పరిశుభ్రత గాలికి..

May 8 2021 @ 23:10PM
ఆమదాలవలసలోని కంటైన్మెంట్‌ జోన్‌లో పారిశుధ్య నిర్వహణ ఇలా..

 కరోనా వేళ కానరాని పారిశుధ్య నిర్వహణ

 బ్లీచింగ్‌, హైపోక్లోరైడ్‌ జాడలేదు

 కంటైన్మెంట్‌ జోన్‌లలోనూ అరకొర పనులు

విడుదల కాని ప్రత్యేక నిధులు

 కంపుకొడుతున్న పల్లెలు, పట్టణాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పాలకుల మాటలకు.. చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశుధ్య  పనులకు పెద్దపీట వేయాలి. కానీ, జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మొదటి దశలో ఏదైనా ఒక వీధిలో పాటిజివ్‌ కేసు వస్తే పాలకులు, అధికారులు నానా హంగామా చేసేవారు. ఆ వీధిలో బ్లీచింగ్‌ చల్లించడంతో పాటు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించేవారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించేవారు. కానీ, ప్రస్తుత కరోనా రెండో దశలో పరిస్థితి చేయి దాటిపోతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం బ్లీచింగ్‌ చల్లడం, హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న పట్టణ వీధుల్లో అక్కడక్కడా మొక్కుబడిగా బ్లీచింగ్‌ చల్లి మమ అనిపిస్తున్నారు. గతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో లేదా వీధిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా వీధిలో అందరి ఇళ్ల ముందు బ్లీచింగ్‌ చల్లించేవారు. కనీసం పదిరోజుల పాటు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఆ ప్రాంతంలో పిచికారీ చేయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కంటైన్మెంట్‌ జోన్‌లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం బోర్డులు, బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో కంటైన్మెంట్‌ జోన్‌లలో కూడా జన సంచారం పెరిగిపోయి వైరస్‌ మరింతగా విస్తరిస్తోంది. ఆసుపత్రుల్లో అందరికీ బెడ్లు దొరకడం లేదు. వేల సంఖ్యలో బాధితులు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. వైరస్‌ విజృంభిస్తున్న ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాల్సిన బాధ్యత స్థానిక పాలకులపై ఉంటుంది. ఇటీవల సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో చాలామంది  ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. కొంతమంది బాధ్యతలు చేపట్టినా వారికి చెక్‌ పవర్‌ లేదు. దీంతో నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్య పనులు పడకేశాయి.


మంజూరుకాని ప్రత్యేక నిధులు

కొవిడ్‌ వేళ పంచాయతీల్లో పారిశుధ్య పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు కావడం లేదు. దీంతో అధికారులు సాధారణ నిధులనే (జనరల్‌ ఫండ్స్‌) వినియోగించి పారిశుధ్య పనులు చేపడుతున్నారు. బ్లీచింగ్‌ కొనుగోలు చేస్తున్నారా? లేదా?.. ఎక్కడైనా సరఫరా చేశారా? లేదా? అన్న విషయాలను జిల్లా పంచాయతీ, నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించడం లేదు. జిల్లాలో వివిధ పంచాయతీలు, వార్డుల్లో ప్రత్యేకాధికారులు ఇప్పటికే పారిశుధ్య పనుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు.  ఇప్పుడు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ, వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.