ్చిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సాధారణంగా అనుసరించే విధానం అదే. కానీ, గట్టి సంకల్పం, సమీకరణ శక్తి ఉంటే, భారీ జన ఆందోళనలు ప్రారంభించడం, ప్రభావం చూపేంతదాకా కొనసాగించడం కూడా సాధ్యమేనని రైతు ఉద్యమం సూచిస్తున్నది. అయితే, ఇదే సమయంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను గుర్తు చేసుకోవలసి ఉన్నది. అది కూడా పార్లమెంటు ఆమోదాన్ని పొందిన తరువాత కూడా తీవ్ర వ్యతిరేకతను ప్రకటించిన ఉద్యమం. రహదారులపై ఉద్యమశిబిరం, దానికి సంఘీభావంగా అనేక ర్యాలీలు, విద్యార్థుల మద్దతు-... వీటన్నిటిని ప్రభుత్వం సహించలేకపోయింది. ఉద్యమకారులు మైనారిటీలు కావడంతో సామాజిక మాధ్యమాలలో విభజన వాదం విజృంభించింది. ఉద్యమకారులపై అనేక తీవ్రమైన కేసులు మోపారు. చివరకు న్యాయస్థానాలు కూడా పౌరులకు ఇబ్బంది కలిగే విధంగా వీధి ఆందోళనలు చేయవద్దని తెలిపింది. కరోనా కాలం వచ్చి, ఆ శిబిరం పూర్తిగా మూతపడింది. రైతాంగ ఉద్యమాన్ని కూడా అదేవిధంగా అణచివేయవచ్చునని వ్యతిరేకులు భావించారు. రైతుల మతాన్ని ఉపయోగించి, ముద్రలు వేయాలని చూశారు. కానీ, సాధ్యపడలేదు. మున్ముందు ప్రజా ఆందోళనలు ఈ అనుభవాల నుంచి నేర్చుకోవలసి ఉన్నది.

Updated Date - 2020-12-09T06:42:26+05:30 IST