ఉపాధి బిల్లులపై గుట్టు

ABN , First Publish Date - 2021-10-14T06:23:18+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల విడుదలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు.

ఉపాధి బిల్లులపై గుట్టు
బుచ్చెయ్యపేట మండలం ఐతంపూడిలో ఉపాధి నిధులతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డు...దీనికి సంబంధించి ఇంకా బిల్లు చెల్లించలేదు

టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రహదారులు, భవనాలు, సంపద కేంద్రాల నిర్మాణం

బిల్లులు నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం

వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశం

జిల్లాలో చెల్లింపులపై  అధికారుల గోప్యత

నాణ్యత లేదని బిల్లుల్లో కోతలు 8 కాంట్రాక్టర్ల గగ్గోలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల విడుదలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఈ వివరాలు అందించడానికి మండల స్థాయిలో ఏఈ నుంచి పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వరకూ ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదు. ఈఈ పరిధిలో వివరాలు వుంటాయని ఎస్‌ఈ తప్పించుకుంటున్నారు. ఈఈలను సంప్రతిస్తే మండల స్థాయిలో సమాచారం ఏఈల వద్ద ఉంటుందని చెబుతున్నారు. ఏఈలను అడిగితే ఉన్నతాధికారుల వద్ద తప్ప తమ వద్ద ఎటువంటి సమాచారం ఉండదంటున్నారు. 

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద (మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు) గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు, పంచాయతీ భవనాలు, సంపద కేంద్రాలు నిర్మించారు. సర్పంచులు, చిన్నపాటి కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టారు. ప్రధానంగా 2018 సెప్టెంబరు నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిల్లాలో రూ.250 కోట్లతో మూడు వేల పనులు చేశారు. పంచాయతీరాజ్‌ అధికారులు పనుల నాణ్యత నిర్ధారించిన తరువాత ఎం.బుక్‌లో నమోదుచేశారు. ఆ తరువాత బిల్లులు ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో)లు వచ్చాయి. బిల్లుల విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో బిల్లుల చెల్లింపు ఆగి పోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గత ఏడాది కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో పనుల నాణ్యతపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పనుల పరిశీలనకు వచ్చిన అధికారులపై నాణ్యతలో లోపాలున్నట్టు నివేదికలు సమర్పించాల్సిందిగా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదిలావుండగా ఎం.బుక్‌లో నమోదై ఎఫ్‌టీవోలు జనరేట్‌ అయిన మొత్తం బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు వారం క్రితం ఆదేశించింది. కానీ...జిల్లాలో ఎంతమందికి బిల్లులు చెల్లించారు?, ఇంకా పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి? అనేది చెప్పడానికి అధికారులు సుముఖంగా లేరు. కొందరికి పూర్తిగా, మరికొందరికి 21 శాతం కోతతో బిల్లులు చెల్లించారు. ఇంకొందరికి ఇంకా చెల్లించాల్సి ఉంది. 

చోడవరంలో అందని రూ.13 కోట్ల బిల్లులు

చోడవరం నియోజకవర్గంలో రూ.55.995 కోట్ల విలువైన 600 పనులు చేపట్టారు. బుచ్చెయ్యపేట మండలంలో రూ.21. 013 కోట్లతో 200 పనులు, చోడవరంలో రూ.16.809 కోట్లతో 189 పనులు, రావికమతం మండలంలో రూ.11.989 కోట్లతో 150, రోలుగుంటలో రూ.6.184 కోట్లతో 50 పనులు చేశారు. ఈ రూ.55.995 కోట్లలో రూ.13 కోట్లు ఇంకా విడుదల కాలేదు. అయితే సెగ్మెంట్‌లో పలుచోట్ల పనుల్లో నాణ్యత లేదని బిల్లుల్లో కోత వేసినట్టు తెలిసింది. కేవలం రాజకీయ కక్షతోనే బిల్లుల్లో కోత వేయడం లేదా నిలిపివేయడం జరిగిందని పనులు చేసినవారు ఆరోపిస్తున్నారు.


రూ.73.5 లక్షలతో పనులు చేశా...పైసా రాలేదు

- అప్పాన పైడయ్యనాయుడు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం

బుచ్చెయ్యపేట మండలం ఐతంపూడి పంచాయతీలో పది చోట్ల రోడ్లు పనులు చేశా. వీటి విలువ రూ.73.5 లక్షలు. అప్పట్లో అధికారులు తనిఖీ చేసి ఎం.బుక్‌లో నమోదుచేసి అనంతరం ఎఫ్‌టీవోలు జనరేట్‌ చేశారు. ఇప్పటివరకూ బిల్లులు మంజూరుచేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు వచ్చి నేను చేసిన పనులను పరిశీలించారు. ఏమి జరిగిందో గానీ ఇప్పటివరకు పైసా విడుదల చేయలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా.

Updated Date - 2021-10-14T06:23:18+05:30 IST