ltrScrptTheme3

‘ఉప్పెన’ మూవీ రివ్యూ

Feb 12 2021 @ 13:37PM

చిత్రం:  ఉప్పెన‌

వ్య‌వ‌థి:  2 గంట‌ల 27 నిమిషాలు

సెన్సార్‌:  యు/ఎ

బ్యాన‌ర్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

న‌టీన‌టులు:  వైష్ణ‌వ్ తేజ్‌, క్రితిశెట్టి, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా

నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సుకుమార్‌

సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  శ్యామ్‌ద‌త్‌

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి


ఈ మ‌ధ్య కాలంలో పాట‌లు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అయ్యి సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసిన వాటిల్లో ఉప్పెన ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాతగా తన సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో మరో ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీస్ తో క‌లిసి ఈ సినిమాని నిర్మించాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యారు. ఈ సినిమాతో సాయితేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కన్నడ బ్యూటీ క్రితిశెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమా పాట‌ల‌కు చాలా మంచి క్రేజ్ ద‌క్కింది. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌ల‌కు మంచి బ‌జ్ వ‌చ్చింది. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.. 

కథ:

కాకినాడ తీరప్రాంతంలోని ఉప్పాడ విలేజ్‌లో శేషగిరి రాయనం(విజయ్ సేతుపతి) అంటే బెదురు. ఆయన ఆ ఏరియాలో మార్కెట్‌ యార్డ్‌ కట్టాలని అనుకుంటాడు. అయితే అక్కడున్న చేపలు పట్టి కుటుంబ జీవనాన్ని సాగించే ప్రజలు అందుకు ఒప్పుకోరు. అదే సమయంలో రాయనం కూతురు సంగీత అలియాస్‌ బేబమ్మ(కృతిశెట్టి) పదిహేను కిలోమీటర్ల దూరంలో టౌన్‌లో డిగ్రీ చదువుతుంటుంది. ఆమెను చేపలు పట్టి వ్యక్తి జానయ్య(సాయిచంద్‌) కొడుకు ఆశి(వైష్ణవ్‌ తేజ్‌) ప్రేమిస్తాడు. వన్‌సైడ్‌ లవ్‌ కాస్త ఆమెకు తెలియడం, ఆమె ఓకే చెప్పడంతో ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ కథ అనుకోని మలుపు తీసుకుంటుంది. తన కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందని రాయనంకు తెలుస్తుంది. జాతి, కులాలను పరువుగా భావించే రాయనం, అదెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆశి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?  ఆశితో బేబమ్మ పారిపోతుంది. కానీ ఆశీ కారణంగా బేబమ్మను రాయనం మనుషులు పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. అసలు సంగీతను ఆశి ప్రేమిస్తాడా?  ఆశి, సంగీత మధ్య నిజమైన ప్రేమ ఉందా?  చివరకు వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ:

స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సుకుమార్‌ తను చెప్పాలనుకున్న కథలను కానీ, తన వద్ద పనిచేసే శిష్యులు తయారు చేసుకున్న కథలను కానీ తెలుగు ప్రేక్షకులకు సినిమాల రూపంలో చూపించే క్రమంలో నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై సినిమా చేస్తున్నాడు. ఆ క్రమంలో తన శిష్యుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమానే ఉప్పెన. లవ్‌స్టోరి కావడంతో ఫ్రెష్‌గా ఉండే జంటను తెరపై చూపించడానికి సాయితేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేయడమే కాకుండా, మలయాళ బ్యూటీ కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమాలో టీజర్‌, సాంగ్స్‌లో వైష్ణవ్‌ తేజ్‌, కృతి పెయిర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదీగాక.. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బలంగా మారాయి. నీ నీలి కన్ను సముద్రం పాట.. , జల జల జారే,.. ఇలా పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించినవే. దీంతో సినిమాపై ఓ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇవన్నీ ఒకెత్తు అయితే, ఈ సినిమాలో కోలీవుడ్‌ విలక్షణ నటుడు మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించడం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. సినిమా రాయనం అనే పాత్రను విజయ్‌ సేతుపతి బ్యాలెన్స్‌డ్‌గా క్యారీ చేసిన తీరు సింప్లీ సూపర్బ్‌. విజయ్‌ సేతుపతి పాత్రను తీర్చిదిద్దిన తీరు చక్కగా ఉంది. తను ఫ్రేమ్‌లో ఉన్న ప్రతీ సీన్‌ ప్రేక్షకుడికి నచ్చుతుందనడంలో సందేహం లేదు. ఇక విజయ్‌ సేతుపతి పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన తీరు బావుంది. ఏటి.. అంటూ విజయ్‌ సేతుపతి చెప్పే యాక్సెంట్‌, తన ఎక్స్‌ప్రెషన్స్‌ బావుంటాయి.


ఈ సినిమాకు తన పాత్రే మూలం. ఇక మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణవ్‌ తేజ్‌.. ఎక్కడా తాను కొత్త హీరోను అనే బెరుకుతో నటించినట్లు అనిపించదు. తన పాత్రలో అంతగా ఒదిగిపోయి చేశాడు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి సినిమాకు చాలా ఫ్రెష్‌ లుక్‌ను తీసుకొచ్చింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ కుర్రాళ్లనే కాదు, అమ్మాయిలకు కూడా నచ్చేలా ఉంది. ఇక సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌ తండ్రి పాత్రలో సాయిచంద్‌ నటన.. ఆ పాత్రకు అతికినట్లు సరిపోయింది. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే సినిమా చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. శ్యామ్‌దత్‌ సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌ లుక్‌ను ఇచ్చింది. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మేజర్‌ ఎస్సెట్‌గా నిలిచింది. 


ఓ మంచి టీమ్‌కలిస్తే సాధారణ సినిమాను కూడా అసాధారణంగా చూపించే ప్రయత్నం చేయవచ్చు అంటే ఉప్పెన సినిమా అందుకు సరిపోతుంది. సోషల్‌ మీడియాలో హీరో మర్మాంగాన్ని విలన్‌ కోసేస్తాడంటూ వార్తలు వినిపించాయి. ఆ పాయింట్‌ను బేస్‌ చేసుకుని రాసుకున్న కథ. ప్రేమ, దేవుడు గొప్ప.. వాటిని విగ్రహంతో పనిలేదు అనే పాయింట్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాలో చెప్పేప్రయత్నం చేశాడు కానీ.. ఎంత మందికి కనెక్ట్‌ అవుతుందనేది సినిమా నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడిని తొలిచే ప్రశ్న. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఎండింగ్‌ను ఎలా రిసీస్‌ చేసుకుంటారనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. విలన్‌ క్యారెక్టర్‌ పరువు కోసం ఏదైనా చేస్తాడు అనే చెప్పి ఎలివేట్‌ చేసే ప్రయత్నం జరిగింది కానీ.. దానికి తగ్గ సన్నివేశాలను చూపించలేదు. సినిమాలో ప్రేమ కథలో కొత్తదనం లేదు. సంగీతం, ఇతర సాంకేతిక, విజయ్‌ సేతుపతి, మంచి నిర్మాణ సంస్థ లేకపోతే.. ఉప్పెన కూడా బోరింగ్‌ ప్రేమకథగా మారిపోయేది. 


చివరగా... దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు వినడానికి బావున్నాయే.. మరి చూడటానికి ఎలా ఉంటాయో అనుకునేవారు.. మెగా ఫ్యామిలీ నుంచి ఇంట్రడ్యూస్‌ అయిన వైష్ణవ్‌ తేజ్‌ ఎలా నటించాడో చూద్దాం అనుకునేవారు...ఫైనల్‌గా విజయ్‌ సేతుపతి విలనిజాన్ని ఎలా చేశాడనుకునేవారు ఉప్పెన సినిమాను చూడొచ్చు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.