భారత్ నుంచి వచ్చేయాలంటూ.. దేశ పౌరులకు యూఎస్ ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-29T17:21:50+05:30 IST

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇండియాను వీడాల్సిందిగా అమెరికా తమ దేశ పౌరులను ఆదేశించింది.

భారత్ నుంచి వచ్చేయాలంటూ.. దేశ పౌరులకు యూఎస్ ఆదేశాలు

వీలైనంత త్వరగా భారత్‌ను వీడండి

దేశ పౌరులకు అమెరికా ఆదేశాలు

వాషింగ్టన్: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇండియాను వీడాల్సిందిగా అమెరికా తమ దేశ పౌరులను ఆదేశించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కరోనా కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులువు కాదు అని పేర్కొంది. కనుక భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు లెవల్ 4 హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేనిపక్షంలో వయా పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది. అలాగే అమెరికా నుంచి భారత్‌కు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది.     



Updated Date - 2021-04-29T17:21:50+05:30 IST