కుదుటపడని పాలన

ABN , First Publish Date - 2022-08-15T06:19:20+05:30 IST

కొత్త జిల్లాలు ఏర్పాటై నాలుగు నెలలు దాటినప్పటికీ అనకాపల్లి జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలు ఇంకా పూర్తిస్థాయిలో కుదురుకోలేదు.

కుదుటపడని పాలన
ఒకే గదిలో విధులు నిర్వహిస్తున్న జిల్లా అగ్నిమాపక అధికారి, సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌

కొత్త జిల్లా ఏర్పాటై నాలుగు నెలలైనా బాలారిష్టాలను దాటని వైనం

అద్దె భవనాల్లో పలు కార్యాలయాలు

నివాస ప్రాంతాల్లోనూ ఏర్పాటు

అరకొర వసతితో ఉద్యోగుల ఇక్కట్లు

ఏ కార్యాలయం ఎక్కడుందో తెలియక జనం పాట్లు

చోడవరంలో జలవనరులు, నర్సీపట్నంలో డీఎఫ్‌ఓ ఆఫీసులు

విశాఖ నుంచి పాలన సాగిస్తున్న కేంద్ర ప్రాయోజిత కార్యాలయాలు


అనకాపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలు ఏర్పాటై నాలుగు నెలలు దాటినప్పటికీ అనకాపల్లి జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలు ఇంకా పూర్తిస్థాయిలో కుదురుకోలేదు. శంకరంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయాలు మినహా చాలా ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు బాలారిష్టాలను దాటలేదు. అరకొర వసతి వున్న అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలకు కార్యాలయాలు నిర్వహించే భవనాలు లభించకపోవడంతో నివాస భవనాల్లో ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఇవి కూడా ప్రధాన రహదారుల పక్కన కాకుండా లోపలి ప్రాంతాల్లో వుండడంతో ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ వున్నాయో తెలుసుకోవడం ప్రజలకు కష్టతరంగా మారింది.     

జిల్లాల పునర్విభజన తరువాత విశాఖ నుంచి 42 ప్రభుత్వ శాఖలను అనకాపల్లి తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా (పీడీ) కార్యాలయాన్ని పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న కశింకోట సీడీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ అధికారులు చోడవరం ఈఈ కార్యాలయం నుంచి, అటవీ శాఖ అధికారులు నర్సీపట్నం సబ్‌ డీఎఫ్‌ఓ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్యకలాపాలు నిర్వహించే జాతీయ విద్యా మిషన్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌, పథకాల కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. అనకాపల్లి జిల్లా పరిపాలన వ్యవహారాలను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రం నుంచి నడుపుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కార్యాలయాలను గతంలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌లో పలు శాఖలు

శంకరం గ్రామంలోని ఒక ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌లో ఏ, బీ, సీ, డీ సెక్షన్‌లతోపాటు చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి రెవెన్యూ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), గ్రామీణ తాగునీటి సరఫరాల, మత్స్య శాఖ, పంచాయతీరాజ్‌, జిల్లా పౌరసరఫరాలు, జిల్లా పౌరసరఫరాల మేనేజరు, భూసర్వే శాఖల కార్యాలయాలు వున్నాయి. 

ఇరుకైన అద్దె భవనాల్లో..

జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్నింటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిల్లో వసతి చాలకపోవడంతో అధికారులు, సిబ్బందితోపాటు వివిధ పనులమీద వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లా అగ్నిమాపక కార్యాలయం పరిస్థితి దారుణంగా వుంది. ఉడ్‌పేటలో గతంలో వున్న ప్రాంతీయ అగ్నిమాపక కేంద్రంలో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లా కార్యాలయం నిర్వహణకు అవసరమైన వసతి లేదు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి(డీఎఫ్‌ఓ), సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఒకే గదిలో విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా ఖజానా కార్యాలయాన్ని నెహ్రూచౌక్‌ సమీపంలోని ఒక దుకాణ సముదాయం మొదటి అంతస్థులో, జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాన్ని లక్ష్మీనారాయణనగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని ఏర్పాటు చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, తూనికలు-కొలతలు, ఔషధ నియంత్రణ జిల్లా అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇరుకైన అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 



Updated Date - 2022-08-15T06:19:20+05:30 IST