మార్పును సాధించని ఓటర్లు

ABN , First Publish Date - 2022-03-12T07:13:14+05:30 IST

ఒకప్పుడు రాజ్యాధికారాన్ని దైవదత్త హక్కుగా భావించేవారు. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలలోనూ ఆ భావనను వదిలివేశారు.

మార్పును సాధించని ఓటర్లు

ఒకప్పుడు రాజ్యాధికారాన్ని దైవదత్త హక్కుగా భావించేవారు. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలలోనూ ఆ భావనను వదిలివేశారు. రాచరిక పాలన స్థానంలో పలు పాలనా విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రజాస్వామ్యం వాటిలో ఒకటి. మానవులు తమ శ్రేయస్సుకు నిర్మించుకున్న పాలనా విధానమే ప్రజాస్వామ్యం. ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ మిగతా పాలనా పద్ధతుల కంటే ప్రజాస్వామ్యమే ఉత్తమమైనది. కనుకనే స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని అనుసరించేందుకు నిర్ణయించుకుంది.


ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభా ఎన్నికల ఫలితాలను చూశాం. అవి ఒక చేతికి ఉండే ఐదు వేళ్ళ లాగా భిన్నంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను నేను నిశితంగా గమనించాను. కనుక నా వ్యాఖ్యలను ఆ మూడు రాష్ట్రాలకే పరిమితం చేస్తాను.


దేశంలో అత్యధిక జనాభా గల ఉత్తర్‌ప్రదేశ్, సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్, పశ్చిమ తీరాన ఉన్న చిన్న రాష్ట్రం గోవా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు, పంజాబ్ శాసనసభలో 117 స్థానాలు, గోవా విధానసభలో 40 స్థానాలు ఉన్నాయి. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కథనంలోని ఒక ఉమ్మడి అంశం ‘మార్పు - నిరంతరత’. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చాల వరకు మళ్లీ అధికారానికి రావాలని కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మార్పును కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పంజాబ్‌లో మినహా ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే విజయం సాధించాయి (పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది). అంటే మార్పుపై నిరంతరత గెలిచింది. మార్పును వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీయే తిరుగులేని విజేత అయింది.


గోవాలో సైతం ప్రభుత్వం మారాలని పలువురు కోరుకున్నారు. ప్రభుత్వం మార్పుకు అనుకూలంగా 66 శాతం మంది ఓటర్లు ఓటు వేశారనేది స్పష్టం. అయినా అంతిమ ఫలితం మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వానికే అనుకూలంగా వచ్చింది. గోవా శాసనసభలోని మొత్తం 40 సీట్ల ఫలితాలు వెలువడిన గంట లోగానే స్థానికులు, పర్యాటకులు యథావిధిగా తమ నిత్య కార్యకలాపాలలో మునిగిపోయారు. మార్పును కోరుకున్న వారే అయినా ఫలితాల పట్ల ఉదాసీన వైఖరితో ఉండిపోయారు. ఓటర్ల నిజమైన ఆరాటాలు ఏమయ్యాయి? ఎన్నికల కోలాహలం అంతా దేని గురించి అన్న ఆశ్చర్యం కలిగింది. దిగ్భ్రాంతికి లోనయిన వారు ముఖ్యంగా మార్పును కోరుకున్న అభ్యర్థులే (వీరిలో ఎనిమిది మంది కాంగ్రెస్ వారు ఉన్నారు). వీరంతా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు మారాలో వారు ఓటర్లకు పరిపరి విధాల వివరించారు. అయితే 169 నుంచి 1647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది మందిలో ఆరుగురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 


ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవాలలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రయత్నించింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రిని సైతం మార్చింది. ఆ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా సంప్రదాయ అధికార వ్యవస్థను సవాల్ చేసింది. మార్పుతో కూడిన నిరంతరతను కాంగ్రెస్ ప్రగాఢంగా కోరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీని గట్టిగా సవాల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మార్పు అవసరమని వాదించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ, బీజేపీతో సహా ప్రతి పార్టీని ఓడించింది. పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాలలో 92ను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 400 నియోజకవర్గాలలో పోటీ చేసింది (ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇన్ని స్థానాలకు పోటీ చేయడం దశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి). 40 శాతం నియోజకవర్గాలలో మహిళా అభ్యర్థులను నిలబెట్టింది (మన దేశంలో ఒక రాజకీయ పార్టీ లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో ఇంతమంది మహిళా అభ్యర్థులను పోటీ చేయించడం ఇదే మొదటిసారి). కాంగ్రెస్ ఇచ్చిన నినాదం ‘లడ్కీ హూన్, లాడ్ శక్తి హూన్’ (నేను ఒక బాలికను, నేను పోరాడగలను) అసంఖ్యాక మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే కాంగ్రెస్ 2.68 శాతం ఓట్లతో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.


గోవాలో పార్టీ ఫిరాయింపుదారులను తిరిగి చేర్చుకోవడానికి, పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. యువకులు, విద్యావంతులు, అవినీతి చరిత్ర లేనివారిని మాత్రమే అభ్యర్థులుగా నిలబెట్టింది. గోవా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టే చర్యల గురించి వివరిస్తూ ఒక విపుల ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా ప్రచారం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల్లో వాద ప్రతివాదాలు చేసింది. చేయనిదల్లా ఓట్లకు డబ్బు చెల్లించకపోవడమే. ఇద్దరు మినహా విద్యావంతులు, అవినీతి చరిత్ర లేని కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. అత్యంత అవినీతిపరులుగా ప్రజల్లో ముద్ర పడిన మంత్రులు, కనీసం ఎనిమిది మంది ఫిరాయింపుదారులు గెలిచారు. గోవా ఎన్నికల బరిలోకి కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 6.77 శాతం, 5.21 శాతం ఓట్లు కైవసం చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు లభించగా తృణమూల్ కాంగ్రస్‌కు ఒక్కటీ దక్కలేదు. 


ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలించిన తరువాత నాకు అర్థమయిందేమిటంటే మార్పును కోరుకోనివారు కృతనిశ్చయంతో ఓటు వేశారని నాకు అర్థమయింది. వారిది ఒకటే ఆలోచన. అధికారంలో ఉన్న వారు మళ్లీ గెలవాలని వారు కోరుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్, గోవాలలో మార్పును వ్యతిరేకిస్తున్నవారు ఏకాగ్ర చిత్తంలో ఒకే బటన్‌ను నొక్కారు. అయితే మార్పును కోరుకుంటున్నవారు భిన్న బటన్లను నొక్కారు. అంటే వేర్వేరు పార్టీల అభ్యర్థులకు వారు ఓటు వేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, దైవదూషణను, ఉద్యోగాలపై ఇచ్చిన హమీలను నెరవేర్చని వారిని పంజాబ్ ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకించారని అర్థమయింది. పేదరికంతో సర్దుకు పోవడానికి, అరకొర విద్యా వైద్య సదుపాయాలను భరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమయింది. గోవాలో వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుకున్న వారు, పర్యావరణం, సంప్రదాయ విలువలను కాపాడుకోదల్చిన వారు మార్పుకు అనుకూలంగా ఓటు వేశామని భావించారు. అయితే అదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం పట్ల వారు ఇప్పుడు భీతావహులు అవుతున్నారు.


అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలోనూ హిందూత్వ అనుకూల ఓట్లు పెరిగినప్పటికీ, అత్యధిక ఓటర్లు ప్రభుత్వం మారాలని కోరుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. చాలామంది మార్పుకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కృతనిశ్చయంతో ఓటువేయలేదు. పంజాబ్‌లో మినహా ఒకే పార్టీకి ఓటు వేయలేదు. గోవాలో మార్పును కోరుకున్న వారి ఓట్లు మూడు–నాలుగు పార్టీల మధ్య చీలిపోయాయి. మార్పును సాధించడంలో వారు ఓడిపోయారు.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-03-12T07:13:14+05:30 IST