Hyderabad : ఉప్పల్‌ భగాయత్‌లో ప్లాట్ల Online వేలానికి వేళాయే.. నేడు, రేపు ప్రక్రియ..!

ABN , First Publish Date - 2021-12-02T16:51:42+05:30 IST

వేలంలో పాల్గొనేవారంతా కనీసం రూ.వెయ్యి కోట్‌ చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా కోట్‌ చేసినవారికి ఈ-వేలం ముగిసిన వెంటనే ప్లాట్‌ దక్కించుకున్నట్లు సమాచారమిస్తారు...

Hyderabad : ఉప్పల్‌ భగాయత్‌లో ప్లాట్ల Online వేలానికి వేళాయే.. నేడు, రేపు ప్రక్రియ..!

  • ముగిసిన రిజిస్ట్రేషన్‌, ఈఎండీ చెల్లింపులు


హైదరాబాద్‌ సిటీ : ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ కామర్స్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేలం జరగనుంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లుగా 44 ప్లాట్లు, 1.35 లక్షల చదరపు గజాలను ఈ-వేలం వేయనున్నారు. ఈఎండీ చెల్లించిన వారికి మాత్రమే వేలం పేజీ అందుబాటులో ఉంటుంది. వేలంలో పాల్గొనేవారంతా కనీసం రూ.వెయ్యి కోట్‌ చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా కోట్‌ చేసినవారికి ఈ-వేలం ముగిసిన వెంటనే ప్లాట్‌ దక్కించుకున్నట్లు సమాచారమిస్తారు.


గజానికి వెయ్యి కోట్‌పై..

గతంలో జరిగిన వేలం ప్రక్రియల్లో కనీస కోట్‌ రూ.100 ఉండేది. మూడో దశలో జరుగుతున్న ప్లాట్ల వేలంలో బిడ్డర్లు కనీస కోట్‌ రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఒకేసారి పదింతలు పెంచడంపై పలువురు బిల్డర్లు, రియల్టర్లు పెదవి విరిస్తున్నారు. గజానికి వెయ్యి కోట్‌ చేయడం వల్ల 500 గజాల ప్లాట్‌కు అదనంగా రూ.5 లక్షలు అధికం అవుతోందని ఓ డెవలపర్‌ వాపోయారు.


నిబంధనలు 

- వేలం పాట సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా హెచ్‌ఎండీఏ పేర్కొన్న అప్‌సెట్‌ ధర కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ పాడాల్సి ఉంటుంది.

- వేలంలో ఎక్కువ ధరకు ప్లాట్లు పొందిన వారు వాయిదాల పద్ధతిలో కూడా ధరను చెల్లించుకోవచ్చు. 

- కొనుగోలుదారుడు వారం రోజుల లోపు ప్లాటు ధరలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

- మిగతా 75 శాతం నిర్ణయించిన తేదీల్లో చెల్లించాల్సి ఉంటుంది.

- వాయిదాల ద్వారా చెల్లించాలనుకుంటే 60 రోజుల అనంతరం నిర్ధారిత వడ్డీతో 


ఏడాదిలో చెల్లించాలి.

- బ్యాంకు రుణం పొందేందుకు కొనుగోలుదారులకు హెచ్‌ఎండీఏ అవసరమైన ప్రమాణ పత్రాన్ని అందివ్వనుంది.

- ప్లాట్‌ దక్కని వారు చెల్లించిన ఈఎండీ వేలం ప్రక్రియ ముగియగానే మరుసటి రోజు వారి ఖాతాలో జమ కానుంది.


వేలంలో పాల్గొనాలంటే..

-  తొలుత http://www.mstcecommerce.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

-  ఈఎండీ చెల్లించినవారికి జారీ చేసిన ఐడీ, పాస్‌వర్డ్‌ను వెబ్‌సైట్‌లో ఎడమ వైపున ఉన్న లాగిన్‌/రిజిస్టర్‌లో ఎంటర్‌ చేసి క్లిక్‌ చేయాలి.

-  బిడ్డింగ్‌ హాల్‌ అనే పేరుతో గల పేజీ వస్తుంది.

-  కరెంట్‌ టైమ్‌, రిమైనింగ్‌ టైమ్‌ ఉంటుంది. బిడ్‌ దాఖలుకు చివరి సమయమెంత అనే వివరాలుంటాయి. సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ధరను నిర్ణయించాలి.

-  బిడ్‌ చేయడానికి కనీసం వెయ్యి రూపాయలు కోట్‌ చేయాలి.

-  అప్‌సెట్‌ ప్రైస్‌లో ధర వేసేటప్పుడు కామాలు, ఫుట్‌స్టాప్‌లు పెట్టకూడదు

-  అప్‌సెట్‌ ప్రైస్‌లో ధర నిర్ణయించిన తర్వాత పక్కనే అక్షరాల్లో ఆ వివరాలుంటాయి. చూసుకోవాలి.

-  మొత్తం ధర కూడా ఉంటుంది. దాని పక్కనే ఉన్న బిడ్‌ను క్లిక్‌ చేయాలి.

-  ఎంట్రీ చేసిన ధరను అంగీకరించడానికి ఎస్‌ ఆర్‌ నో పై క్లిక్‌ చేయాలి.

-  హెచ్‌-01బిడ్‌ అనే బాక్స్‌లో మనం నిర్ణయించిన ధరనే వస్తుంది. నిర్ణీత సమయంలో మరెవ్వరూ బిడ్‌ చేయకపోతే హెచ్‌1 బిడ్‌లో ఉన్న ధరకే ప్లాట్‌ దక్కుతుంది.


ఈ - వేలం ఇలా..

కమర్షియల్‌ - 08 ప్లాట్లు

మల్టీపర్ప్‌సజోన్‌-15 ప్లాట్లు

రెసిడెన్షియల్‌ జోన్‌- 21 ప్లాట్లు

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం- 12 (మొదటి దశ)

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం- 05 (రెండో దశ)

Updated Date - 2021-12-02T16:51:42+05:30 IST