విద్యాశాఖలో.. వివాదం

ABN , First Publish Date - 2021-12-03T05:53:51+05:30 IST

విద్యాశాఖలో డిప్యూటేషన్‌ వివాదం నెలకొంది.

విద్యాశాఖలో.. వివాదం
డిప్యూటేషన్‌పై అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

బాపట్ల ఉర్దూ డీఐ డిప్యూటేషన్‌పై రగడ

రాజకీయ ఒత్తిడితో అధికారులు ఉక్కిరిబిక్కిరి

అర్హత లేనివారికి ఎలా ఇస్తారంటూ సంఘాల ఆగ్రహం

గుంటూరు(విద్య), డిసెంబరు 2: విద్యాశాఖలో డిప్యూటేషన్‌ వివాదం నెలకొంది. ఒకవైపు తాము సూచించిన మహిళకు పోస్టు ఇవ్వాలని  రాజకీయ ఒత్తిళ్లు వస్తుండగా.. మరోవైపు అర్హత లేనివారికి డిప్యూటేషన్‌ ఎలా ఇస్తారంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో బాపట్ల ఉర్డూ డీఐ పోస్టుపై విద్యాశాఖలో రగడ నెలకొంది. జిల్లాలో ఉర్దూ పాఠశాలల్ని పర్యవేక్షించడానికి ఇంతవరకు పూర్తిస్థాయిలో అధికారి లేరు. సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయుల్ని ఈ పోస్టులో విద్యాశాఖ నియమిస్తుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్‌కు ఎస్‌కేఎండీ ఖాసిం ఉర్దూ డీఐగా వ్యహారిస్తుండగా, బాపట్లలో విధులు నిర్వహించే డీఐ హాజ్‌ యాత్ర కోసం 3 నెలలు సెలవు పెట్టారు.  దీంతో అక్కడ రెండు నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్‌జేడీ, డీఈవో గుంటూరు డీఐను బాపట్లకు డిప్యూటేషన్‌పై నియమించారు. హజ్‌ యాత్ర నుంచి వచ్చిన సదరు ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేశారు. ఈ పరిస్థితుల్లో ఖాసిం  రెండో చోట్లా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు పనిభారం ఎక్కవైందని గుంటూరుకే పరిమితం చేయాలని ఖాసిం విద్యాశాఖకు లేఖరాశారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఉర్దూ డీఐ పోస్టు డిప్యూటేషన్‌పై  తనకు ఇప్పించాలని నిజాంపట్నం ప్రాంతంలో పనిచేసే ఓ మహిళా ఉపాధ్యాయురాలు అక్కడ నేతల్ని ఆశ్రయించారు. వాస్తంగా సీనియార్టీలో ఆమె పేరు చివరలో ఉంది. అయినా పోస్టుకు తనకు  ఇప్పించాలని నిజాంపట్నంలోని కీలక నేతల ద్వారా  అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు యూటీఎఫ్‌, ఎంటీఎఫ్‌, ఎస్టీయూ తదితర సంఘాల నాయకులు ప్రేమ్‌కుమార్‌, కళాధర్‌, అబ్దుల్‌ సాబిర్‌ అహ్మద్‌, సయ్యద్‌ ఇషాక్‌, పెదబాబు తదితరులు అర్హత లేనివారికి డీఐ పోస్టు ఎలా ఇస్తారంటూ అధికారుల్ని ప్రశ్నించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు గురువారం వినతిపత్రాలు అందజేశారు.   

Updated Date - 2021-12-03T05:53:51+05:30 IST