అక్రమంలోనూ ‘ఉపాధి’ మేత!

ABN , First Publish Date - 2020-11-16T06:35:37+05:30 IST

ఉపాధి హామీ నిధులనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు.

అక్రమంలోనూ ‘ఉపాధి’ మేత!
షాబాదలో తవ్విన కొండ

అక్రమంగా తవ్విన గ్రావెల్‌తో పేదల ఇళ్ల స్థలాల మెరక

ఇప్పటికే రూ.20 కోట్ల మేర బిల్లులు చెల్లించిన అధికారులు

మరోసారి ఉపాధి నిధులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి

తవ్విన గ్రావెల్‌కు మైనింగ్‌ సెస్‌ ఎగవేతతో రూ.10 కోట్లు స్వాహా

పేదల ఇళ్ల స్థలాల పేరుతో మైలవరం కృష్ణుడి మాయలు


పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో పది అడుగుల లోతున్న భూములను సేకరించారు. భూసేకరణ సమయంలోనూ చేతివాటం చూపారు. వాటిని మెరక చేసే పేరుతో కొండపల్లి రక్షిత అటవీప్రాంతాన్ని అడ్డగోలుగా తవ్వేశారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.10 కోట్ల మైనింగ్‌ సెస్‌ ఎగవేశారు. మెరక చేసినందుకు మట్టి తరలింపు పేరుతో రూ.20 కోట్ల వరకు బిల్లులు లాగేశారు. ఇప్పుడిక తోలిన మట్టిని చదును చేసే పేరుతో ఉపాధి నిధులకు టెండర్‌ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో ఆయన బామ్మర్ది చేస్తున్న దందా ఇది. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఉపాధి హామీ నిధులనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయిస్తూ, వారికి దక్కాల్సిన ఉపాధి నిధులనూ స్వాహా చేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ మున్పిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లబ్ధిదారులకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జి.కొండూరు మండలంలో 530 ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూములేవీ నివాసయోగ్యం కావు. వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడు, కవులూరు గ్రామాల్లో సేకరించి భూమి బుడమేరు వరద ముంపు బారిన పడుతుంది. సున్నంపాడులో భూమిలో నుంచి ఐవోసీ పైపులైన్‌ పోతోంది. మునగపాడులో సేకరించిన భూమిలోకి వెళ్లేందుకు దారి లేదు. ఈ భూసేకరణ వల్ల రైతులకు మేలు చేశామని చెప్పుకుంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి బామ్మర్ది ఇప్పటికే భారీ ఎత్తున వారి నుంచి కమీషన్‌ గుంజారు. తర్వాత ఆ భూములను మెరక చేసే కాంట్రాక్టును తానే దక్కించుకున్నారు. ఈ పల్లపు భూములను మెరక చేసేందుకు కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతాన్ని, జక్కంపూడి, షాబాద కొండలను తవ్వేశారు. వాటిని తరలించి రూ.20 కోట్ల మేర బిల్లులు లాగేశారు. గ్రావెల్‌ను తవ్వి తరలించినందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్‌ సెస్‌ను ఎగ్గొట్టారు. 10 లారీలు మెరక చేసేందుకు తోలితే 20 లారీలు అక్రమ మార్గంలో తరలిపోయేవి. సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వేశారని సమాచారం. సుమారు రూ.10 కోట్ల మైనింగ్‌ సెస్‌ ఎగవేశారు. అనుమతి ఉన్న క్వారీలో గ్రావెల్‌ రవాణా చేయాలంటే ప్రతి వాహనానికి విధిగా మైనింగ్‌ సెస్‌ చెల్లించాలి. ఆ సెస్‌ ప్రభుత్వానికి సమకూరుతుంది. అలా వసూలైన సెస్‌తో జిల్లా, మండల పరిషత్తుల్లో, పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడతారు. వీఎంసీ కోసం సేకరించిన భూమిలో ఇప్పటికే వేల ట్రక్కుల గ్రావెల్‌ తోలారు. వాటికి లెక్కా పత్రం లేదు. ప్రజాప్రతినిధి బామ్మర్ది బెదిరింపులకు భయపడి అధికారులు కూడా కళ్లు మూసుకుని ఆయనకు సహకరించారు. 


ఉపాధి నిధులకు టెండర్‌

తాజాగా పేదల ఇళ్ల స్థలాలకు తోలిన మట్టిని చదును చేసే పేరుతో ఉపాధి నిధులకు ప్రజా ప్రతినిధి బామ్మర్ది టెండర్‌ పెట్టారు. సుమారు రూ.5 కోట్ల నిధులను ఈ పనులకు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే గ్రావెల్‌ తరలింపునకు రూ.20 కోట్ల వరకు చెల్లించిన అధికారులు చదును చేసేందుకు తిరిగి నిధులు మంజూరు చేయడం కుదరదని చెబుతున్నా, బావ అండ చూసుకుని చెలరేగిపోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి నిధులను మంజూరు చేయాల్సిందేనంటూ పట్టుబట్టికూర్చున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-11-16T06:35:37+05:30 IST