Diamond Exports: భారత ల్యాబ్‌ మేడ్ వజ్రాలకు పెరుగుతున్న గిరాకీ.. ఎగుమతులు పెంచాలంటున్న అమెరికా

ABN , First Publish Date - 2022-08-23T01:38:31+05:30 IST

భారత్‌లో తయారైన వజ్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న వజ్రాలలో

Diamond Exports: భారత ల్యాబ్‌ మేడ్ వజ్రాలకు పెరుగుతున్న గిరాకీ.. ఎగుమతులు పెంచాలంటున్న అమెరికా

న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన వజ్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్న వజ్రాలలో 90 శాతం భారత్‌లో సానబట్టినవో, లేదంటే పాలిష్ అయినవో అయి ఉంటాయి. భారత్‌లో తయారయ్యే ల్యాబ్ మేడ్ రత్నాల(Lab-Made Diamond)కు డిమాండ్ అధికంగా ఉండడంతో ఎగుమతులు పెంచాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఏప్రిల్ 1తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాలిష్ చేసిన ల్యాబ్ మేడ్ వజ్రాల ఎగమతులు గత ఆర్థిక సంవత్సరం (1.3 బిలియన్ డాలర్ల)తో పోలిస్తే రెట్టింపు కావొచ్చని  జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (JGEPC) వైస్ చైర్మన్ విపుల్ షా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా నుంచి డిమాండ్ పెరుగుతుండడం, యూకే, ఆస్ట్రేలియా నుంచి డిమాండ్ పెరిగే సూచనలు ఉండడంతో రాబోయే కొన్ని సంవత్సరాలలో వజ్రాల ఎగుమతులు 7 నుంచి 8 బిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డైమండ్ అనేది ఫ్యాషనబుల్ జువెలరీ కావడం, యువతకు అందుబాటులో ఉండడంతో దానిపై మనసు పారేసుకుంటున్నారని, అందుకు అనుగుణంగానే మార్కెట్ కూడా వృద్ధి చెందుతోందని షా వివరించారు.


గతేడాది సహజంగా వెలికి తీసిన డైమండ్లను పాలిష్ చేసిన భారత్ దాదాపు 24 బిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను ఎగుమతి చేసింది. మైనింగ్‌లో వెలికి తీసిన సహజసిద్ధ డైమండ్లకు ఏమాత్రం తీసినపోని విధంగా అవే భౌతిక లక్షణాలతో మ్యాన్‌మేడ్ డైమండ్స్ చాలా చవగ్గా లభిస్తున్నాయి. దీంతో ఏవి అసలువో, ఏవి ల్యాబుల్లో తయారైనవో తెలుసుకునేందుకు నిపుణులు యంత్రాలపై ఆధారపడుతున్నారు.

 

 ల్యాబ్‌మేడ్ డైమండ్స్ ఎలా తయారవుతాయంటే?

కార్బన్ సీడ్‌ను మైక్రోవేవ్ చాంబర్‌లో ఉంచి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా ప్రకాశించే ప్లాస్మాబాల్‌లా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కొన్ని వారాల్లోనే ఆ ప్లాస్మాబాల్‌లో స్ఫటికాలు తయారై వజ్రంలా కనిపిస్తుంది. ఆ తర్వాత వాటికి సానబెట్టి పాలిష్ చేస్తారు. ప్రయోగశాలల్లో తయారైన వజ్రాల ఎగుమతులు ఏప్రిల్-జులై మధ్య 70 శాతం పెరిగి 622.7 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో మైనింగ్ నుంచి తీసి సానబట్టి పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు మూడు శాతంతో 8.2 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు జీజేఈపీసీ గణాంకాలు చెబుతున్నాయి.

 

మానవ తయారీ రత్నాల వల్ల ఒక ఉపయోగం కూడా ఉంది. వీటికి ట్రాకింగ్ సిస్టం ఉంటుంది. కాబట్టి సప్లై చెయిన్‌ను పర్యవేక్షించొచ్చు. అలాగే, రత్నాల వినియోగదారుల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. 2000వ దశకం మధ్యలో చాలా కంపెనీలు వజ్రాల తయారీ ల్యాబులను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశంలో ఇలాంటివి 25 వరకు ఉన్నాయి. ప్రపంచంలోని ఉత్పత్తి అవుతున్న వజ్రాలలో 15 శాతం వాటా ల్యాబ్ వజ్రాలదేనని జేజీఈపీసీ పేర్కొంది. 

Updated Date - 2022-08-23T01:38:31+05:30 IST