మాస్క్ ధరించని వ్యక్తికి రూ.10 వేల జరిమానా!

ABN , First Publish Date - 2021-04-20T22:26:43+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో మాస్క్ ధరించని ఓ వ్యక్తికి అధికారులు తొలిసారి రూ.10 వేల జరిమానా విధించారు. మాస్క్ ధరించకుండా అతడు పట్టుబడడం..

మాస్క్ ధరించని వ్యక్తికి రూ.10 వేల జరిమానా!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మాస్క్ ధరించని ఓ వ్యక్తికి అధికారులు తొలిసారి రూ.10 వేల జరిమానా విధించారు. మాస్క్ ధరించకుండా అతడు పట్టుబడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు కూడా అతడు మాస్క్ ధరించకుండా చిక్కడంతో రూ.1000 జరిమానా విధించారు. డ్యోరియా జిల్లా బరియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమర్‌జిత్ యాదవ్ అనే వ్యక్తి ఈ నెల 17, 18 తేదీల్లో మాస్క్ ధరించకుండా తిరిగినట్టు పోలీసులు తెలిపారు. లార్ స్టేషన్ హౌస్ అధికారి టీజే సింగ్ మాట్లాడుతూ.. ‘‘సోమవారం లార్ మెయిన్ క్రాసింగ్ వద్ద అమర్‌జిత్ మాస్క్ ధరించకుండా కనిపించాడు. దీంతో వెంటనే అధికారులు అతడికి రూ.10 వేల జరిమానా విధించారు. మేము వాస్తవానికి ఏప్రిల్ 18నే మాస్క్ ధరించకుండా పట్టుబడిన అతడిని రూ.1000 జరిమానా విధించి వదిలేశాం. ఆ సందర్భంగా అతడికి ఓ మాస్క్ కూడా అందించాం...’’ అని పేర్కొన్నారు. 


కాగా  రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు కొవిడ్ ప్రోటోకాల్ కఠినంగా అమలు చేస్తున్నట్టు డ్యోరియా జిల్లా ఎస్పీ శ్రీపతి మిశ్రా తెలిపారు. ‘‘కొవిడ్-19 ప్రోటోకాల్‌ను అమలు చేసేందుకు జిల్లాను సెక్టార్లుగా విభజించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రజలు కొవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే తొలిసారి హెచ్చరించి వదిలేస్తాం. తర్వాత రూ. 1000 జరిమానా విధిస్తాం. ఆ తర్వాత కూడా నిబంధనలను అతిక్రమిస్తూ ఓ వ్యక్తి మళ్లీ పట్టుబడితే అతడికి రూ.10 వేల జరిమానా వేస్తాం..’’ అని ఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-20T22:26:43+05:30 IST