Trump 'ట్రూత్‌ సోషల్‌' యాప్‌ లాంచింగ్‌కు డేట్ ఫిక్స్..!

ABN , First Publish Date - 2022-01-08T17:02:25+05:30 IST

క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Trump 'ట్రూత్‌ సోషల్‌' యాప్‌ లాంచింగ్‌కు డేట్ ఫిక్స్..!

వాషింగ్టన్: క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఆ సయమంలో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే గతేడాది అక్టోబర్‌లో సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు. 'ట్రూత్​ సోషల్​' పేరుతో సోషల్ మీడియా యా‌ప్‌ను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. తాను తీసుకువస్తున్న ఈ సామాజిక మాధ్యమ వేదిక టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం ట్రంపునకు చెందిన టీఎమ్​టీజీ(ట్రంప్​ మీడియా అండ్​ టెక్నాలజీ గ్రూప్​), డిజిటల్​ వరల్డ్​ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఈ యాప్ లాంచింగ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 21న ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 


ఇక సామాజిక మాధ్యమాలన్నీ తనను బ్యాన్‌ చేసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో చోటులేని ట్రంప్‌.. ఇప్పుడు తానే కొత్తగా యాప్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ట్విటర్‌ను పోలి ఉండే ఈ 'ట్రూత్‌ సోషల్‌' యాప్‌లోనూ ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌కి సంబంధించిన నమూనా ఫొటోలను ఇప్పటికే టీఎమ్​టీజీ విడుదల చేసింది. సాధారణంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసేవాటిని ట్వీట్‌ అంటాం కదా. అదే ట్రూత్‌ సోషల్ మీడియా యాప్‌లో మాత్రం వాటిని 'ట్రూత్‌' అని అంటారు. ఇప్పటికే ఈ యాప్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. 


ఇదిలాఉంటే.. 2020 ఎన్నికల్లో ఓటమిని భరించలేని ట్రంప్.. జనవరి 6న తన అనుచరులతో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారు. ఈ హింసాకాండ అనంతరం ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై సామాజిక మాధ్యమాలు ​ఒక్కొక్కటి బ్యాన్ వేశాయి. మొదట ట్విటర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. హింసను ట్రంప్​ మరింత ప్రేరేపించే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది. అలాగే ఫేస్‌బుక్ సైతం ట్రంప్ ఖాతాపై నివరధిక వేటు వేసింది. అటు ఇన్‌స్టాగ్రాంతో పాటు ఇతర మరికొన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా ట్రంప్ ఖతాలపై నిషేధం విధించాయి. దీంతో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు 'ట్రూత్​ సోషల్​' పేరుతో సోషల్ మీడియా యా‌ప్‌ను తీసుకొస్తున్నారు.   


Updated Date - 2022-01-08T17:02:25+05:30 IST