ఎదురులేని ‘నయా షాజహాన్’

ABN , First Publish Date - 2021-01-10T06:56:08+05:30 IST

రాజనీతిజ్ఞుడు ప్రణబ్‌ముఖర్జీ జీవన ప్రస్థానంలో ఆఖరి ఘట్టం రాష్ట్రపతి భవన్. ఆయన జ్ఞాపకాల నాలుగవ సంపుటి ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్: 2012–2017’ ఒక ఆసక్తికరమైన...

ఎదురులేని ‘నయా షాజహాన్’

రాజనీతిజ్ఞుడు ప్రణబ్‌ముఖర్జీ జీవన ప్రస్థానంలో ఆఖరి ఘట్టం రాష్ట్రపతి భవన్. ఆయన జ్ఞాపకాల నాలుగవ సంపుటి ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్: 2012–2017’ ఒక ఆసక్తికరమైన ఆత్మకథ మాత్రమే కాదు, నడిచిన చరిత్ర తీరుతెన్నులు, గుట్టుమట్టులను వెల్లడించిన, వివరించిన, విశ్లేషించిన గ్రంథం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి తన అభిప్రాయాలను ప్రణబ్ నిర్మొహమాటంగా చెప్పారు. మోదీ వ్యవహార శైలిని నిశితంగా, లోతుగా, విశాల దృక్పథంతో విమర్శించారు. మోదీని గురించిన చాలామంది అంచనాను ప్రణబ్ విమర్శలు స్పష్టంగా ధ్రువీకరించాయి. అయితే ప్రధాన స్రవంతి మీడియా యథాప్రకారం ఈ సత్యాన్ని ఉపేక్షించింది. ప్రధాని మోదీపై విమర్శలను ప్రజలు వినడం, చదవడం ప్రభుత్వానికి ఎంతమాత్రం సమ్మతం కాదని రుజువయింది. ప్రసార, సమాచార సాధనాలపై పాలకుల నియంత్రణ మూలంగా ప్రణబ్ చెప్పిన నిజాలు ప్రజలకు చేరలేదు.

మోదీ పాలనపై ప్రణబ్ మనసులోని మాటలు ఏమిటో వింటారా! (1) పార్లమెంటు సరైన తీరులో సుగమంగా పనిచేసేలా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఈ విధ్యుక్తధర్మ నిర్వహణలో మోదీ సర్కార్ విఫలమయింది. (2) మోదీ పాలనా శైలి నిరంకుశమైనది. (3) 2015 డిసెంబర్‌లో కాబూల్ నుంచి స్వదేశానికి తిరిగివస్తూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు లాహోర్‌లో ఆగడం అనావశ్యక మర్యాద, వ్యర్థ దౌత్యం. (4) విదేశీనాయకులతో తన వ్యక్తిగత సంబంధాలను గొప్పగా చాటుకోవడం మోదీకి పరిపాటి. (5) భారత సైనిక దళాలు సరిహద్దులు దాటి పాకిస్థాన్ భూభాగాలలో సర్జికల్ దాడులు నిర్వహించడమనేది సాధారణ సైనిక కార్యకలాపమే. వాటికి అమిత ప్రచారం కల్పించవలసిన అవసరం లేదు. (6) ప్రణాళికాసంఘాన్ని రద్దు చేయడం ఒక తప్పు మాత్రమే కాదు, ఒక మహాపరాధం కూడా. (7) డిమానిటైజేషన్ (నోట్ల రద్దు) ప్రకటిత లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. (8) జపాన్‌తో భారత్‌కు మొదటి నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాతనే భారత్, జపాన్‌ల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయనే భావాన్ని ప్రజల్లో కలుగజేసేందుకు ప్రయత్నించడం సబబు కాదు. 

ఇవి చదివిన తరువాత మీకు ఏమినిపిస్తోంది? మోదీని ప్రణబ్ తప్పుపట్టారనే కదూ? అవును, ప్రణబ్ విమర్శలు అభియోగాలే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రూపొందుతున్న చరిత్రకు  దేశ సార్వభౌమాధినేతగా ప్రణబ్‌ ప్రత్యక్ష సాక్షి. తన హయాంలోని పాలకుల నిర్ణయాలు, సంభవించిన సంఘటనల పూర్వాపరాల సూక్ష్మ వివేచన ఆయనకే సాధ్యమైన కార్యం. మోదీ పాలన గురించిన సత్యాలను ప్రణబ్ ఇప్పుడు జాతికి నివేదించారు. మరి ఇది అబద్ధాల, ఆన్యాపదేశాల, అర్ధ-సత్యాల కాలం కదా. అందునా ప్రజల ఆలోచనలను ప్రచార ప్రభావమే కట్టడి చేస్తున్న ఈ యుగంలో సత్యాల నివేదన వల్ల ప్రయోజనమేముంది? 

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత సంభవించిన సంఘటనలను, ప్రజలకు వాటిని నివేదిస్తున్న తీరు తెన్నుల ప్రభావాన్ని వాస్తవికంగా అర్థం చేసుకోవడం లేదేమో?! ఒక ఉదాహరణ చెబుతాను. 2019 సార్వత్రక ఎన్నికల సందర్భంగా నేను మా సొంత ఊరు (జార్ఖండ్ లోని) హజారీబాగ్‌కు వెళ్ళాను. అక్కడ మా ఇంటికి ఒక కుటుంబం వచ్చింది. పదేళ్ళు నిండని ఒక బుడతడు కూడా తల్లిదండ్రులతో పాటు వచ్చాడు. సాధారణంగా అటువంటి సందర్భాలలో కన్నవారు తమ బిడ్డల ప్రతిభా పాటవాలను ప్రదర్శింపచేయడం కద్దు. ఓటుహక్కు ఉన్నట్టయితే ఎవరికి ఓటు వేసేవాడివో చెప్పమని ఆ బుడతడిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ బాలుడు తొలుత సంకోచించాడు. మరీ మరీ ప్రోద్బలించడంతో నరేంద్ర మోదీకి వేస్తానని ఆ బుడతడు చెప్పాడు. బీజేపీ పేరు ప్రస్తావించనేలేదు. తల్లిదండ్రులు అంతటితో సంతోషించలేదు. ‘మోదీకే ఓటు ఎందుకు వేస్తావో కూడా చెప్పు’ అని సుపుత్రుడికి సూచించారు. వాడు ఈసారి ఏ మాత్రం వెనుకాడకుండా ‘పాకిస్థాన్ పీచమణిచాడు కదా’ అని సమాధానమిచ్చాడు. నేను నిర్ఘాంతపోయాను. 

ప్రచార శక్తి ఏమిటో అర్థం కాలేదూ? నరేంద్ర మోదీ తాను మొదటిసారి గుజరాత్ శాసనసభా ఎన్నికల సమరానికి నాయకత్వం వహించినప్పుడు ఆయన ప్రధాన ప్రచారాయుధం ‘మియాన్ ముషార్రఫ్’! 2019 సార్వత్రక ఎన్నికలలోనూ ఆయన ప్రచారాస్త్రం పాకిస్థాన్ భూభాగాలలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన విజయవంతంగా నిర్వహించిన దాడులే కాదూ? ఎన్నికలలో పూర్తి విజయం సాధించేందుకు పాకిస్థాన్ అంశాన్ని ఎంతగా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకోవడంలో మోదీ మహా నిపుణుడు. మోదీ అనుసరించిన ఈ వ్యూహం ఎందుకు ఫలిస్తోంది? మతపరమైన భావోద్వేగాలు ప్రజలను నిర్దేశించిన దిశలో నడిపిస్తాయి . మరి ఆ భావోద్వేగాలను పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రేరేపించినప్పుడు ఇక చెప్పేదేముంది? పాక్ భూభాగాల్లో సర్జికల్ దాడుల గురించి అడ్డూ అదుపులేని ప్రచారం మన దేశంలోని సామాన్య ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎలా ఉంటుంది? ఆ సర్జికల్ దాడులు సాధారణ సైనిక కార్యకలాపాలలో భాగమేనని ప్రణబ్ ముఖర్జీ, ఇంకా పలువురు భావించి ఉండవచ్చు గాక. అయితేనేమి, ఆ దాడులు 1971లో పాకిస్థాన్ పై తిరుగులేని గెలుపు, 93 వేల మంది పాక్ సైనికుల లొంగుబాటు, బంగ్లాదేశ్ ఆవిర్భావం కంటే పెద్ద విజయం అన్న విధంగా జరిగిన ప్రచారం లక్ష్య పరిపూర్తికి తోడ్పడకుండా ఎలా ఉంటుంది? 

ఇప్పుడు మనం మతతత్వం, సైనికవాదం, జాతీయవాదం కలగలిసిన భావోద్వేగపూరిత ప్రచార హోరును వింటున్నాం, కంటున్నాం. ఇటువంటి ప్రచారాన్ని చైనా కంటే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిర్వహించడం సులువు. ఎందుకంటే పాకిస్థాన్ ఇస్లామిక్ దేశం కదా. చైనా సంగతి వేరు. గల్వాన్ ఘటన అనంతరం మనం చైనాతో అన్నిస్థాయిల్లో అనంతంగా చర్చలు జరుపుతూనే ఉన్నాం. అయితే పాకిస్థాన్ విషయానికి వచ్చేసరికి మన ఛాతీలు ఒక్కసారిగా 26 నుంచి 56 అంగుళాలకు విస్తరిస్తాయి! 

చరిత్రలో తోసుకొచ్చిన నిరంకుశ పాలకులు అందరిదీ ఒకటే తీరు సుమా! వారు ఒక శత్రువును గుర్తిస్తారు. ఆ శత్రువు మీ మనుగడకే ముప్పు అని ప్రజల మనస్సులలోకి ఎక్కిస్తారు. భీతావహులను చేస్తారు. వారి భయాందోళనలను ఉపయోగించుకుని అధికారంలో శాశ్వతంగా కొనసాగేందుకు పూనుకుంటారు. నాజీ జర్మనీలో ఇదే జరిగింది. జర్మన్ జాతికి ప్రథమ శత్రువు యూదులే అని అడాల్ఫ్ హిట్లర్ ఘోషించాడు. సోవియట్ యూనియన్‌లో బూర్జువాలు ప్రజాశత్రువులని కమ్యూనిస్టులు ఆక్రోశించారు. భారత్ మన ఆజన్మ శత్రువు అంటూ పాకిస్థాన్ సైన్యం పబ్బం గడుపుకుంటోంది. మతం, భాష, ప్రాంతం, వర్గం, ఆర్థిక హోదాతో పాటు మన విషయంలో ప్రత్యేకించి కులం మొదలైనవి విభజనరేఖలుగా ఉన్నాయి. ప్రజాశత్రువు స్వదేశీయుడు కావచ్చు లేదా బాహ్య దేశస్తుడు కావచ్చు. మన విషయంలో అయితే దేశంలోని మైనారిటీలు, పొరుగు పాకిస్థాన్‌ను భారత్ శత్రువుగా పరిగణించడం పరిపాటి అయిపోయింది. 

భారత్ ప్రథమపౌరుడిగా తన అనుభవాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహారశైలి, ఆయన పాలనా పద్ధతులపై ప్రణబ్‌ముఖర్జీ తన అభిప్రాయాలను సూటిగానే చెప్పారు. మోదీ పాలనపై సరైన అంచనా వేశారు. అయితే ఆ సత్య నివేదన ఎవరికి కావాలి? పట్టించుకునేది ఎవరు? బహుశా, నేను పొరపడ్డానేమో! గతంలో ప్రభుత్వానికి, ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినప్పుడు నాపై విమర్శలు వెల్లువెత్తేవి. అత్యంత నీచంగా నన్ను దూషించేవారు. అయితే ఇప్పుడు ఆ విమర్శకులు నా పట్ల సంయమనం చూపుతున్నారు. అసహ్యకరమైన నిందలు మోపడం లేదు. పైగా నాతో ఏకీభవిస్తున్నారు! అధికారం మన చేతుల్లోంచి జారిపోతున్న నాడు అది మరింతగా మన పట్టులో ఉందని భావించడం కద్దు. ఇది, నా మాటకాదు సుమండీ. దివంగత ప్రధానమంత్రి చంద్రశేఖర్ తరచు ఈ సుభాషితాన్ని చెబుతుండేవారు. 

సరే, మన కొత్త షాజహాన్ (వీరెవరో మరి చెప్పాలా?)కు ప్రస్తుతానికి ఎదురే లేదు. ఆయన్ని ఎవరూ ఆపలేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన కొత్త సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఎట్టకేలకు సుప్రీంకోర్టు అనుమతి కూడా పొందింది. గత నెలలో కొత్త పార్లమెంటు భవనానికి భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానమంత్రికి అనుమతి ఇచ్చినప్పుడే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు న్యాయవ్యవస్థ నుంచి ఎటువంటి అడ్డంకులు, అభ్యంతరాలు ఎదురుకాబోవనే నిజం తేటతెల్లమయింది. ప్రభుత్వాధినేత మనోరథానికి విరుద్ధమైన అభిభాషణను గౌరవనీయ న్యాయమూర్తులు తమ తీర్పు వెలువరించే సమయంలో రవ్వంత కూడా చేయలేదు మరి. మహా మొగల్ చక్రవర్తి షాజహాన్ వలే ప్రస్తుత షాజహాన్ సైతం ప్రజాహిత కార్యాలతో కాకపోయినా కనీసం మహాసౌధాల నిర్మాణంతో అయినా చరిత్రపై తన చెరగని ముద్ర వేస్తాడు. పూర్వ ప్రధానమంత్రుల కీర్తికాంతులు ప్రస్తుత ప్రధానమంత్రి పేరుప్రతిష్ఠల ముందు వెలవెలబోతాయి. 

అధినేత ఆదేశాలను అమలుపరిచే మహాశయులను అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. దౌత్యవేత్తగా వృత్తి జీవితాన్ని పూర్తిచేసుకున్న విదేశాంగశాఖ అధికారి ఒకరు లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన హఠాత్తుగా పట్టణాభివృద్ధి వ్యవహారాలలో నిపుణుడుగా మారిపోయారు! ‘బాస్’ కృప ఉన్నంతవరకే మనుగడ ఉంటుంది. మరి రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే అధినాయకుడు ఆదేశించిన విధంగా వ్యవహరించాల్సిందే. ఢిల్లీ సుల్తానేట్ పరిపూర్ణంగా విలసిల్లుతోంది. సుల్తాన్‌తో పాటు ‘బానిసలు’ వర్ధిల్లుతున్నారు. చరిత్ర తనను తాను పునరావృతం చేసుకోదని ఎవరు అన్నారు?

యశ్వంత్ సిన్హా 

మాజీ కేంద్ర మంత్రి

(ది వైర్)

Updated Date - 2021-01-10T06:56:08+05:30 IST