ఉరుకులు..పరుగులు

ABN , First Publish Date - 2022-08-08T05:36:57+05:30 IST

సంగారెడ్డి మెదక్‌ జిల్లాల్లో ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

ఉరుకులు..పరుగులు
సంగారెడ్డిలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎస్పీ రమణ కుమార్‌

నిమిషం నిబంధన అమలుతో వడివడిగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు

ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి నిరాకరణ

ప్రశాంతంగా ఎస్‌ఐ రాత పరీక్ష

ఎగ్జామ్‌ సెంటర్లను తనిఖీ చేసిన అధికారులు

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఇద్దరిపై కేసు

 సంగారెడ్డి మెదక్‌ జిల్లాల్లో ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో  అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 7: సంగారెడ్డి జిల్లాలో పరీక్షా కేంద్రాలైన గీతం ఇంజనీరింగ్‌ కాలేజీ, సుల్తాన్‌పూర్‌లోని జెఎన్‌టీయూ ఇంజనీరింగ్‌కాలేజీలో రెండు కేంద్రాలు, అమీన్‌పూర్‌ పటేల్‌గూడలోని ఎల్లంకి ఇంజనీరింగ్‌ కాలేజీ, ఫసల్‌వాదీలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డిలోని సేయింట్‌ అంథోనీస్‌ జూనియర్‌ కాలేజ్‌, సేయింట్‌ హైస్కూల్‌, తారాడిగ్రీ కాలేజ్‌, ఎల్లంకి డిగ్రీ కాలేజీలో పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అభ్యర్థులను సెంటర్‌లోకి అనుమతించారు. మరీ ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రం అనుమతించలేదు. ఈ పరీక్షలకు మొత్తం 5,766 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 5,298 మంది పరీక్ష రాశారు. అక్కడక్కడా బయోమెట్రిక్‌ సమస్య తలెత్తినప్పటికీ పోలీసుసిబ్బంది వెంటనే ఫింగర్‌ ప్రింట్‌ విధానం ద్వారా సమస్య పరిష్కరించారు. పరీక్షా కేంద్రాలను ఎస్పీ ఎం.రమణకుమార్‌ సందర్శించారు. ఆయన వెంట నోడల్‌ అధికారి జహీరాబాద్‌ డీఎస్పీ రఘు ఉన్నారు. 

 పుల్‌కల్‌, ఆగస్టు7: చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద గల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో మొత్తం 1,388 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ఓ కేంద్రంలో 696 మందికి 636 మంది హాజరయ్యారు. మరో కేంద్రంలో 692 మంది అభ్యర్థులుకు 634 మంది హాజరయ్యారు.  జహీరాబాద్‌ డీఎస్పీ రఘు, జోగిపేట సీఐ నాగరాజు, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.నర్సింహా పర్యవేక్షించారు. సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ పరీక్షా కేంద్రంలో మాల్‌ ప్రాక్టీ్‌సకు పాల్పడిన ఇద్దరు అభ్యర్థులపై కేసులు నమోదు చేశారు. 

మెదక్‌ జిల్లాలో..

మెదక్‌అర్బన్‌, ఆగస్టు7: మెదక్‌ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మెదక్‌, రామాయంపేట, నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన 5 కేంద్రాల్లో మొత్తం 2,342 మంది అభ్యర్థులకు 2,191 మంది హాజరరయ్యారు. 

బయోమెట్రిక్‌ హాజరుతో అనుమతి

బయోమెట్రిక్‌ సేకరణ  (వేలిముద్రలు) ద్వారా అభ్యర్థులను సెంటర్‌లోకి అనుమతించారు. ప్రత్యేకంగా (ఫింగర్‌ ఫ్రింట్స్‌) బృందాన్ని నియమించి బయోమెట్రిక్‌ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయోమెట్రిక్‌ హాజరుతో అనుమతించి 10 గంటలకు పరీక్షను ప్రారంభించారు. ఏఎస్పీ డాక్టర్‌ బాలస్వామి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ సైదులు, సీఐ మధు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 

ఆలస్యంగా.. ఐదుగురు అభ్యర్థులు

సరిగ్గా 10 గంటలకే పోలీసులు సెంటర్ల వద్ద గేట్లు మూసేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రానికి మెదక్‌ జిల్లా నార్సింగి, వెల్దుర్తి, మందాపూర్‌, హైదరాబాద్‌ నుంచి నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకోగా పోలీసులు అనుమంతించలేదు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ పరీక్ష కేంద్రానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. అధికారులులోనికి అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మెదక్‌ జిల్లాలో నిమిషం నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 నిషేదాజ్ఞ లు అమలు చేశారు. సెంటర్‌ సమీపంలోని జీరాక్స్‌ సెంటర్‌లను మూసివేయించారు.

రామాయంపేట, నర్సాపూర్‌లో..

 రామాయంపేట/ నర్సాపూర్‌ : రామాయంపేటలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను ఎస్‌రాజేశ్‌, ఇతర అధికారులు సందర్శించారు. మొత్తం 348 మందికి 325 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ కాలేజీలో నిర్వహించిన పరీక్షకు 1380 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 1287 మంది హాజరయ్యారు. సీఐ శేఖ్‌లాల్‌మదార్‌, ఎస్‌ఐ గంగరాజు ఆధ్వర్యంలో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపారు. ఒక వ్యక్తి పదినిమిషాలు ఆలస్యంగా రాగా అతడిని లోనికి అనుమతించలేదు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి సెంటర్‌ను సందర్శించి  ఏర్పాట్లను  పరిశీలించారు. 



Updated Date - 2022-08-08T05:36:57+05:30 IST