Stock markets లో మరో భారీ కుదుపు.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ABN , First Publish Date - 2022-06-16T21:55:01+05:30 IST

వడ్డీ రేటును భారీగా 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం,

Stock markets లో మరో భారీ కుదుపు.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ముంబై : వడ్డీ రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal reserve) తీసుకున్న నిర్ణయం, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, మాంద్యం తప్పదన్న ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Eqity markets) గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ప్రామాణిక బీఎస్‌ఈ(BSE) సూచీ 1045.60 పాయింట్లు లేదా 1.99 శాతం మేర దిగజారి 51,495.79 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్‌ఈ నిఫ్టీ(NSW NIFTY) 331.55 పాయింట్లు లేదా 2.11 శాతం మేర నష్టపోయి 15,360.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈపై కేవలం 607 షేర్లు మాత్రమే లాభపడగా.. 2680 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 97 కంపెనీల షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమైనా గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 5వ సెషన్‌లో నష్టాలతో ఇరు సూచీలూ 52 వారాల కనిష్ఠ స్థాయికి దిగజారాయి. తాజా క్షీణతతో కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ దాదాపు 4000 పాయింట్ల మేర నష్టపోయినట్టయింది.

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ఈ భారీ కుదుపుతో గురువారం ఒక్కరోజే రూ.5.05 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.244.65 లక్షల కోట్ల నుంచి రూ.239.20 లక్షల కోట్లకు పడిపోయింది. తీవ్ర నష్టాలను మిగిల్చిన గురువారం సెషన్‌లో మెటల్ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ కంపెనీల షేర్లు నిఫ్టీపై టాప్ నష్టదార్లుగా ఉన్నాయి. లాభపడిన కంపెనీల్లో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్‌ సూచీలు కూడా 2 శాతానికిపైగానే పతనమయ్యాయి. 


మార్కెట్ పతనానికి కారణాలు...

1. యూఎస్ ఫెడ్ సెగ : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 1994 తర్వాత తొలిసారి వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మున్ముందు మరింత పెంపు తప్పదనే సంకేతాలను కూడా ఇచ్చింది. అంతేకాకుండా 2022, 2023 సంవత్సరాల్లో అమెరికా వృద్ధి రేటు అంచనాలను కుదించింది. దీంతో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం తప్పుదనే భయాలు నెలకొన్నాయి. ఈ ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.


2. ఎఫ్‌పీఐల విక్రయాలు : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు ఏకంగా రూ.24,949 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రభావం మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.

3. గ్లోబల్ మార్కెట్ల భయాలు : నష్టాల పథంలో ఉన్న గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో ఇతర ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీరేట్లు పెంచుతాయనే భయాలు ఇందుకు కారణమవుతున్నాయి.

4. ఆర్థిక మాంద్యం గుబులు : భారీ స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచింది. అయితే ఈ ప్రభావంతో అమెరికా ఆర్థిక మాంద్యాన్ని చవిచూడడం ఖాయమనే విశ్లేషణలతో మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.

5. టెక్నికల్‌గా బలహీనత : మార్కెట్లు టెక్నికల్‌గా కూడా బలహీనంగానే కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-16T21:55:01+05:30 IST