మీకు చేతకాక మీడియాపైకి!

ABN , First Publish Date - 2022-05-08T06:06:08+05:30 IST

తనప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే ఓర్వలేని దుష్ట చతుష్టయం కళ్లలో నిప్పులు పోసుకుంటున్నదని, దొంగల ముఠాగా తయారై కుట్రలు చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డ్డి మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు....

మీకు చేతకాక మీడియాపైకి!

తనప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే ఓర్వలేని దుష్ట చతుష్టయం కళ్లలో నిప్పులు పోసుకుంటున్నదని, దొంగల ముఠాగా తయారై కుట్రలు చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డ్డి మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇటీవలి కాలంలో ఎక్కడ బహిరంగసభ జరిగినా తన ప్రధాన ప్రత్యర్థి మీడియానే అన్నట్టుగా ఆయన విరుచుకుపడుతున్నారు. నిజానికి మీడియా రాతలు, కూతలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం అనేక రాష్ర్టాల్లో రుజువైంది. గత ఎన్నికలకు ముందు ఇదే మీడియా.. జగన్‌ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతితోపాటు పోలవరం ఆగిపోతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలను హెచ్చరించింది. అయినా మెజారిటీ ప్రజలు జగన్‌కు అనుకూలంగా ఓటు వేశారు కదా! ఈ వాస్తవాన్ని విస్మరించి మీడియాను దోషిగా చిత్రీకరించేందుకు ఆయన ప్రయత్నించడం వింతగా ఉంది. ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు ఆయన ప్రభుత్వం మంచి చేద్దామనుకుంటే దుష్ట చతుష్టయం అడ్డుపడుతున్నదనే అనుకుందాం. అలాంటప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎందుకు నిందించారో జగన్‌ చెప్పాలి కదా! మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ వైరం ఉంది. కానీ జగన్‌తో లేదు కదా! గత ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డ్డి అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ తన వంతు సహాయ సహకారాలు అందించారు కదా! మంత్రి శ్రీనివాసయాదవ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపి బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి కృషి చేసింది నిజం కాదా? చంద్రబాబును ఓడించడం కోసం జగన్‌కు ఆర్థిక సాయం చేసింది నిజం కాదా? జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి అప్పుడు అంతగా సహకరించిన కేసీఆర్‌ కుమారుడైన కేటీఆర్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనడానికి కూడా మీడియానే కారణమా? అలా అనుకుందామని అనుకున్నా, జగన్‌ నిందిస్తున్న మీడియాతో తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా సఖ్యత లేదు కదా! దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నప్పుడు అందుకు బాధ్యత తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రులు ఎవరో ఒకరిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్‌ కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు. గురువారం తిరుపతిలో జరిగిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ ముఖ కవళికలను గమనిస్తే ఎందుకోగానీ ఆయన ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తోంది. ప్రజల్లో తాను బలహీనపడుతున్నానని ఆయన గుర్తించి ఉంటారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాధ్యులను చేసే ప్రయత్నం మొదలెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీకి చైతన్య, నారాయణ స్కూళ్ల యాజమాన్యాలతోపాటు తెలుగుదేశం పార్టీ వాళ్లు కారణమని జగన్‌ రెడ్డి నిందించడం హాస్యాస్పదంగా ఉంది. అదే నిజమైతే ఈ వ్యవహారంలో అరెస్టయిన ఉపాధ్యాయులలో చైతన్య, నారాయణ స్కూళ్లకు చెందినవారు ఒక్కరు కూడా ఎందుకు లేరు? రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ తరహా పాలనకు తెర తీసిన జగన్‌కు వ్యతిరేకంగా ప్రైవేట్‌ స్కూళ్లు కుట్ర చేసి బతికి బట్టకట్టగలవా? నిన్నటివరకు బయటకురావడానికి కూడా భయపడి కలుగుల్లో దూరిపోయిన తెలుగుదేశం పార్టీ వారికి అంత సీన్‌ లేదే! రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం నిత్యకృత్యం కాగా అందుకు కూడా దుష్ట చతుష్టయమే కారణమని ముఖ్యమంత్రి నిందించడాన్ని ఏమనుకోవాలి? ప్రభుత్వం మీది, పోలీసులు మీ చెప్పుచేతల్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికి ప్రత్యర్థులు ఇలాంటి పాడు పనులు చేస్తే జగన్‌ నుంచి తప్పించుకోగలరా? ఏ తప్పూ చేయని వారినే రాజకీయ కారణాలతో కేసులు పెట్టించి వేధిస్తున్నారు కదా! అలాంటప్పుడు నిజంగా తప్పు చేసిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అత్యాచారాలు జరిగినప్పుడు గతంలో మీడియా అంతగా ప్రాధాన్యం ఇచ్చేది కాదని, ఇప్పుడు విశేష ప్రచారం ఇస్తున్నారన్న దిక్కుమాలిన వాదనను కూడా జగన్‌కు చెందిన నీలి మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. అత్యాచారాలే జరగడం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడిన నాడే సత్యసాయి జిల్లాలో ఒక యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పోలీసులు ప్రయత్నించడం జగన్‌ ప్రభుత్వ పోకడలకు అద్దం పట్టడం లేదా? నేరాలు, ఘోరాలు జరుగుతాయి కనుకే పోలీసు శాఖ ఉంటుంది. పోలీసులను సక్రమంగా పనిచేయనిస్తే ఇలాంటి అకృత్యాలు తగ్గుముఖం పడతాయి. అలా కాకుండా ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడినా కేసును మసిపూసి మారేడుకాయ చేస్తుంటే నిందితులకు భయం ఎందుకు ఉంటుంది? ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా, జరుగుతున్న అనర్థాలకు ఇతరులను నిందించడం జగన్‌కు అలవాటుగా మారింది.


ఫంక్షనా.. చలో హైదరాబాద్‌ !

పథకాల పేరిట ప్రజలకు డబ్బు పంచుతున్నందున తనకు తిరుగుండదన్న ఆలోచనతో జగన్‌ రెడ్డి పాలనను గాలికొదిలేశారు. ఆయన నిర్వహించే సమీక్షా సమావేశాలు కూడా తూతూ మంత్రంగా ఉంటాయి. అది చేసేయండి, ఇది చేసేయండి అని అధికారులకు హుకుం జారీచేయగానే అవన్నీ అయిపోతాయని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది. మాయ మాటలతో ప్రజలను తన వైపునకు తిప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌, అధికారం అంటే బాధ్యత అనే విషయం విస్మరించారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన మాయ మాటలనే నమ్ముతున్నారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటికీ మీడియానే కారణమని నిందిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని తన సొంత మీడియాలో గ్రాఫిక్స్‌ ద్వారా భ్రమింపజేస్తున్న జగన్‌, ప్రజల మీడియాకు భయపడటం ఎందుకో తెలియదు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్న మాటలకు పాలకులే కాదు ఆంధ్రప్రదేశ్‌ పౌరులు కూడా సామూహికంగా సిగ్గుతో తలవంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఆగమవుతుందని ఆంధ్ర ప్రాంత నాయకులు చెప్పేవారు. తెలంగాణ చీకట్లో మగ్గుతుందని కూడా అన్నారు. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌కు బారులు తీరుతున్నారు. కరెంట్‌ కోతలతో ఆంధ్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్టుబడులన్నీ హైదరాబాద్‌కే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తమ వ్యాపారాలను వదులుకుని హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అంతెందుకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తమ పిల్లల పెళ్లిళ్లను కూడా హైదరాబాద్‌లోనే జరిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. ఇందుకు కూడా దుష్ట చతుష్టయమే కారణమా? జగన్‌ అండ్‌ కో ఎన్ని సొల్లు కబుర్లు చెబుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా అతలాకుతలం అవ్వడమే కాకుండా కళావిహీనంగా తయారైంది. ఇందుకు నాయకులే బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ అలా, తెలంగాణ ఇలా ఉండటానికి పాలకులే కారణం. దార్శనికత ఉన్న నాయకుడు తన రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేస్తాడు. అది లేనివాడి పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశే ఉదాహరణ. తిరుపతిలో గురువారం జరిగిన సభకు తరలించిన జనంలో పలువురు గోడలు దూకి పారిపోవడం దేనికి సంకేతమో జగన్‌ తెలుసుకుంటే మంచిది. మూడేళ్ల పాలన చూసిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్‌ అర్హుడేనా అన్న సందేహం కలగకుండా ఉంటుందా? జగన్‌ ఇప్పుడు నిందిస్తున్న మీడియా ఎన్నికలకు ముందు హెచ్చరించినట్టుగానే అమరావతి, పోలవరం నిర్వీర్యం అయిపోవడం నిజం కాదా? మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేయడం నిజం కాదా? ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడటం నిజం కాదా? జగన్‌ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్న వాస్తవాన్ని కాదనగలరా? ముఖ్యమంత్రి కావాలని జగన్‌ ఎందుకు అనుకున్నారో చెప్పగలరా? ఎడాపెడా అప్పులు చేసి పథకాల పేరిట పంచిపెట్టడానికి ముఖ్యమంత్రి కావాలా? ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారికి ఆ పని చేతకాకనా? 2009 ఎన్నికలకు ముందు పార్టీ నాయకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలను ప్రకటించడానికి దివంగత రాజశేఖర్‌రెడ్డి నిరాకరించిన విషయం వాస్తవం కాదా? ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేసేవాడు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి ప్రయోజనం? జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఊరూరా తిరిగి ఓట్లు అడిగిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అయినా ఆయన పాలనను మెచ్చుకోగలరా? ‘మా వాడి పాలన భేషుగ్గా ఉంది’ అని వారంటే మేం కూడా ప్రభుత్వాన్ని నిందించబోం. విషాదం ఏమంటే జగన్‌ రెడ్డి రాష్ర్టాన్ని విధ్వంసం చేయడమే కాదు, -ప్రజల మెదళ్లను కూడా విషపూరితం చేశారు. జరుగుతున్న అనర్థం కళ్లెదురుగా కనిపిస్తున్నప్పటికీ తప్పును తప్పు అని చెప్పే వారిపై విరుచుకుపడే సైకోలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నారు. ఈ మనస్తత్వం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా విస్తరించడం మహా విషాదం. రాష్ట్ర భవిష్యత్తు కంటే కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చి మూకలను తయారు చేసుకోవడంలో మాత్రమే ముఖ్యమంత్రి విజయం సాధించారు. రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టడం జగన్‌ సాధించిన ప్రగతి అనుకోవాలా?


జగన్‌ ! చర్చకు రెడీయా?

తెలంగాణ వాళ్లకంటే ఆంధ్రవాళ్లు తెలివిగలవాళ్లు అనే అభిప్రాయం గతంలో ఉండేది. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటివరకు కీలకంగా ఉన్న ఆంధ్ర నాయకుల పోకడలను పరిశీలిస్తే ఈ అభిప్రాయాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ సజావుగా అడుగులు వేయాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని 2014లో నిర్ణయించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, 2019 నాటికి అత్యాశకు పోయి జగన్‌ను అందలం ఎక్కించారు. చంద్రబాబు స్థానంలో జగన్‌ ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌ అభివృద్ధికి అడ్డు ఉండదని అంచనా వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు అనుకూలంగా పావులు కదిపారు. తన ప్రయత్నంలో ఆయన విజయవంతమయ్యారు. దీన్నిబట్టి ఆంధ్ర నాయకుల కంటే తెలంగాణ నాయకులకే తమ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఎక్కువ ఉందని స్పష్టమవుతోంది. విభజన సమయంలో కూడా తమకు ఏం కావాలో డిమాండ్‌ చేయకుండా సమైక్య రాష్ట్రమే ముద్దు అంటూ ఆందోళనలు చేసినవాళ్లు, చేయించినవాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసినట్టు కాదా? ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వ్యక్తుల సహకారంతో జగన్‌ అండ్‌ కో సృష్టించిన విద్వేషపూరిత వాతావరణం ప్రభావానికి లోనైన ప్రజలు తమ భవిష్యత్తును తామే కూల్చుకున్నారు. జగన్‌ రెడ్డి పాలన కూడా రాజశేఖర్‌ రెడ్డి పాలన మాదిరిగానే ఉంటుందని అనుకున్నాంగానీ ఇలా ఉంటుందని అనుకోలేదని పలువురు ఇప్పుడు వాపోతున్నారు. కానీ జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ వలసపోయి బతకడమా? లేక రాష్ర్టాన్ని గాడిలో పెట్టడానికి సంఘటితం కావడమా? అన్నది ప్రజలు, మేధావులే తేల్చుకోవాలి. మీడియాను నిందిస్తున్న జగన్‌ రెడ్డికి ఒక సూచన! ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంటే, మేం అడ్డుపడుతున్నామని అంటున్నారు కదా.. ఒక పనిచేద్దాం! మేం తప్పు చేస్తున్నామా? ప్రభుత్వం వైఫల్యం చెందిందా? అన్నది తేల్చుకోవడానికి జగన్‌ రెడ్డితో ‘ఏబీఎన్‌’ వేదికగా చర్చ నిర్వహించడానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి కూడా సిద్ధపడితే ఎవరేమిటో తేలిపోతుంది. ఇందుకు సిద్ధపడని పక్షంలో మీడియా మీద పడి ఏడవటం అయినా ఆపి మంచి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. బలహీనుడే తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరులపై నింద వేయడం సర్వ సహజం. ఇప్పుడు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల పనితీరుతో పోటీపడాలి కానీ మీడియాతో కాదు. అలా చేయకుండా ఎవరో ఒకరిని నిందిస్తూ పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి, నేటికి జగన్‌ రెడ్డి ముఖంలో వచ్చిన మార్పులు ఆయనలోని ఆందోళనకు అద్దం పడుతున్నాయి. అధికారం పోతుందన్న ఆందోళన ఆయనదైతే, రాష్ట్రం నాశనం అవుతున్నదన్న ఆందోళన మాది. ఇదే తేడా!


పీకేల రాజకీయం !

జగన్‌ వ్యవహారం అలా ఉంటే రాజకీయాలకు ఇప్పుడు నిర్వచనం మారిపోతోంది. ఒకప్పుడు సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడేవి. తర్వాత దశలో పథకాల ఆశ చూపి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలైంది. ఈ దశ కూడా దాటిపోయి ప్రత్యర్థి పార్టీలపై విష ప్రచారం చేయించడం ఇప్పటి రాజకీయంగా మారింది. వ్యాపార రంగంలో వచ్చిన వినూత్న ఆలోచనల తరహాలోనే రాజకీయాల్లో కూడా వినూత్న పోకడలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్‌ కిశోర్‌ వంటివాళ్లు రంగప్రవేశం చేశారు. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే ప్రశాంత్‌ కిశోర్‌పై ఆధారపడి నాటి యూపీఏ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావనను వ్యాపింపజేయగలిగారు. సోషల్‌ మీడియా ప్రాధాన్యం పెరగడంతో పీకే వంటివారి సహకారంతో ఒకరికి వ్యతిరేకంగా, మరొకరికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం మొదలైంది. దీంతో ప్రజలతో నిమిత్తం లేకుండా పీకే వంటి వాళ్లు రాజకీయ పార్టీల జయాపజయాలను నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో జత కట్టిన ప్రశాంత్‌ కిశోర్‌.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం ద్వారా ప్రజలు జగన్‌ వైపు ఆకర్షితులయ్యేలా చేయగలిగారు. దాని ఫలితాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అనుభవిస్తోంది. అది వేరే విషయం. తాను తీసుకున్న భారీ ఫీజుకు బిహార్‌కు చెందిన పీకే న్యాయం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల్లో పీకే సేవలను వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో తెలుసు కనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మరో ఏడాది తర్వాత జరగనున్న ఎన్నికల్లో తనకు విజయం చేకూర్చడం కోసం ఇదే ప్రశాంత్‌ కిశోర్‌పై ఆధారపడబోతున్నారు. 2014 ఎన్నికల్లో పీకేతో కలసి మోదీ కోసం పని చేసిన సునీల్‌ అనే ఆయన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ కోసం పనిచేయబోతున్నారు. ఈ మధ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఏ కారణం వల్లనో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని బిహార్‌లో సొంతంగా ముందుకెళతానని ప్రకటించారు. తొండ ముదిరి ఊసరవెల్లి అవడం అంటే ఇదేనేమో. తన తెలివితేటలతో వేరే వాళ్లను ముఖ్యమంత్రిగా చేసే బదులు తానే ముఖ్యమంత్రి కావాలని పీకే భావిస్తున్నట్టు ఉన్నారు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌ను మించిన గండరగండడు తెలంగాణలో లేరు. అలాంటి నాయకుడు కూడా పీకేపై ఆధారపడాలని అనుకోవడం అంటే కేసీఆర్‌ కూడా ప్రజాక్షేత్రంలో ఎంతోకొంత బలహీనపడి ఉంటారు. అంటే సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందన్న మాట. ప్రభుత్వాలు లేదా ప్రతిపక్షాలపై ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కృత్రిమంగా ప్రజాభిప్రాయాన్ని మార్చే వికృత క్రీడకు తెర లేచింది. రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకు ‘థింక్‌ టాంక్‌’లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌గా పీకే, సునీల్‌ వంటి వారు ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎవరో ఒకరికి పనిచేస్తున్నారన్న మాట. వీళ్లకు ఆయా రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధమూ ఉండదు. డబ్బు చెల్లించి కాంట్రాక్ట్‌ ఇచ్చిన పార్టీ ఏదైనా దాని కోసమే పనిచేస్తారు. ఈ క్రమంలో తాము పనిచేసే పార్టీ వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది వారికి అనవసరం. 500 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఫీజు చెల్లించి నియమించుకున్న వ్యూహకర్తలపై నాయకులు ఆధారపడే దుస్థితి రాజకీయాల్లో దాపురించింది. కేసీఆర్‌ మూడవసారి ముఖ్యమంత్రి అయితే ఆ ఖ్యాతి ఆయనది అవుతుందా? లేక పీకేది అవుతుందా? ప్రజల్లో కృత్రిమంగా భావోద్వేగాలను, విద్వేషాలను వ్యాపింపజేయడం ద్వారా రాజకీయ పార్టీలకు మేలు చేసే వారి వల్ల సమాజానికి జరిగే నష్టానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? గత ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన సొమ్మును ప్రశాంత్‌ కిశోర్‌ తన జేబులో వేసుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరూ హ్యాపీనే. కానీ ఇప్పుడు ఏడుస్తున్నది ప్రజలే కదా! దీన్నిబట్టి పీకే వంటి వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మునుముందు రాజకీయాల్లో ఎటువంటి వింత పోకడలు వస్తాయో తెలియదు. ప్రజా నాయకులు కనుమరుగవుతారు. టన్నులకొద్దీ డబ్బున్నవారే అధికారం కూడా చెరబట్టవచ్చు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఏమైనా జరగవచ్చు. కేసీఆర్‌ వంటి వారు కూడా ఒక రోజంతా ప్రశాంత్‌ కిశోర్‌తో గడిపారంటే పరిస్థితులు ఎలా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని అభినందించాలి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ప్రశాంత్‌ కిశోర్‌ చేతిలో పెట్టడాన్ని రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో సైతం గొడవపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కంపెనీలు కన్సల్టెంట్లను పెట్టుకున్నట్టు రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం వల్ల ఎవరో ఒకరు అధికారంలోకి రావచ్చు గానీ అది దేశానికి, రాష్ర్టాలకు మంచిది కాదు. పీకేలాంటి వారి వల్ల అనర్హులు అందలం ఎక్కితే ప్రజలే నష్టపోతారు. దేశంలో ఇప్పటికే ఉచిత పథకాలు హద్దు మీరాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెరిచి రాష్ర్టాలు ఎడాపెడా అప్పులు చేయకుండా అడ్డుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే లెక్కకు మించి అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలకు ఇకపై అప్పులు పుట్టకపోతే దానకర్ణులుగా చలామణి అవుతున్న ముఖ్యమంత్రులు దివాలాతీస్తారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్న ఈ రెండు రాష్ర్టాలలో పీకే వంటి వారి వల్ల ప్రజాభిప్రాయం ప్రస్తుత పాలకులకే అనుకూలంగా మారితే చేయగలిగింది కూడా ఏమీ లేదు. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వెలుగుతున్న కేసీఆర్‌ కూడా పీకే వంటి వారిపై ఆధారపడే పరిస్థితి రావడం భారతదేశ రాజకీయాల్లో ఒక విషాదం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more