ఫ్లాయిడ్‌ హత్య కేసులో డెరెక్‌ దోషి

ABN , First Publish Date - 2021-04-22T07:02:05+05:30 IST

అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో మాజీ పోలీస్‌ అధికారి డెరెక్‌ చావిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఫ్లాయిడ్‌ (46) మృతికి చావినే కారణమని మిన్నియాపొలి్‌సలోని...

ఫ్లాయిడ్‌ హత్య కేసులో డెరెక్‌ దోషి

  • నిర్ధారించిన అమెరికా కోర్టు.. న్యాయం జరిగిందన్న  బైడెన్‌


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 21: అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో మాజీ పోలీస్‌ అధికారి డెరెక్‌ చావిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఫ్లాయిడ్‌ (46) మృతికి చావినే కారణమని మిన్నియాపొలి్‌సలోని 12 మంది సభ్యుల ఫెడరల్‌ జ్యూరీ నిర్ధారించి తీర్పు వెలువరించింది. ఈ సమయంలో డెరెక్‌.. ముభావంగా ఉండిపోయారు.  విచారణ సందర్భంగా కోర్టు  ముందు జనం కిక్కిరిసిపోయారు. దీంతో.. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తీర్పు వెలువడే వరకు అక్కడ ఉద్విగ్న వాతావరణం కనిపించింది. తీర్పు వెలువడ్డ వెంటనే అక్కడున్న ప్రజలంతా హర్ష ధ్వానాలు చేశారు. ఫ్లాయిడ్‌ హత్య జరిగిన సమయంలో డెరెక్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదవగా.. వారిపై ఆగస్టు నుంచి విచారణ జరుగుతోంది. 


‘మీ నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు’

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడను పోలీసు అధికారి డెరిక్‌ చావిస్‌ తన మోకాలుతో నొక్కి పెట్టి, ఊపరాడకుండా చేసి చంపిన ఘటనతో అప్పట్లో ప్రపంచమే కరిగి కన్నీరైంది! ఫ్లాయిడ్‌ ఏడేళ్ల కూతురు జియానాతో తాను ఇదే విషయాన్ని పంచుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ‘‘మీ నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు. శాంతియుతమైన, న్యాయపరమైన వారసత్వాన్ని మనకు అందించాడు’’ అని చిన్నారి జియానాతో చెప్పినట్లు బైడన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఫ్లాయిడ్‌ అంత్యక్రియల సమయంలోనే జియాన్‌తో తాను మాట్లాడానని ఆయన  వెల్లడించారు. ‘‘మోకాలి మీద నిల్చుని జియాన్‌ చేతిని నా చేతుల్లోకి తీసుకున్నా. మీ నాన్న నీవైపు గర్వంగా చూస్తున్నాడు అని ఆమెతో చెప్పాను. అప్పుడు... మా నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు అని తను నాతో చెప్పింది’’ అని నాటి సందర్భాన్ని బైడన్‌ గుర్తు చేసుకున్నారు. జార్జ్‌ హత్య అమెరికా హృదయంపై ఓ మరక. చట్టానికి ఎవరూ అతీతులు కారు. కోర్టు వెలువరించిన తీర్పు ఇదే చెబుతోంది’’ అని బైడన్‌ వ్యాఖ్యానించారు.


16 ఏళ్ల నల్లజాతీయురాలి కాల్చివేత

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించిన కొన్ని గంటల్లోనే అమెరికా పోలీసులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ 16 ఏళ్ల నల్లజాతీయురాలిపై కాల్పులు జరిపారు. ఆమె చేతిలో కత్తి పట్టుకుని నిల్చుందని, అందుకే కాల్చేశామని ఆ తర్వాత వెల్లడించారు. కొలంబ్‌సలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలిని మఖియా బ్రియాంట్‌గా గుర్తించారు. కొందరు గుమిగూడి ఉన్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ కత్తి లాంటి ఒక వస్తువుతో నిలబడి ఉన్న అమ్మాయిపై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి,.


Updated Date - 2021-04-22T07:02:05+05:30 IST