
ఆయన షాయిరీ ప్రియురాలితో సంభాషించదు. ఊహల రెక్కలతో కాల్పనిక ప్రపంచంలో విహరించదు. ప్రేయసీప్రియుల విరహవేదన, ఎడబాటు, కుంగుబాటు లక్షణాలు అందులో ఉండవు. ఆయన గజల్లో తల్లిప్రేమ నిండుగా కనిపిస్తుంది. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలపై ఆయన రాసిన ఒక్కో షేర్ హృదయ తంత్రుల్ని సుతారంగా మీటుతుంది. ముషాయిరాలో ఆయన గజళ్ళు వినేందుకు రాత్రి పొద్దుపోయేదాకా నిద్ర కాచే అభిమానులు దేశవిదేశాలలో కోకొల్లలు. ప్రతి షేర్‌లోనూ గుండెలను పిండేసేలా అక్షరాలను పొదిగి ఎంతో భావోద్వేగాన్ని కలిగించడం ఆయన ప్రత్యేకత. షాయిరీ విన్నాక చెమ్మగిల్లిన కళ్ళతో బరువెక్కిన గుండెను చిక్కబట్టుకుని ఇంటిదారి పట్టేవారే ఎక్కువ. ఆయనే... అమ్మ గొప్పదనంపై అద్భుతమైన షాయిరీతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న లబ్ధప్రతిష్టుడైన ఉర్దూ షాయర్ మునవ్వర్ రాణా. మునవ్వర్ అంటే ‘దేదీప్యమానం’ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఆయన ఊర్దూ సాహితీలోకానికి వెలుగులు పంచారు. రాణా తెలుగువారికి కూడా చిరపరిచితులే. హైదరాబాద్‌లో ఆయన అనేక దఫాలు ముషాయిరాలలో పాల్గొన్నారు.
మునవ్వర్ రాణా అసలు పేరు సయ్యద్ మునవ్వర్ అలీ. రాయబరేలీ (యూపీ)లో 1952 నవంబరు 26న పుట్టారు. సాధారణంగా అరబిక్, ఫార్సీ పదజాలాన్ని దట్టించి గజళ్ళు రాసే ఉర్దూ షాయర్లకు భిన్నంగా మునవ్వర్ తన కవితామార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన గజళ్ళలో ఎక్కువగా హిందీ, అవధ్ పదాలను వాడతారు. అందుకే అవి సామాన్యులకు సైతం ఎంతో చేరువయ్యాయి. గగనంలో విహరించే ఉర్దూ షాయిరీని భూమార్గం పట్టించి, దాని మాధుర్యాన్ని అందించిన ఘనత నిస్సందేహంగా మునవ్వర్ రాణాదే. అలతిఅలతి పదాలతో సులభశైలిలో అద్భుతమైన కవిత్వాన్ని ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. రాణాను ‘Emotional Blackmailing Poet’గా పలువురు సాహితీవేత్తలు, విమర్శకులు ఆరోపిస్తుంటారు. దీనికి ఆయన సమాధానం ఒక్కటే: ‘షాయర్లంతా కనిపించని అప్సరసలు, ప్రియురాళ్ళ సోయగాలను, వారితో సరసల్లాపాలను వర్ణించడానికే గజల్‌ను పరిమితం చేస్తే... నేను నా మాతృమూర్తిని ఇతివృత్తంగా తీసుకుని గజళ్ళు ఎందుకు రాయకూడదు? నాకు తల్లికి మించిన దైవం లేదు. నా జీవితంలో ఆమెకు మించిన ప్రియతమ వ్యక్తి మరొకరు లేరు. అందుకే ఆమెనే ఇతివృత్తంగా గజళ్ళు రాశాను’ అంటారాయన. అంతేకాదు, ‘మాఁ’ (తల్లి) పేరుతో ఆయన ఒక గజల్ కావ్యమే రాశారు. రాణా పుస్తకాలన్నీ ఒక ఎత్తయితే, ఈ కావ్యం మరొక ఎత్తు. ఇది ఆయనకెంతో పేరుప్రతిష్టలు తెచ్చింది. దీనిలోని కొన్ని గజళ్ళు చెప్పకుండా ఏ ముషాయిరా ముగియదు.
ధనమే ప్రధానమై మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో ఆస్తులతోపాటు తల్లిదండ్రుల పోషణను కూడా వంతులవారీగా పంచుకునే కొందరిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చెప్పిన షేర్ ఇది.
‘కిసీ కో ఘర్ మిలా హిస్సే మే, యా కోయీ దుకాఁ ఆయీ
మై ఘర్ మే సబ్సే ఛోటా థా, మేరే హిస్సే మే మాఁ ఆయీ’
(ఆస్తుల పంపకంలో ఒకరికి ఇల్లు, మరొకరికి షాప్ వచ్చింది.
నేను అందరికన్నా చిన్న, నా వాటాకు అమ్మ వచ్చింది!)
‘ఏ అంధేరే దేఖ్ లే మున్హ్ తేరా కాలా హో గయా
మాఁ నే ఆంఖేఁ ఖోల్ దీఁ, ఘర్ మే ఉజాలా హో గయా!’
(ఓ అంధకారమా! నీ ముఖమంతా నల్లబారింది.
అమ్మ కళ్ళు తెరవగానే ఇల్లంతా వెలుగులు పూసాయి!)
అమ్మ ఆశీర్వాదం ఎంత బలమైనదో కవి చెబుతాడిలా:
‘అభీ జిందా హై మాఁ మేరీ, ముఝే కుఛ్ భీ నహీఁ హోగా
మై ఘర్ సే జబ్ నికల్తా హూఁ, దువా భీ సాథ్ చల్తీ హై!’
(అమ్మ ఉన్నంతకాలం నాకే ప్రమాదం రాదు.
బయటకెళ్తే ఆమె ఆశీస్సులు నావెంట ఉంటాయు!)
‘ఏ ఐసా కర్జ్ హై జో మై అదా కర్ హీ నహీఁ సక్తా
మై జబ్ తక్ ఘర్ న లౌటూఁ మేరీ మాఁ సజ్దే మే రహ్తీ హై!’
(తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను
నేను ఇంటికొచ్చేదాకా ఆమె ప్రార్థిస్తూనే ఉంటుంది!)
రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ళ అనుబంధం గురించి షాయర్ చెప్పిన కవిత:
‘కిసీ కే జఖ్మ్ పర్ చాహత్ సే పట్టీ కౌన్ బాంధేగా?
అగర్ బహెనేం నహీఁ హోంగీ తో రాఖీ కౌన్ బాంధేగా?’
(ఎవరికైనా గాయమైతే ప్రేమతో కట్టెవరు కడతారు?
అక్కాచెల్లెళ్ళే లేకుంటే రాఖీలెవరు కడతారు?)
మునవ్వర్కు పేరు తెచ్చిన మరో గజల్ కావ్యం ‘మొహాజిర్నామ’.
విభజన సందర్భంగా భారత్ నుంచి పాకిస్తాన్ వలసవెళ్ళిన ముస్లిం శరణార్థులు (మొహాజిర్లు) రెండో తరగతి పౌరులుగా అక్కడ ఎదుర్కొంటున్న అవమానాలూ, వ్యథలూ, కడగండ్లపై ఈ పుస్తకం రాశారు.
‘మొహాజిర్ హైఁ మగర్ హమ్ ఏక్ దునియా ఛోడ్ ఆయే హైఁ
తుమ్హారే పాస్ జిత్నా హై, హమ్ ఉత్నా ఛోడ్ ఆయే హైఁ’
(మేము శరణార్థులం. కానీ, అన్నీ వదిలి వచ్చాం.
మీ వద్ద ఎంత ఉందో అంత వదిలేసి వచ్చాం!)
‘హమేషా జాగ్తే రహ్నా హీ అబ్ అప్నా ముకద్దర్ హై!
హమ్ అప్నే ఘర్ మే సబ్ లోగోంకో సోతా ఛోడ్ ఆయే హైఁ’
(మా బతుకంతా నిద్రలేని రాత్రులే!
ఇంట్లో నిద్రిస్తున్న వారందర్నీ వదిలేసి వచ్చాం)
‘వో జిన్సే రిష్తెదారీతో నహీఁ థీ, హాఁ తాల్లుక్ థా.
వో లక్ష్మీ ఛోడ్ ఆయే హైఁ, వో దుర్గా ఛోడ్ ఆయే హైఁ’
(వారితో బంధుత్వం లేకపోయినా అనుబంధం ఉంది.
లక్ష్మీదేవి, దుర్గామాతలను వదిలేసి వచ్చాం.)
దేశంలో మతకలహాలు జరిగినపుడల్లా ఆయన గొంతు వినిపించారు:
‘కయీ ఘరోంకో నిగల్నే కే బాద్ ఆతీ హై
మదద్ భీ షహర్ కే జల్నే కే బాద్ ఆతీ హై’
(అనేక ఇళ్ళు కాలిపోయాకే సర్కారు కదులుతుంది.
నగరం ఆహుతి అయ్యాకే సాయం అందుతుంది!)
‘బహుత్ సీ కుర్సియాఁ ఇస్ ముల్క్ మే లాషోం పే రఖీ హైఁ
ఏ వహ్ సచ్ హై జిసే ఝూటే సే ఝూటా బోల్ సక్తా హై!’
(ఈ దేశంలో చాలా కుర్చీలు శవాల గుట్టలపై కూచున్నాయ్.
అబద్ధాలకోరులు కూడా ఈ నిజాన్ని ఒప్పుకుంటారు!)
‘సమాజీ బేబసీ హర్ షహర్ కో మక్తల్ బనాతీ హై!
కభీ నక్సల్ బనాతీ హై, కభీ చంబల్ బనాతీ హై!’
(సామాజిక అనివార్యత ప్రతి నగరంలో రక్తపాతం సృష్టిస్తుంది.
ఒక్కోసారి నక్సల్స్, మరోసారి బందిపోట్లు పుట్టుకొస్తారు!)
మునవ్వర్ రాణా రాసిన ‘షహ్దాబ’ పుస్తకానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే బీఫ్ వివాదంపై దాద్రీ పట్నంలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపడంపై తీవ్రంగా స్పందించిన ఆయన నిరసనగా ఆ అవార్డును వాపస్ ఇచ్చారు. మోదీ సర్కారు అసహన వైఖరిపై చేసిన విమర్శలకు కొంతమంది తనను, తన తల్లిని ఫేస్బుక్లో దుర్భాషలాడడం రాణాను కలచివేసింది. ఆ తర్వాత నుంచి ఆయన కలానికి పనిచెప్పడం మానేసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి కష్టాలు కొనితెచ్చుకున్నారు.
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను ప్రస్తుతిస్తూ రాణా రాసిన రెండు గజళ్ళు వివాదాస్పదమయ్యాయి. అయోధ్యపై తీర్పు ఇచ్చిన సీజేఐ రంజన్ గొగోయ్‌ను వేశ్యతో పోల్చడం, ఫ్రాన్స్‌లో దైవదూషణ కేసులో శమ్యుయల్ పటీ హత్యను సమర్థించడం, తాలిబాన్ ఉగ్ర వాదులను వాల్మీకితో పోల్చడం, తాలిబాన్ కన్నా భారత్‌లో పాలకులు పరమ క్రూరులని విమర్శించడం..ఇలాంటి వ్యాఖ్యలతో మునవ్వర్ వివాదాల్లోకి కూరుకు పోయారు. ఆయనపై కేసులు దాఖలయ్యాయి. మరోవేపు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న ఆయన కుమార్తె సుమైయపై యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం కేసు పెట్టింది. ఆయన ఇంట్లో అర్ధరాత్రి యూపీ పోలీసులు సోదాలు జరిపారు. కుటుంబ ఆస్తిని కాజేసే ప్రయత్నంలో సొంత కొడుకు తబ్రేజ్ రాణా ఆడిన హత్య డ్రామా బయటపడి అతను క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం ఆయన్ను కుంగదీసింది. షాయర్గా మునవ్వర్ ప్రతిష్ట మసకబారడమే కాకుండా టీవీ చానళ్ళ చేతిలో వినోద వస్తువుగా మారిపోయారు.
యోగి సర్కారు తన కుటుంబంపై కక్షగట్టి వేధిస్తోందని ఆయన వాపోయారు. ప్రజలు క్షోభపడితే ప్రభుత్వాలకు ప్రమాదమేనని ఇలా హెచ్చరించారు:
‘ఏక్ ఆన్సూ భీ హుకూమత్ కే లియే ఖత్ర హై!
తుమ్ నే దేఖా నహీఁ ఆంఖోం కా సమందర్ హోనా’
(ఒక్క కన్నీటి బొట్టు కార్చినా సర్కారు నిలవదు.
కనుకొలకుల్లో సముద్రాన్ని నువ్వు చూడలేదు!)
కేన్సర్, కిడ్నీ వ్యాధి, మోకాళ్ళ నొప్పులతో మంచంపట్టిన మునవ్వర్కు ఏకంగా తొమ్మిదిసార్లు మోకాళ్ళ ఆపరేషన్లు జరిగాయి. నడవలేని తన దుస్థితికి అద్దంపడుతూ ఆయన హృదయవిదారకమైన షేర్ ఎంత సులభంగా చెప్పారో చూడండి.
‘మంజిల్ కరీబ్ ఆతే హీ ఏక్ పాఁవ్ కట్ గయా!
చౌడీ హుయీ సడక్ తో మేరా గాఁవ్ కట్ గయా!!’
(జీవిత చరమాంకంలో నా కాలు పోయింది.
రహదారి విస్తరణలో నా ఊరు పోయింది!)
మనుషులు జీవితాంతం ఘర్షణ పడతారు. మరణించాక ఏ తేడాలూ ఉండవని రాణా తాత్విక ధోరణిలో ఈ షేర్ చెప్పారు.
‘థకన్ కో ఓఢ్ కే బిస్తర్ మే జాకే లేట్ గయే
హమ్ అప్నీ కబ్రే ముకర్రర్ మే జాకే లేట్ గయే
తమామ్ ఉరమ్ హమ్ ఏక్ దూస్రే సే లడ్తే రహే
మగర్ మరే తో బరాబర్ మే జాకే లేట్ గయే’
(అలసటను మోసుకుంటూ నడుంవాల్చా.
నా గోరీలోకి వెళ్ళి విశ్రమించాను.
కొట్లాటలతో జీవితమంతా కరిగింది.
పోయాక అంతా పక్కపక్కనే నడుంవ ాల్చాలి.)
మెహక్ హైదరాబాదీ
70361 75175