అశాంతి, అసహనం

ABN , First Publish Date - 2022-01-22T06:21:57+05:30 IST

తప్పులు మీద తప్పులు చేస్తూ తానే ఒప్పు అనిపించుకుంటున్న దేవదాయ శాఖ జిల్లా స్థాయి అధికారి ఒకరు...సిబ్బందిని వేధించడం ఆపడం లేదు.

అశాంతి, అసహనం

దేవదాయ శాఖలో కొనసాగుతున్న మెమోలు, సస్పెన్షన్లు

వేధింపులు తట్టుకోలేకపోతున్నామని సిబ్బంది గగ్గోలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

సదరు అధికారి తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టుల్లో చుక్కెదురు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తప్పులు మీద తప్పులు చేస్తూ తానే ఒప్పు అనిపించుకుంటున్న దేవదాయ శాఖ జిల్లా స్థాయి అధికారి ఒకరు...సిబ్బందిని వేధించడం ఆపడం లేదు. ఎదుటి వారి వయసు, స్థాయి చూడకుండా నోటికి వచ్చినట్టు దూషిస్తున్నారు. ఆ అధికారిని భరించలేక సిబ్బంది మూడు నెలల క్రితం ధర్నా చేశారు. అప్పటి నుంచి కక్ష కట్టి ఆ ధర్నాలో పాల్గొన్న వారిని ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అధికారిణిని సరండర్‌ చేసి, శ్రీకాకుళం బదిలీ చేయించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన నర్సీపట్నం గ్రూపు ఆలయాల ఈఓ శర్మను ఏదో అభియోగంపై సస్పెండ్‌ చేశారు. తాజాగా పెందుర్తిలో వెంకటాద్రి ఆలయానికి వెళ్లి, భక్తుల ముందే అక్కడి పూజారిని దూషించి సస్పెండ్‌ చేయించారు. ఆ ఆలయ ఈఓకు చార్జిమెమో ఇచ్చారు. ఆ ఇద్దరూ శారదా పీఠం స్వామిని ఆశ్రయించడంతో పూజారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఈఓను మాత్రం అధికారి కనికరించలేదు. తనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టారనే కక్షతో ఆయన్ను ఎలాగైనా సస్పెండ్‌ చేయాలని యత్నిస్తున్నారు.  


కోర్టుల్లో వీగిపోతున్న అధికారి నిర్ణయాలు

జిల్లా అధికారి తీసుకున్న నిర్ణయాలు అడ్డగోలుగా వున్నాయని బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుంటే...అక్కడ వారికి ఊరట లభిస్తోంది. ఆ నిర్ణయాలన్నీ అక్కడ వీగిపోతున్నాయి. అందులో మొదటిది సంపత్‌ వినాయగర్‌ ఆలయం. ఫిర్యాదులు వచ్చాయని, నిర్వహణ బాధ్యతలను వ్యవస్థాపక ధర్మకర్త నుంచి తప్పించి స్వయంగా జిల్లా అధికారే తీసుకున్నారు. అయితే వారు కోర్టును ఆశ్రయించడంతో తిరిగి ధర్మకర్తలకే ఆలయ బాధ్యతలు వచ్చాయి. తాజాగా కేజీహెచ్‌ దగ్గరున్న బెల్లం వినాయకుడి ఆలయంపై ఫిర్యాదులు వచ్చాయని సింగిల్‌ ట్రస్టీని నియమించారు. దానిపై ఆలయ పూజారి హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్‌ ట్రస్టీ నియామకం చెల్లదని ఈ నెల మొదటి వారంలో హైకోర్టు స్పష్టంచేసింది. అక్కడ అవకతవకలు వున్నాయని రుజువైతే దేవదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు ట్రస్టీని కాకుండా ఈఓనే నియమించుకోవచ్చునని పేర్కొంది. దాంతో ఆ ఆలయ బాధ్యతలు మళ్లీ పూజారికే దఖలు పడ్డాయి. పాయకరావుపేటలో పాండురంగ స్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో దుకాణాలు ఉండగా, వాటిని ఇటీవల జిల్లా అధికారి దగ్గరుండి 30 మంది సిబ్బందితో ఖాళీ చేయించారు. వారంతా కోర్టును ఆశ్రయించగా, వారికే అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. అల్లిపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి దొండపర్తి మెయిన్‌రోడ్డులో కొంత స్థలం ఉండగా, అందులో వారసులమని కొందరు నిర్మాణం చేపట్టారు. జిల్లా అధికారి ఆకస్మికంగా ఓ రోజు వెళ్లి అక్కడ నిర్మాణాన్ని తొలగించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. స్థానిక ఈఓ సకాలంలో స్పందించకపోవడం వల్లే వారికి మేలు జరిగిందంటూ బంతిని అటు వైపు తోసేశారు. ఏ ఆలయానికి సంబంధించిన విషయమైనా...నిబంధనల ప్రకారం కాకుండా అక్కడ సిబ్బందిని, అనుభవదారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆ శాఖ సిబ్బంది అంటున్నారు. అయితే ఆ అధికారికి రాజకీయ అండ వుండడంతో సిబ్బంది తమ బాధల్ని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. తాము నోరు విప్పితే బదిలీ చేయించడమో లేక ఆరోపణలు మోపి సస్పెండ్‌ చేయించడమో చేస్తారని అంటున్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని, అంతవరకు వేచి చూస్తామని చెబుతున్నారు. 

Updated Date - 2022-01-22T06:21:57+05:30 IST