అమెరికా ప్రతినిధుల సభలో భారత్ వ్యతిరేక తీర్మానం..! ఇండియాను వరుసగా మూడేళ్ల పాటు..

ABN , First Publish Date - 2022-06-23T23:02:22+05:30 IST

భారత్‌పై నిత్యం వ్యతిరేకత వెళ్లగక్కే అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఓమార్ మరోసారి వివాదాస్పద చర్యకు పూనుకున్నారు.

అమెరికా ప్రతినిధుల సభలో భారత్ వ్యతిరేక తీర్మానం..! ఇండియాను వరుసగా మూడేళ్ల పాటు..

ఎన్నారై డెస్క్: భారత్‌పై నిత్యం వ్యతిరేకత వెళ్లగక్కే అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఓమార్ మరోసారి వివాదాస్పద చర్యకు పూనుకున్నారు. భారత్‌లో మతస్వేచ్ఛాహక్కు ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ అమెరికా ప్రతినిధుల సభలో తాజాగా ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌ను ఆందోళనకారక దేశంగా ప్రకటించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రిని కోరారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఓమార్.. రషీదా తాలిబ్, యువాన్ వర్గాస్‌లతో కలిసి ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. భారత్‌ను వరుసగా మూడేళ్లపాటు కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్‌గా(ఆందోళనకారక దేశం) ప్రకటించాలంటూ మతస్వేఛ్ఛపై ఏర్పాటైన యూఎస్ కమిషన్(US commission on International religious freedom) గతంలో చేసిన సూచనను అమలు పరచాలని కూడా ఓమార్ పేర్కొన్నారు. కాగా.. ఈ తీర్మానాన్ని ప్రతినిధుల సభలోని విదేశీ వ్యవహారాల కమిటీ పరిశీలించనుంది. 


అయితే.. ఇల్హాన్ ఓమార్ గతంలోనూ పలుమార్లు భారత్ పట్ల తనకున్న వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శించారు. అమెరికా చట్టసభ సభ్యురాలై ఉండి కూడా ఆమె గత ఏప్రిల్‌లో భారత భూభాగమైన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించారు. ఆమె పర్యటనకు నిధులు ఎవరు సమకూర్చారన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా.. ఆ పర్యటనలో ఓమార్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ సమావేశమయ్యారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఓమార్ తీరును అప్పట్లో తీవ్రంగా ఖండించింది. ఇది భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనంటూ మండిపడింది. ‘‘ఇటువంటి నేతలు తమ సంకుచిత రాజకీయాలను తమ స్వదేశాల్లో ప్రదర్శిస్తే అది వారి సొంత వ్యవహారం అవుతుంది. కానీ.. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సబబు కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం’’ అంటూ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 



Updated Date - 2022-06-23T23:02:22+05:30 IST