తగ్గని గోదా‘వడి’!

ABN , First Publish Date - 2022-07-18T08:12:33+05:30 IST

తగ్గని గోదా‘వడి’!

తగ్గని గోదా‘వడి’!

ధవళేశ్వరం వద్ద 21.30 అడుగుల నీటిమట్టం

సముద్రంలోకి 25,05,109 క్యూసెక్కులు విడుదల

క్రమంగా తగ్గుముఖం పడుతున్న వరద ప్రవాహం

అంధకారంలో లంకలు.. బాధితులకు రాని సాయం

మురుగు వెళ్లే దారిలేక మునిగిన రాజమహేంద్రవరం 

కోనసీమ లంక గ్రామాల్లో బాధితుల ఆకలి కేకలు

మంత్రి విశ్వరూ్‌పను నిలదీసిన బాధితులు


రాజమహేంద్రవరం/అమలాపురం/ఏలూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే 10 అడుగులు పైగా తగ్గినా ధవళేశ్వరం వద్ద అరడుగు మాత్రమే తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ నీటిమట్టం 21.30 అడుగులుగా నమోదైంది. అర్ధరాత్రి తర్వాత 2గంటలకు 21.71 అడుగులకు చేరి 9గంటల వరకూ నిలకడగా ఉంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గడం మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 40 పాయింట్లు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాయంత్రం 6 గంటలకు 25,05,109 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో 71 అడుగుల వరకూ చేరిన వరద ఉదయం 6 గంటలకే 10 అడుగుల 80 పాయింట్లు తగ్గింది. సోమవారం నాటికి మరింత తగ్గనుంది. పోలవరం స్పిల్‌వే నుంచి 20,93,776 క్యూసెక్కులు దిగువకు వస్తోంది. 


ప్రభుత్వ సహకారం అంతంతే

ఈ వరదలో ప్రభుత్వ సహకారం పెద్దగా కనిపించలేదు. ఏదో ఏర్పాటు చేశామన్నట్టుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముంపు బాధితులను ఎక్కువగా తరలించలేదు. చాలామంది డాబాలపైకి ఎక్కారు. వైద్య శిబిరాలు మాత్రం ఏర్పాటు చేశారు. వరద నీటిలోని చేతిపంపులు ఉన్నచోట నీటిని తోడుకుంటున్నా అవి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మేత కొరతతో పశువులు గిజగిజలాడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని లంకలు, ఏజెన్సీ గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. 


మునిగిన రాజమహేంద్రవరం 

రాజమహేంద్రవరం వాననీటిలో మునిగింది. అనేక వీధులు జలమయం అయ్యాయి. ఈ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మురుగునీరు పోయే మార్గాలు సరిగ్గాలేవు. దీంతో ఐదు రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా గోదావరిలోకి వదిలేస్తుంటారు. గోదావరికి వరద రావడంతో ఈ రివర్‌ స్లూయిజ్‌లు మూసేశారు. దీంతో మురుగునీరు, వాననీరు వెళ్లడానికి మార్గంలేక వీధులన్నీ మునిగిపోయాయి. 


ప్రమాదకరంగా ఏటిగట్లు 

కోనసీమ జిల్లాలోని నదీ పాయలన్నీ ఏటిగట్లను తాకుతూ ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల గట్లను దాటుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వశిష్ఠ గోదావరి రాజోలు సమీపంలో ఏటిగట్టును దాటి ప్రవహిస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పి.గన్నవరం అక్విడెక్టు నుంచి వరద నీరు కాల్వల్లోకి చేరి నాగుళ్లంక వద్ద ప్రధాన రహదారి నీట మునగడంతో రాజోలు ప్రాంతానికి రవాణా స్తంభించింది. రాత్రి గడిస్తే చాలని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిరుపేద కుటుంబాల ఆకలి కేకలను పట్టించుకునే అధికారులే కరువయ్యారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో పార్వతి అనే మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. సఖినేటిపల్లిలో రొయ్యలు పట్టేందుకు వెళ్లి వరదల్లో కొట్టుకుపోతున్న పొన్నమండ పోతురాజును ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్టు సమాచారం.  


మరో 24గంటలు గడిస్తేనే..

పశ్చిమగోదావరి జిల్లాలో వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం తగ్గలేదు. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో అదివారం ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే నీటి ఉదృతికి చాలాచోట్ల గట్లు కోతలకు గురయ్యాయి. కొన్నిచోట్ల గట్లపై నుంచి నీరు ఊరకలేస్తోది. ఆచంట మండలం భీమలాపురంలో శుక్రవారం రాత్రి వరదనీటిలో గల్లంతైన వృద్ధురాలు ముత్యాలమ్మ మృతదేహం ఆదివారం లభ్యమైంది. నరసాపురం వద్ద గోదావరి ప్రమాద స్థాయిలో ఉంది. పాలకొల్లు- నరసాపురం రోడ్డుపై 5కిలోమీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. ఇటు పంట కాల్వలు పొంగి నీరు బయటకు వెళ్లడంతో చినమామిడిపల్లి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలకు భారీ వరద ముప్పు తప్పింది. ఐదురోజులుగా పసిపిల్లలకు పూర్తిస్థాయిలో పాలు అందించలేని పరిస్థితి ఉండగా, ఉన్నతాధికారులు జోక్యంతో శని, ఆదివారం నాటికి అక్కడక్కడ పిల్లలకు పాలు సరఫరా చేశారు.


మా కష్టాలు పట్టించుకునేదెవరు? 

పి.గన్నవరం మండలం లంకలగన్నవరంలో మంత్రి పినిపే విశ్వరూప్‌, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును గ్రామస్థులు చుట్టుముట్టి తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామం వద్ద వశిష్ఠ గట్టు బలహీన పడి లీకవుతుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని... తామే రాత్రంతా నిద్ర లేకుండా ఇసుక బస్తాలు వేసి రక్షించుకున్నామని గోడు వెళ్లగక్కారు. వేల మంది జనాభా ఉన్న తమ గ్రామానికి మంచినీరు తప్ప భోజనం గానీ, పాలు ప్యాకెట్లు గానీ, ఇతర ఏ సహాయం కూడా అధికారులు అందించలేదంటూ బాధితులు మంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి విశ్వరూప్‌ బాధితులకు పునరావాసంతో పాటు ఇతర సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. 















Updated Date - 2022-07-18T08:12:33+05:30 IST