పైపైకి గంగమ్మ

ABN , First Publish Date - 2021-10-06T04:06:40+05:30 IST

జల సంరక్షణ కోసం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, వాననీటి సంరక్షణ, హరితహారం కార్యక్రమాలతో గత నాలుగేళ్లలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

పైపైకి గంగమ్మ
నీటితో కళకళలాడుతున్న చిన్నచింతకుంట మండలం బండర్‌పల్లి చెక్‌డ్యాం

ఉమ్మడి జిల్లాలో పెరిగిన నీటి లభ్యత

చెరువుల పునరుద్ధరణతో జలకళ

డార్క్‌ మండలాల్లో 20 నుంచి 3 మీటర్లకు..

చెక్‌డ్యాంలు, ఊటకుంటలలో నీటి గలగలలు

పెరిగిన వరి సాగు..


 జల సంరక్షణ కోసం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, వాననీటి సంరక్షణ, హరితహారం కార్యక్రమాలతో గత నాలుగేళ్లలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.  పధానంగా గతంలో డార్క్‌ మండలాలుగా ప్రకటించిన మిడ్జిల్‌, చిన్నచింతకుంట, రాజాపూర్‌, తాడూరు తదితర మండలాల్లో ప్రస్తుతం 4 మీటర్లకు లోపే భూగర్భ జలాలు లభిస్తున్నట్లు భూగర్భ జలశాఖ ప్రకటించింది. 

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతిప్రతినిధి


ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాల లభ్యత పెరిగింది. 2015-16లో సగటున 13 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 4 నుంచి 5 మీటర్ల లోతులో అందుబాటులోకి వచ్చాయి. సమీపంలో కాల్వల ప్రవాహం, చెరువుల్లో నీరు నిండుగా ఉంటుండడం, హరితహారం తదితర కార్యక్రమాలతో పాటు, సకాలంలో వర్షాలు పడుతుండడంతో భూగర్భ జలాల లభ్యత పెరిగింది. 2015-16కు ముందు డార్క్‌ మండలాలుగా ప్రకటించిన మిడ్జిల్‌, రాజాపూర్‌ సీసీకుంట, జడ్చర్ల, తాడూరు, మహబూబ్‌నగర్‌ మండలాల్లో అప్పట్లో సగటున 20 మీటర్ల లోతు తర్వాతే భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. 3, 4 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభిస్తుండడం గమనార్హం. 


జల సంరక్షణ పథకాలతో పెరిగిన నీటి లభ్యత

ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా రెండు దశలు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు మిషన్‌కాకతీయ ఐదు దశల్లో దాదాపు 5,300 పైచిలుకు చెరువులను పునరుద్ధరించారు. 1,215 ఊట కుంటలు, 342 చెక్‌డ్యాంలు నిర్మించారు. దాదాపు 656 వాన నీటి సంరక్షణ పథకాలు చేపట్టారు. చెరువులు, ఊట కుంటల్లో పూడిక తీత, కట్టల బలోపేతంతో వాననీటి సంరక్షణ సులభమైంది. దీంతో చెరువులు, కుంటలు నీటితో నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభించే కోయిలకొండ, భూత్పూర్‌, గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాల్లో ప్రస్తుతం 6 మీటర్లలోపే నీరు అందుబాటులో ఉంది. 


పెరిగిన ధాన్యం ఉత్పత్తి

ఉమ్మడి జిల్లాలో ఒక వైపు ప్రాజెక్టులు, మరోవైపు చెరువులు, చెక్‌డ్యాంల నిర్మాణాలతో వరి సాగు పెరగడంతో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా  పెరిగింది. 2015-16 యాసంగిలో 1,04,350 ఎకరాల్లో మాత్రమే వరి సాగవగా, ప్రస్తుతం  5,73,533 ఎకరాల్లో సాగయ్యింది. ఒక్క సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుండడం పెరిగిన సాగు ప్రభావానికి నిదర్శనంగా చెప్పొచ్చు. సాగు అవకాశాలు పెరగడం, సులభతర విధానాలు, పంట గ్యారంటీ దక్కుతుండడంతో వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. దీంతో గతానికి భిన్నమైన ఫలితాలొస్తున్నాయి.

Updated Date - 2021-10-06T04:06:40+05:30 IST