‘ఉపాధ్యాయ’ సంగ్రామం

ABN , First Publish Date - 2022-10-08T05:10:45+05:30 IST

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి

‘ఉపాధ్యాయ’ సంగ్రామం

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహాలు షురూ!
  • ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం
  • ఓటర్ల నమోదులో ప్రధాన సంఘాలు బిజీ
  • అభ్యర్థిని ముందే ఖరారు చేసిన టీఎస్‌ యూటీఎఫ్‌ 
  • మళ్లీ బరిలోకి మాణిక్‌రెడ్డిని దింపుతున్నట్లు ప్రకటన
  • పీఆర్టీయూ తరఫున జనార్ధన్‌రెడ్డికి మరోసారి అవకాశం దక్కేనా? 
  • ఈ సారి ఓటర్ల సంఖ్య 25వేలకు చేరే అవకాశం
  • అందరూ మళ్లీ తాజాగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిందే


ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉపాధ్యాయ సంఘాల్లో హడావిడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి జిల్లాల) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియను ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించింది. దీంతో ఆయా ఉపాధ్యాయ సంఘాలు ఓటర్ల నమోదుపై దృష్టి కేంద్రీకరించాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, అక్టోబరు 7) : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా పరిధిలో అత్యధికంగా టీచర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రధాన సంఘాలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన వారంతా కూడా మళ్లీ ఇపుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 మరోవైపు  ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో  తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎ్‌సయూటీఎఫ్‌) అందరి కంటే ముందుగానే తమ అభ్యర్థిని ఖరారు చేసింది.  ఉపాఽధ్యాయ ఉద్యమాలలో కీలక భాగస్వామిగా ఉన్న మాణిక్‌రెడ్డికి మరోమారు పోటీ చేసే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా వామపక్షాల మద్దతుతో ఆయన్నే బరిలో దించాలని ఆ సంఘం నేతలు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో సంఘం నేతలు మాణిక్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి, మాజీఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కే.నాగేశ్వర్‌ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంక్షేమం కోసం మాణిక్‌రెడ్డిని గెలిపించాలని సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే  ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఉంటుందా? వేరే అభ్యర్థిని బరిలో దింపుతారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. అలాగే గత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఎవీఎన్‌రెడ్డి (ఎస్టీయూ టీఎస్‌) పోటీ చేశారు. అలాగే   హర్షవర్ధన్‌రెడ్డి (టీపీఆర్టీఓ చీలికవర్గం) ఎన్‌ భూపతిరెడ్డి (టీపీయూఎస్‌), ఆదిలక్ష్మయ్య (ఇండిపెండెంట్‌ బహుజన్‌ సమాజ్‌పార్టీ), కే.శ్రీనివా్‌సరావు, ఎస్‌.విజయకుమార్‌ (రిటైర్డ్‌ డీఈఓ), మమత, అరికెల కృష్ణగౌడ్‌ (ఎస్టీయూ) మరికొందరు బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో జనార్దన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి  మధ్య పోటీ జరిగింది. దీంతో తొలి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో జనార్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మాణిక్‌రెడ్డి రెండో స్థానంలో, ఏవీఎన్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్‌, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపే యోచనలో ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


అర్హతలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ నియోజకవర్గంలో నివసిస్తుంటే ఇక్కడ ఓటరు నమోదుకు అర్హులు. 2022 నవంబర్‌ ఒకటో తేదీ నాటికి ఆరు సంవత్సరాల కాలం ( 01-11-2016 నుంచి 31-10-2022 వరకు) కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు/ కళాశాల అఽధ్యాపకులుగా పనిచేసి ఉండాలి. 01-11-2019 కంటే ముందు నియామకమైన వారు, రిటైర్డ్‌ అయిన వారు కూడా కనీసం మూడేళ్ల పాటు పనిచేసి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఉపాధ్యాయ, అధ్యాపకుడు రెగ్యూలర్‌ లేదా అడాక్‌ (కాంటాక్ర్టు) పద్ధతిలో నియమించబడిన ఫుల్‌టైమ్‌ ఉపాఽధ్యాయుడై ఉండాలి. పార్ట్‌టైమ్‌, గెస్ట్‌ టీచరుకు అర్హత లేదు. పాత ఓటర్ల జాబితా ఇక ఉండదు. అరులైన వారు మళ్లీ తమ పేర్లు తాజాగా నమోదు చేసుకోవాలి. అర్హతలకు సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన తరువాతనే వీరికి ఓటు హక్కు కల్పిస్తారు. 


ఓటర్ల నమోదు ప్రక్రియ ఇలా..

నవంబర్‌ 23వ తేదీన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. డిసెంబర్‌ 9వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. 


25వేలకు చేరే అవకాశం!

గత ఎన్నికల్లో  హైదరాబాద్‌ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి  మొత్తం 23013 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డిజిల్లా (రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌)కు  సంబంధించిన దాదాపు 12వేల మంది ఓటర్లు ఉన్నారు.  ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 6675 మంది, హైదరాబాద్‌లో 4501 మంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ సారి దాదాపు 25వేల మంది  ఓటర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. 


126 పోలింగ్‌ స్టేషన్లు

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్తగా ఏర్పటైన 8 జిల్లాల్లో 126 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డిజిల్లాలో 27, హైదరాబాద్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 18, వికారాబాద్‌లో 18, నాగర్‌ కర్నూల్‌లో 14, గద్వాల్‌లో 11, మేడ్చల్‌లో 10 , వనపర్తిలో 6 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.  

Updated Date - 2022-10-08T05:10:45+05:30 IST