ఉపాధి కూలీలకు తీపి కబురు

ABN , First Publish Date - 2021-03-07T04:37:14+05:30 IST

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవిలో కూలీలకు అదనంగా 30 శాతం భృతిని చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధి కూలీలకు తీపి కబురు
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

 వేసవి భత్యం 20 నుంచి 30 శాతం పెంపు


సీతారామపురం, మార్చి 6 : ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవిలో కూలీలకు అదనంగా 30 శాతం భృతిని చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏడాది వేసవిలో పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భృతిని ప్రకటిస్తూ వస్తోంది. అందులో భాగంగా సాధారణ రోజుల్లో లభించే వేతనం కంటే మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా వేతనాన్ని అందించనున్నారు. 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకోని కూలీలకు ఈ వేసవిలో చక్కని ఉపాధి లభించనుంది. అంతేగాక ఉపాధి హామీ పథకంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.


ఇద్దరు మహిళా మేట్లు

ఇక నుంచి శ్రమశక్తి సంఘాల్లో మహిళలనే మేట్లుగా నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 10 నుంచి 30 మంది కూలీలు శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం కల్పించే పనులను కొలతల ప్రకారం చేస్తూ వేతనాలు పొందుతున్నారు. ఇలాంటి గ్రూపులకు మేట్లుగా స్ర్తీ, పురుషులు ఇరువురూ ఉండేవారు. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం కేవలం మహిళలనే ఒక గ్రూపునకు ఇద్దరు చొప్పున నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. అలాగే ఒక గ్రూపు నుంచి మరొక గ్రూపునకు మారే అవకాశంతోపాటు, తాత్కాలిక శ్రమశక్తి సంఘాలను ఇకపై శాశ్వత సంఘాలుగా మార్పు చేయాలని కూడా నిర్ణయించారు. మేట్‌ తన గ్రూపు సభ్యులతో పని చేయిస్తూ తాను కూడా పని చేయాలి. 

Updated Date - 2021-03-07T04:37:14+05:30 IST