చాటపర్రులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
అందని వేసవి భత్యం
పని దినాల్లో కోత.. ఆందోళనలో కూలీలు
ఏలూరు రూరల్, మార్చి 27 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా పారదర్శకంగా అమలు చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. అప్పటి నుంచి పథకంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మండుటెండలో చెమటోడ్చి పనిచేసిన కూలీలకు కష్టానికి తగిన వేతనం అందడం లేదు. పని దినాలు కూడా తక్కువయ్యాయి. ప్రతీ ఏడాది వేసవిలో ఉపాధి కూలీలకు వేతనంతో పాటు అదనంగా మంజూరయ్యే వేసవి భత్యం రావడం లేదు. దీంతో కూలి గిట్టుబాటు కావడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో సుమారు 15 వేలకుపైగా జాబ్‌కార్డులకు గాను 10 వేలకుపైగా ఉపాధి కూలీలు ఉన్నారు. వీరందరికీ జాబ్ కార్డులకు పనులు కల్పించారు. కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, పొలంబాటలో అభివృద్ధి, కాల్వగట్లపై ముళ్ళ కంపల తొల గింపు, కందకాల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నారు. ఈ పథకం నిర్వహణ, వేతనాల పంపిణీ, ఇతరత్రా విషయాలను పరిశీలించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ పథకాన్ని పారదర్శకంగా ఏర్పాటు చేసేందుకు గతేడాది నవంబర్‌లో కేంద్రం నరేగా ఎన్ఐసీ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ పథకంలో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
అందని వేసవి భృతి
వేసవిలో భూమి బాగా ఎండిపోయి పనులు చేసేందుకు అనువుగా ఉండదు. వేసవిలో పనిచేసేందుకు కూలీలు ఆసక్తి చూపేవారు కాదు. దీనిని అధిగమిం చేందుకు ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం వేసవి భృతి మంజూరు చేసేవి. దీనివలన వేతనంతో పాటు అదనంగా రోజుకు 60 నుంచి 80 వచ్చేది. ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భృతి కల్పించేందుకు ఆప్షన్ లేకపోవడంతో వేసవిలో పనిచేసినా పూర్తిస్థాయి వేతనం రావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
పని దినాల్లో కోత
ఉపాధి హామీ పథకంలో ప్రతీ కూలీకి వంద రోజులు పనులు కల్పించాలి. గతంలోని సాఫ్ట్‌వేర్‌ను కనీస వేతనం ఒక పనిదినంగా లెక్కవేసేవి. దీనివల్ల వేతనం తగ్గినా మరుసటి రోజు పని చేసుకునే అవకాశం ఉండేది. నరేగా ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి కూలి పనికి వచ్చిన రోజును పరిగణనలోకి తీసుకుంటుంది. దీనివలన కనీస వేతనం రాకపోయినా ఒక్క పని దినం పూర్తయినట్టే. దీంతో వంద రోజులు మించి పనిచేసే అవకాశం లేదు. వేసవి భృతి, ఇతర అల వెన్సులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.