జై హింద్‌..!

ABN , First Publish Date - 2022-08-15T05:26:25+05:30 IST

కలసపాడు మండలం ఎగువ రామాపురం వ్యవసాయ గ్రామం. ఇక్కడ సుమారు 800 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడంతా వ్యవసాయ కుటుంబీకులే. ఈ గ్రామం నుంచి 25 ఏళ్ల క్రితం ఏడెనిమిది మంది ఆర్మీలో పనిచేసేవారు. వారిని ఆదర్శంగా తీసుకున్న

జై హింద్‌..!
ఆర్మీ ఉద్యోగులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఎగువ రామాపురం గ్రామం

ఎగువ రామాపురం కేరాఫ్‌ ఆర్మీ

120 మంది దేశ సేవలో..


వారికి దేశమంటే మహా పిచ్చి. భరతమాతకు సేవ చేయడాన్ని  గొప్పగా భావిస్తారు. అంతే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ రక్షణలో భాగమయ్యారు. ఇరవై ఐదేళ్ల కిందట గ్రామం నుంచి ఐదారుగురు మాత్రమే ఆర్మీలో ఉండేవారు. అయితే ఆ కొందరిని ఆదర్శంగా చేసుకొని ఆర్మీపై యువత ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు సుమారు 120 మంది యువత దేశరక్షణలో భాగమయ్యారు. దేశంలో వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. ఇంతటి ఘనత సాధించిన ఊరు కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశరక్షణలో భాగస్వామ్యమైన ఎగువ రామాపురం గురించి తెలుసుకుందాం..


(కడప - ఆంధ్రజ్యోతి): కలసపాడు మండలం ఎగువ రామాపురం వ్యవసాయ గ్రామం. ఇక్కడ సుమారు 800 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడంతా వ్యవసాయ కుటుంబీకులే. ఈ గ్రామం నుంచి 25 ఏళ్ల క్రితం ఏడెనిమిది మంది ఆర్మీలో పనిచేసేవారు. వారిని ఆదర్శంగా తీసుకున్న గ్రామంలోని మిగతా యువత కూడా ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. టెన్త్‌, ఇంటర్‌ పాస్‌ అయితే చాలు.. ఆర్మీలో కొలువులు దక్కడం, మంచి వేతనం, రిటైర్‌మెంటు తరువాత కూడా ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు ఉంటున్నాయి. దేశ భక్తి మెండుగా ఉన్న యువత ఆర్మీ ఉద్యోగాల వైపే దృష్టి సారిస్తున్నారు. దీంతో టెన్త్‌ ఉత్తీర్ణత అయిన వెంటనే కొందరు ఆర్మీ ఉద్యోగాన్నే లక్ష్యంగా పెట్టుకుంటూ వచ్చారు. ఆర్మీలో పనిచేస్తూ సెలవుల్లో వచ్చిన వారి నుంచి మెళకువలు, సలహాలు తీసుకుని శారీరకంగా ఫిట్‌నెస్‌ సాధిస్తూ వస్తున్నారు. ఆర్మీకి అవసరమైన దేహదారుఢ్య, రాత పరీక్షల్లో పాసయ్యేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించేవారు. దీంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరిగితే చాలు.. కనీసం ఏడాదికి 5 నుంచి 8 మంది వరకు ఎగువ రామాపురం నుంచి ఆర్మీ ఉద్యోగాలు దక్కించుకునేవారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 120 మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. దేశంలోని వివిధ రెజిమెంట్లలో విధులు నిర్వహిస్తున్నారు. 


దేశ భద్రతలో కీలకం

అణువణువునా దేశ భక్తి నింపుకున్న ఎగువ రామాపురం యువత మొక్కవోని దీక్షతో ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్ము కాశ్మీర్‌, చైనా బార్డర్‌లలో విధులు నిర్వహించేవారు. ముష్కరుల ఏరివేత కోసం జరిగిన పలు ఆపరేషన్లలో పాల్గొన్నారు. 1999 జూలైలో కాశ్మీర్‌లోని కార్గిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఎగువ రామాపురం జవాన్లు కరీం, ఓబయ్య పాల్గొన్నారు. పాక్‌ ముష్కరులను తరిమికొట్టడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తరువాత 2008 నవంబరు 26న జిహాదీలు ముంబైని ముట్టడించారు. తాజ్‌ హోటల్‌, ఛత్రపతి శివాజీ టెర్మినల్‌, మెట్రోప్రాంతంలో నరమేధానికి పాల్పడ్డారు. ఆ నెల 26 నుంచి 29 వరకు జరిగిన మారణహోమంలో 170 మంది మరణించారు. అప్పట్లో జిహాదీలను ఏరివేసేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఎగువ రామాపురానికి చెందిన బండి ప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు. భరతమాత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్తాన్‌ ముష్కరులను తరిమికొట్టడంలో జవాన్లు మొక్కవోని దీక్షతో విధులు నిర్వహించారు. దీంతో కడప జిల్లా ఖ్యాతి నలుదిక్కులా పాకింది.


గర్వంగా ఉంది...

- బి.నారాయణరెడ్డి, ఆర్మీ ఉద్యోగి 

నాకు ఊహ వచ్చేనాటికి మా వూరి నుంచి ఎక్కువ మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు మా వాళ్లను చూసి నేను కూడా ఆర్మీలోకి వెళ్లాలనిపించింది. కార్గిల్‌ యుద్ధం గురించి పేపరులో చూసి ఇండియన్‌ ఆర్మీ అంటే ఎనలేని మక్కువ ఏర్పడింది. 2019లో ఆర్మీలో చేరా. పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం జరిగిన పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను. దేశరక్షణలో పాలుపంచుకోవడం గర్వంగా ఉంది.


కల నెరవేరింది

- పి.బ్రహ్మయ్య, ఆర్మీ ఉద్యోగి

ఆర్మీలో పనిచేయాలన్నది నా కల. మా ఊరి నుంచి పెద్ద ఎత్తున ఆర్మీలోకి వెళ్లారు. దేశ రక్షణలో పాలు పంచుకోవాలన్నది నా ఆశ. అందుకు తగ్గట్లుగానే ప్రణాళిక రూపొందించుకున్నా. 2011లో ఆర్మీలో జాయిన్‌ అయ్యాను. జమ్ము, కలకత్తా, కాశ్మీర్‌లాంటి చోట్ల పనిచేశాను. ఉగ్రవాదుల ఏరివేత కు జరిగిన పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను. ఇప్పుడు హవల్దారుగా పనిచేస్తున్నాను.


సేవ చేశానన్న తృప్తి మిగిలింది 

- చిన్న గురవయ్య, ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి, ఎగువ రామాపురం

దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు ఆర్మీలో పనిచేశా. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. ఉగ్రవాదుల  ఏరివేతలో జరిగిన సైనిక ఆపరేషన్లలో నేను భాగస్వామ్యమయ్యాను. ఏడాది క్రితం రిటైర్‌ అయ్యాను. దేశ రక్షణలో భాగమయ్యాననే  సంతృప్తి నాకు ఉంది.


సెల్యూట్‌ చేస్తున్నా

- ఎన్‌.వెంకటయ్య, సర ్పంచ్‌, ఎగువ రామాపురం 

మా ఊరి నుంచి 120 మంది దేశ రక్షణలో భాగస్వామ్యం కావడం నాకు చాలా గర్వంగా ఉంది. పండుగలకు, ఇతర సెలవులకు ఆర్మీ ఉద్యోగులు ఊర్లకు వస్తారు. అప్పుడు గ్రామం ఆర్మీ ఉద్యోగులతో కళకళలాడుతుంటుంది. దేశ రక్షణలో మేము సైతం అంటూ భాగస్వామ్యమైన మా ఊరి వాసులకు సెల్యూట్‌ చేస్తున్నా.

Updated Date - 2022-08-15T05:26:25+05:30 IST