ఉపాధి కూలీలకు వసతులు కరువు

ABN , First Publish Date - 2021-04-18T05:27:55+05:30 IST

మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామి పథకం ద్వారా పనులు చేసే కూలీలు మండుటెండలో పనులు చేస్తూ మగ్గిపోతున్నారు.

ఉపాధి కూలీలకు వసతులు కరువు
పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

మండుటెండలో పనులు..!

తాగు నీరు, మజ్జిగ పంపిణీ ఊసేలేదు 

కనిపించని టెంట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు 

త్రిపురాంతకం, ఏప్రిల్‌ 17: మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామి పథకం ద్వారా పనులు చేసే కూలీలు మండుటెండలో పనులు చేస్తూ మగ్గిపోతున్నారు. పనిచేసే చోట కనీస వసతులు కల్పిం చాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఎండలో పనులు చేసేవారు కాసేపు సేద తీర్చుకోవడానికి టెంట్లు ఏర్పాటు చేయాలి. కూలీ లకు మజ్జిగ, మంచినీరు అందించాల్సి ఉండగా ఎక్కడా కానరావడం లే దు.  గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. 40 డిగ్రీలకు చేరింది. దీంతో  కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు పని ప్రదేశాలలో మంచినీరు, మజ్జిగ, ఫస్ట్‌ ఎయిడ్స్‌ కిట్‌లు అందుబాటులో లేకపోవటంతో పలు చోట్ల కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు.

కానరాని టెంట్లు..

మండలం మొత్తం మీద 1374 గ్రూపులు ఉండగా, ప్రస్తుతం 745 గ్రూపుల్లో 5812 మందికి పైగా ఉపాధి కూలీలు ప్రతిరోజు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పని ప్రదేశంలో నీడను ఏర్పాటు చేసుకోవటానికి టెం ట్లు, పట్టలు అందించాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టలేదు. 2016లో ఉపాధిపనుల సందర్భంగా నీడ కోసం పట్టలు పంపిణీ చేయగా ప్రస్తుతం అవి ఎక్కడా ఉపయోగించడం లేదు. ప్రస్తుతం నూతన గ్రూపు లు కూడా తయారై పనులు చేస్తున్నాయి. వారికి పట్టలు అందించలేదు. 

మెడికల్‌ కిట్‌లు లేవు.. 

ఉపాధి కూలీలకు అనారోగ్య సమస్య తలెత్తినా, వడదెబ్బ తగిలినా ఉపయోగించుకునేందుకు అధికారులు మెడికల్‌ కిట్‌లను అందించాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు.  ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి తోడు పని ప్రాంతాలలో ఎక్కువగా తేళ్లు, పాము కాట్లకు గురయ్యేవారు అనేకం ఉన్నారు. దీంతో ప్రథమ చికిత్స కిట్‌లు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కూలీలకు మజ్జిగ, మంచి నీటిని పని చేసే చోట సమకూర్చాలి.  ఉపాధి పనులు జరుగుతున్న చోట మజ్జిగ, మంచినీటిని అందించడం లేదు.  కూలీలు ఇంటి నుంచే బాటిళ్లతో నీటిని తీసుకెళ్తున్నారు. ఆ నీరు అయిపోతే దాహంతో ఇబ్బంది పడుతున్నామని కూలీలు చెప్తున్నారు. మంచినీరు తీసుకెళ్లినందుకు  రూ.6 చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సగటు వేతనం రూ.248లకు పని చేస్తేనే మజ్జిగ పంపిణీ డబ్బులు వస్తాయని లేదంటే రావని అధికారులు అంటున్నారు.

Updated Date - 2021-04-18T05:27:55+05:30 IST