అమెరికాలో కరోనా కరాళన‌ృత్యం.. 6కోట్ల మార్క్‌ను దాటిన కేసులు!

ABN , First Publish Date - 2022-01-10T18:48:45+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ కరాళనృత్యం చేస్తోంది. గత కొన్నిరోజులుగా అక్కడ డైలీ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

అమెరికాలో కరోనా కరాళన‌ృత్యం.. 6కోట్ల మార్క్‌ను దాటిన కేసులు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ కరాళనృత్యం చేస్తోంది. గత కొన్నిరోజులుగా అక్కడ డైలీ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా, 2020 జనవరి నుంచి ఇప్పటివరకు యూఎస్‌లో 6కోట్లకు పైగా మంది కోవిడ్-19 బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఆదివారం వెల్లడించింది. ఇందులో 8,37,594 మంది మహమ్మారికి బలైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20శాతం అమరికాలోనే ఉన్నాయి. అలాగే మరణాల్లో 15 శాతం ఆ దేశంలోనే ఉండటం గమనార్హం. ఇక ఆదివారం ఒక్కరోజే  3లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 308 మంది మృతిచెందారు. ప్రస్తుతం యూఎస్‌లో 18.14 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 2020, నవంబర్​ 9 నాటికి అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య కోటి దాటింది. 2021, జనవరి 1కి 2కోట్లకు చేరింది. ఆ తర్వాత రెండు నెలల్లోనే అంటే మార్చి నాటికి ఈ సంఖ్య 3కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్​ 6 నాటికి 4కోట్లు, డిసెంబర్​ 13 నాటికి 5కోట్లకు చేరింది. జనవరి 9 నాటికి అది 6కోట్లు దాటింది. ఇక 2021, డిసెంబర్​ 1న అగ్రరాజ్యంలో తొలి ఒమైక్రాన్​ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలో ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావంతో అమెరికాలో రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.  

Updated Date - 2022-01-10T18:48:45+05:30 IST