Dalit Girls Murder Case : రాబోయే తరాలు వణికిపోయేలా కఠిన శిక్ష : యూపీ ఉప ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-09-15T19:01:30+05:30 IST

దళిత మైనర్ బాలికలపై అత్యాచారంచేసి, వారిని హత్య

Dalit Girls Murder Case : రాబోయే తరాలు వణికిపోయేలా కఠిన శిక్ష : యూపీ ఉప ముఖ్యమంత్రి

లక్నో : దళిత మైనర్ బాలికలపై అత్యాచారంచేసి, వారిని హత్య చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ (Brajesh Pathak) గురువారం చెప్పారు. రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా వీరిని శిక్షిస్తామని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను  పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు (UP Police) తెలిపిన వివరాల ప్రకారం, లఖింపూర్ జిల్లాలో ఇద్దరు దళిత మైనర్ అక్కచెల్లెళ్ళపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, వారిని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వీరిద్దరి మృతదేహాలను బుధవారం గుర్తించారు. ఈ కేసులో నిందితులైన ఛోటు, జునెయిద్, సుహెయిల్, కరీముద్దీన్, అరిఫ్; హఫీజుర్ రహమాన్‌లను అరెస్టు చేశారు. 


అక్కచెల్లెళ్ళిద్దరికీ నిందితులతో బాగా పరిచయం ఉందని, ఇష్టపూర్వకంగానే నిందితులతో కలిసి మోటార్ సైకిళ్ళపై వెళ్ళారని పోలీసులు చెప్పారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెలను ఈ నిందితులు అపహరించి, తీసుకెళ్ళారని ఆరోపించారు. ఈ అక్కచెల్లెళ్ళ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఛోటు తన స్నేహితులతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి, తనను కొట్టి, తమ కుమార్తెలిద్దరినీ బలవంతంగా లాక్కెళ్ళారని తెలిపారు. 


లఖింపూర్ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బాధిత బాలికలు, నిందితులు స్నేహితులని తెలిపారు. జునెయిద్, సొహెయిల్ బుధవారం మోటారు సైకిల్‌పై ఈ బాలికల ఇంటికి వెళ్ళి, వారిని తీసుకెళ్ళారన్నారు. ఆ బాలికలను నిందితులు అపహరించలేదని, ఇష్టపూర్వకంగానే వారు వెళ్ళారని తెలిపారు తమను పెళ్లి చేసుకోవాలని సొహెయిల్, జునెయిద్‌లను వారు కోరడంతో, వారిపై అత్యాచారం చేసి, ఉరి తీసి చంపేశారని చెప్పారు. ఈ బాలికల ఇంటికి పొరుగింట్లో ఉంటున్న ఛోటు ఈ ఇద్దరినీ మిగిలిన నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. ఛోటును కూడా అరెస్టు చేశామన్నారు. 


ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా ఈ కేసులో దోషులను శిక్షిస్తామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామన్నారు. తాను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే అంశంపై కూడా దర్యాప్తు జరుపుతామన్నారు. అపరాధం చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఈ సంఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 


Updated Date - 2022-09-15T19:01:30+05:30 IST