ఏడెనిమిది విడతల్లో యూపీ ఎన్నికలు.. 5న పోల్ షెడ్యూల్..!

ABN , First Publish Date - 2021-12-16T02:19:12+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను జనవరిలో..

ఏడెనిమిది విడతల్లో యూపీ ఎన్నికలు.. 5న పోల్ షెడ్యూల్..!

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను జనవరిలో ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 5న షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నట్టు తాజా సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి మార్చి మొదటివారం నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని, 7 నుంచి 8 విడతల్లో పోలింగ్ ఉండవచ్చని ఈసీ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది మే నెలతో ప్రస్తుత యూపీ అసెంబ్లీ గడువు ముగియనుండగా, తక్కిన నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు 2020 మార్చిలో (వేర్వేరు తేదీలు) ముగియనున్నాయి.


కాగా, అసెంబ్లీ ఎన్నికల సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుండగా, మరోవైపు ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో లాంఛనంగా పర్యటనలు మొదలుపెట్టింది. ఈ రెండు పరిణామాలను విశ్లేషిస్తే ఐదు రాష్ట్రాల....ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంసిద్ధతను సమీక్షిచేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర బుధవారంనాడు పంజాబ్‌లో పర్యటించారు. దీని తర్వాత వచ్చే వారంలో గోవాలోనూ, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లోనూ ఈసీ టీమ్ పర్యటించనుంది. ఆయా పర్యటనల్లో రాష్ట్ర అధికారులు, భాగస్వాములతో కలిసి ఎన్నికల సంసిద్ధత, అక్కడి పరిస్థితిని ఈసీ టీమ్ అంచనా వేస్తుంది. ఓటర్ల జాబితా అప్‌డేషన్, కోవిడ్-ప్రోటోకాల్స్, తదితర అంశాలను ఈ బృందం పరిగణనలోకి తీసుకుంటుంది. తమ పర్యటనల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశమవుతుంది.

Updated Date - 2021-12-16T02:19:12+05:30 IST