చివరి నిమిషంలో రద్దైన విమానం.. పెళ్లి కోసం వెళ్తున్న ఆ జంట ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-05-02T20:50:56+05:30 IST

వారిద్దరూ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

చివరి నిమిషంలో రద్దైన విమానం.. పెళ్లి కోసం వెళ్తున్న ఆ జంట ఏం చేసిందంటే..

వారిద్దరూ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఓ ప్రార్థన మందిరంలో వివాహం చేసుకోవాలనుకుని, దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడకు వెళ్లేందుకు ఫ్లైట్‌ టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు.. అయితే చివరి నిమిషయంలో ఆ విమానం రద్దైంది.. దీంతో అనుకున్న సమయానికి తమ పెళ్లి జరగదని ఆ జంట ఆందోళనకు గురైంది.. చివరకు, అనూహ్యంగా విమానంలోనే పెళ్లి చేసుకుని ఒక్కటైంది. 


అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన జెరెమీ సల్దా, పామ్ ప్యాటర్సన్ 2020 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఈ నెల 24న లాస్ వేగాస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వేగాస్‌కు వెళ్లేందుకు ఫ్లైట్‌ టిక్కెట్లు, ప్రార్థనా మందిరాన్ని కూడా బుక్ చేసుకున్నారు. సమయానికి  విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారు ఎక్కాల్సిన విమానం కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయింది. దాంతో వేగాస్‌కు సమయానికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఇక, తమ పెళ్లి జరగదని నిర్ణయానికి వచ్చేశారు. 


అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న మినిస్టర్ క్రిస్ వారి బాధను అర్థం చేసుకుని, వారు వేగాస్‌కు చేరుకునేందుకు మరో మార్గం చూపించారు. ముగ్గురూ కలిసి సౌత్‌వెస్ట్ ఫ్లైట్ ద్వారా వేగాస్‌కు వెళ్లేందుకు మూడు సీట్లను బుక్ చేసుకున్నారు. డల్లాస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయానికి చేరుకుని విమానం ఎక్కారు. అయితే పెళ్లి దుస్తుల్లో ఉన్న జంటను చూసిన పైలట్.. `విమానంలోనే పెళ్లి చేసుకోవచ్చు` కదా అని జోక్ చేశాడు. వధూవురులిద్దరికీ ఆ ఐడియా నచ్చడంతో వెంటనే పెళ్లికి సిద్ధమయ్యారు. దాంతో విమాన సిబ్బంది టాయిలెట్‌ పేపర్‌తో విమానంలో కొద్దిగా డెకరేషన్ చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ ఫోటో‌గ్రాఫర్ ఆ జంట పెళ్లి ఫోటోలను తీయడానికి ముందుకొచ్చాడు. తోటి ప్రయాణీకులే అతిథులయ్యారు. విమానంలో ప్రయాణికులకు ఇచ్చే అల్పాహారం వివాహ భోజనం అయింది. అలా వారి పెళ్లి గాలిలో ప్రయాణిస్తోన్న విమానంలో జరిగిపోయింది. ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

Updated Date - 2022-05-02T20:50:56+05:30 IST