ప్ర‌యాణికుడి హ‌ల్‌చ‌ల్‌.. విమానం దారి మ‌ళ్లింపు!

ABN , First Publish Date - 2021-06-13T16:57:21+05:30 IST

లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న విమానంలో ఓ ప్ర‌యాణికుడు సిబ్బంది ప‌ట్ల దూరుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు విమానాన్ని కూల్చేస్తాన‌ని హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో చేసేదేమిలేక ఫ్లైట్‌ను ఓక్లహోమా సిటీకి దారి మ‌ళ్లించారు.

ప్ర‌యాణికుడి హ‌ల్‌చ‌ల్‌.. విమానం దారి మ‌ళ్లింపు!

వాషింగ్ట‌న్‌: లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న విమానంలో ఓ ప్ర‌యాణికుడు సిబ్బంది ప‌ట్ల దూరుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు విమానాన్ని కూల్చేస్తాన‌ని హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో చేసేదేమిలేక ఫ్లైట్‌ను ఓక్లహోమా సిటీకి దారి మ‌ళ్లించారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం డెల్టా ఎయిర్‌లైన్ విమానం 1730లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే స‌దురు ప్ర‌యాణికుడు అన‌వ‌స‌రంగా తోటి ప్ర‌యాణికుల‌తో వాగ్వాదానికి దిగిన‌ట్లు విమాన‌ సిబ్బంది తెలియ‌జేశారు. విమానాన్ని కూల్చేస్తాన‌ని ప్ర‌యాణికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డం గ‌మ‌నించిన‌ విమాన సిబ్బంది అతడ్ని స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో మ‌రింత రెచ్చిపోయిన‌ ప్ర‌యాణికుడు ఇద్ద‌రు విమాన సిబ్బందిపై చేయి చేసుకున్నాడు.


దాంతో స‌ద‌రు ప్ర‌యాణికుడిని అత‌డు కూర్చున్న సీటుకే క‌ట్టేశారు. అనంత‌రం విమానాన్ని దారి మ‌ళ్లించి ఓక్లహోమా సిటీ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు. ఆ త‌ర్వాత న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆ ప్ర‌యాణికుడిని ఎయిర్‌పోర్ట్ పోలీసుల‌కు అప్ప‌గించింది విమాన సిబ్బంది. కాగా, పోలీసుల విచార‌ణ‌లో స‌ద‌రు ప్ర‌యాణికుడు డెల్టా ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగి అని తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్‌బీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇక ఇటీవ‌ల ఇదే కోవ‌లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాలిఫోర్నియా నుంచి టెన్నెసీ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737-900 విమానంలో ఓ ప్ర‌యాణికుడు ఏకంగా కాక్‌పిట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించి హ‌ల్‌చ‌ల్ చేశాడు. దాంతో విమానాన్ని న్యూ మెక్సికోకు దారి మ‌ళ్లించారు.     

Updated Date - 2021-06-13T16:57:21+05:30 IST