అణగారిన వర్గాల ఉద్ధరణ

Published: Fri, 18 Mar 2022 00:47:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అణగారిన వర్గాల ఉద్ధరణ

నైతిక పునరుజ్జీవనం లేనిదే జాతీయ పునరుజ్జీవనం అసాధ్యమని విశ్వసించిన ఉదార సంస్కరణవాది గోపాలకృష్ణ గోఖలే (1866–1916). మహాత్మాగాంధీ ఆయన్ని తన రాజకీయ గురువుగా గౌరవించారు. గోఖలే ‘విదేశీ పాలనను అసహ్యించుకున్నాడు; అయితే భారతదేశం పడిన కడగండ్లకు కారణమంతా బ్రిటిష్ వారే అని నిందించలేదు. భారతదేశం తన సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనపు శృంఖలాలను, రాజకీయ బానిసత్వాన్ని తెంచుకోవాలని అతడు కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వ పరిచయాన్ని లౌకిక, ఆధునిక, ప్రజాస్వామ్యయుత సమాజ నిర్మాణానికి కలిగిన అవకాశంగా మార్చుకోవాలని అతడు కోరుకున్నాడని’ ఒక చరిత్రకారుడు రాశాడు. 1903లో ధార్వాడలో జరిగిన సామాజిక సభలో నిమ్నకులాల పరిస్థితులపై గోఖలే చేసిన ప్రసంగంలోని భాగాలివి:


ప్రస్తుతం నిమ్న కులాల వారి దిగజారిన పరిస్థితులు వాటికవిగానూ, జాతీయ దృష్ట్యా కూడా అసంతృప్తికరంగా ఉన్నాయనీ, దేశ హితైషులందరూ ఈ వర్గాల వారిలో ఆత్మాభిమానాన్ని జాగరూకం చేసి వారి నైతిక సామాజిక పరిస్థితిని ఉద్ధరించే ప్రయత్నం చేయాల్సిన, వారికి విద్య, ఉపాధులకు తగిన సౌకర్యాల చేరువ కల్గించాల్సిన బాధ్యత తమదిగా భావించాలన్న అభిప్రాయం వారందరికీ ఉండాలని ఈ సభ భావిస్తోంది.


నేను అనవసరంగా ఘాటు భాషను ప్రయోగించటానికి అలవాటుపడిపోయిన వాడిని కాదు గానీ, ఈ తీర్మానం కావాల్సినంత గట్టి మాటలతో రాయబడలేదని మాత్రం చెప్పక తప్పదు. నిమ్న కులాల వారి పరిస్థితి -నిమ్న కులాల వారని వారిని పిలవటం ఎంతో బాధాకరం- అసంతృప్తికరమే కాదు, మన సామాజిక ఏర్పాట్లలో ఇదో పెద్ద కళంకంగా తయారవటం మహాశోచనీయ విషయం; ఆ పైన ఈ వర్గం పట్ల మన విద్యావంతులయిన పురుషుల వైఖరి చాల బాధాకరం, లజ్జాకరం. ఓ పాతకాలపు మనిషిగా నేనీ అంశాన్ని గురించి ప్రసంగించబోవటం లేదు; న్యాయం, మానవత్వం, జాతీయ స్వీయ ఆసక్తుల దృష్టికోణం నుండి కొన్ని సాధారణ పరిశీలనలను మీముందుంచుతాను. ఓ వర్గపు మనుషులను, మన శరీరాల్లాంటి శరీరాలున్న మనుషులు, ఆలోచించగల మెదడు, అనుభూతి పొందగల గుండె కలిగిన మనుషులను శాశ్వతంగా మహాదుర్భర దయనీయ బానిసత్వ, మానసిక నైతిక పతనాల జీవితాన్ని గడపాలని నిర్దేశించటం, శాశ్వతమైన అడ్డంకులను వారికి కలిగించి, వారికి వాటిని అధిగమించడం అసాధ్యమయ్యేట్టు చేసి, వారు తమ భాగ్య రేఖను మెరుగుపరుచుకునే ప్రయత్నం జరగకుండా చేయటం మహారాక్షసత్వమని న్యాయపూరిత బుద్ధిగల వ్యక్తులందరూ అంగీకరిస్తారని నేననుకుంటున్నాను. ఈ అన్యాయంలో ఉన్న బాధను, ఆర్తిని అర్థం చేసుకోవాలంటే మనం మనల్ని మానసికంగా వారి స్థానంలో ఊహించుకోవాల్సి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనం ఒక పిల్లిని తాకవచ్చు, ఒక కుక్కను తాకవచ్చు, మరే జంతువునైనా తాకవచ్చు. కానీ ఈ మనుషులను తాకటం మైలపడిపోవటం! అలా తమను పరిగణించటాన్ని నిరసించటం అవసరమన్న విషయం వాళ్లే గమనించటం లేదంటే ఆ జనుల మానసిక దిగజారుడుతనం ఎంత సంపూర్ణ మైందో మనకు తెలుస్తుంది. అంతకంటే గొప్పగా తమతో వ్యవహరించటం తగదని వారే అంగీకరిస్తున్నారు.


మన సమాజ రక్షణ కొరకు కులాలు ఎంతో ఉపయోగకరమైనవని ఒక గొప్ప రచయిత రాశాడు; అయితే ప్రగతి ప్రయోజనాలకే మాత్రం సరిపోనటువంటిది. ఇది పరిపూర్ణ సత్యమని నేను భావిస్తాను. మనం వెయ్యేళ్ల క్రితం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండదల్చుకుంటే, కులాల వ్యవస్థను పెద్దగా సవరించాల్సిన పని ఉండదు. అయితే మనం ఎంతో కాలం నుండి మునిగి ఉన్న బురద గుంట నుండి బయటకు రావాలనుకుంటే మాత్రం తప్పకుండా కుల వివక్షలను పాటించాలంటే కుదరదు. ఆధునిక, నాగరికత, పాత ప్రపంచపు భావాలు నాటుకుని ఉన్న ప్రత్యేక హక్కులకు, బహిష్కరణలకు వ్యతిరేకంగా అత్యధిక సమానత్వాన్ని నినాదంగా స్వీకరిస్తోంది. మన అణగారిన దేశీయుల నిస్సహాయ స్థితి నుండి వారి ఉద్ధరణ కోసం పాటు పడ్తూ, వారి హక్కులను మనం గుర్తించాల్సి ఉంటుందని ఈ కాలపు విస్తృత మానవ జాతి కోరుతున్నది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.