
అర్ధాంతరంగా చెరువుల సుందరీకరణ పనులు
పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు
నిధుల కొరతతో కొన్నిచోట్ల..
కోర్టు కేసులతో ఇంకొన్ని ..
అర్బన్ మిషన్ భగీరథ ఆగమాగం
బండ్ల బలోపేతం, చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్ స్కేపింగ్, సందర్శకులు కూర్చునేలా కుర్చీలు, మురుగు నీటి మళ్లింపు వంటి పనులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చెరువుల సుందరీకరణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్క చెరువు వద్ద కూడా పనులు పూర్తి కాలేదు. చాలా చోట్ల 20, 30 శాతం పనులు పూర్తి కాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమూ కాలేదు.
హైదరాబాద్ సిటీ: అర్బన్ మిషన్ కాకతీయతో నగరంలో చెరువుల రూపురేఖలు మారుస్తామని చెప్పిన సర్కారులోని కీలక వ్యక్తులు, నిధుల్లేక పనులు నిలిచిపోయినా పట్టించుకోవడం లేదు. అధికారులు ఆ ఊసేత్తినా తర్వాత చూద్దామంటూ దాటవేస్తున్నారని తెలిసింది. సుందరీకరణ పక్కన పెడితే.. అసంపూర్తి పనులతో కొత్త సమస్యలు నెలకొన్నాయని పరిసరాల్లోని కాలనీలు, బస్తీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కాగితాల్లో 185 చెరువులున్నాయి. వీటి పరిరక్షణ, సుందరీకరణ లక్ష్యంగా అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో 19 చెరువుల అభివృద్ధికి 2018లో రూ.280 కోట్లు విడుదల చేసింది. బిల్లులు పెండింగ్‌లో ఉండి కొన్ని చోట్ల పనులు నిలిచిపోగా.. కోర్టు కేసులతో మరికొన్ని చెరువుల వద్ద పనులు సాగడం లేదు.
బిల్లులు పెండింగ్
సుందరీకరణ పనుల్లో ఆశించిన స్థాయి పురోగతి కనిపించడం లేదు. అర్బన్ మిషన్ భగీరథకు నీటి పారుదల శాఖ నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.55 కోట్ల వరకు ఖర్చయ్యాయని, మరో రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.
కోర్టులో పిటిషన్లతో
కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో కొన్ని చెరువుల్లో పనులు నిలిచిపోయాయి. చెరువుల్లో పట్టా భూములున్న కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. శిఖం పట్టా భూముల్లో సాగుచేసుకునే అవకాశం యజమానులకు ఉంటుంది. క్రయ, విక్రయాలు చేసే అధికారం ఉండదు. నగరీకరణ నేపథ్యంలో చెరువులనూ లేఅవుట్లుగా మారుస్తోన్న దృష్ట్యా.. మున్ముందు తమ భూములకూ డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో అక్రమంగా పనులు చేస్తున్నారని కొందరు కోర్టు మెట్లెక్కినట్టు తెలుస్తోంది. ఏడు చెరువులకు సంబంధించిన పనులు కోర్టు కేసుల వద్ద నిలిచిపోవడం జరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని చెరువుల వద్ద పరిస్థితి..
64 ఎకరాల బోయన్‌పల్లి హస్మత్‌పేట చెరువు సుందరీకరణకు రూ.14.45 కోట్లు మంజూరు చేశారు. అనంతరం అదనంగా మరో రూ.10 కోట్లు కేటాయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లను మార్చినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు.
కూకట్పల్లి నల్ల చెరువు పనులు కోర్టు కేసుతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఖాజాకుంట అభివృద్ధికి 2017లో శంకుస్థాపన చేయగా పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి.
ప్రగతినగర్ అంబీర్‌చెరువు సుందరీకరణ పనులు రూ.25 కోట్లతో 2018లో ప్రారంభించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మళ్లింపు పూర్తి కాకపోవడంతో మురుగు చెరువులో చేరుతోంది.
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మార్కండేయనగర్లో రూ.5 కోట్లతో చేపట్టిన నర్సాబాయి కుంట సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. వాకింగ్ ట్రాక్ నిర్మించినా.. మురుగు నీరు చేరుతుండడంతో దోమల బెడదకు పరిసర ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
కాప్రా చెరువు సుందరీకరణ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం రూ.9 కోట్లతో పనులు చేపట్టారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్లే పనులు నిలిచిపోయినట్టు తెలిసింది.
నేరేడ్మెట్ ఆర్కే పురం చెరువు సుందరీకరణ పనులు 30శాతం కూడా జరగలేదు. రూ.12 కోట్లతో చేపట్టిన పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి.
ఉప్పల్ నల్ల చెరువుదీ అదే దుస్థితి. వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉండే చెరువు సుందరీకరణ పనుల వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో చెరువు ఉప్పొంగి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
మన్సురాబాద్ పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ నిర్మించి వదిలేశారు. కోర్టు వివాదంతో ఇతర పనులు నిలిచిపోయాయి. నాగోల్, బండ్లగూడ చెరువుల సుందరీకరణ పనులదీ అదే పరిస్థితి.
షేక్‌పేట కొత్త చెరువు సుందరీకరణ పనులు 30 శాతం మాత్రమే జరిగాయి. రూ.8కోట్లతో చేపట్టిన నెక్నాంపూర్ చెరువు సుందరీకరణ పనులు పురోగతిలో ఉన్నాయి.
మియాపూర్ పటేల్ చెరువు వద్ద పనులు నత్తనడకన సాగుతున్నాయి. మళ్లింపులో భాగంగా చెరువులో నీళ్లు ఖాళీ చేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పరిసర కాలనీల వాసులు గగ్గోలు పెడ్తున్నారు.