భారత్‌పై ‘కాట్సా’ ఆంక్షలొద్దు.. యూఎస్ రిప్రజెంటేటివ్స్‌లో చరిత్రాత్మక చట్ట సవరణకు అడుగులు

ABN , First Publish Date - 2022-07-15T18:34:42+05:30 IST

భారత్‌తో మైత్రి బంధం బలోపేతం లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా కీలక అడుగువేసింది.

భారత్‌పై ‘కాట్సా’ ఆంక్షలొద్దు.. యూఎస్ రిప్రజెంటేటివ్స్‌లో చరిత్రాత్మక చట్ట సవరణకు అడుగులు

వాషింగ్టన్ : భారత్‌(India)తో మైత్రి బంధం బలోపేతం లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా(America) కీలక అడుగువేసింది. రష్యా(Russia) నుంచి ఎస్-400 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసిన భారత్‌కు కాట్సా చట్టం(CAATSA Act) ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని సూచించే చట్టసవరణకు యూఎస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదం దక్కింది. మూజువాణి ఓటుతో బిల్లు పాసైంది. సరిహద్దు దేశం చైనా(china) దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇండియన్- అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రో ఖన్నా సభలో ఈ ప్రతిపాదన చేశారు.


చరిత్రాత్మకంగా రిప్రజెంటేటివ్స్‌లో ఇరు పక్షాల సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(NDDA)పై సమీక్షలో గురువారం ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న చైనా లాంటి దేశాలకు అడ్డుకట్టవేయడంలో కాట్సా మినహాయింపు ద్వారా భారత్‌కు మద్దతుగా నిలవాలని చట్టసవరణ ద్వారా బైడెన్ ప్రభుత్వానికి ప్రతినిధులు సూచించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన కీలకం అంశం ఏంటంటే.. చట్టసవరణకు ఆమోదం లభించడమంటే భారత్‌పై ఆంక్షలు ఎత్తివేసినట్టు కాదు. ఆంక్షలు ఎత్తివేతను పరిశీలించాలని బైడెన్ ప్రభుత్వానికి సూచించినట్టు మాత్రమేనని నిపుణులు స్పష్టం చేశారు. 

 

యూఎస్- ఇండియా న్యూక్లియర్ డీల్ తర్వాత భారత్, అమెరికా బంధాల్లో అంతటి ప్రాధాన్యత కలిగిన అంశమేమీలేదని రిప్రజెంటేటివ్ రో ఖన్నా అన్నారు. ద్విపక్షాలు(రెండు పార్టీలు) ఎన్‌డీఏఏ బిల్లుకు ఆమోదం తెలపడం ఇరుదేశాల భాగస్వామ్యంలో ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కాట్సా అనేది అమెరికా రూపొందించిన కఠిన చట్టం. రష్యా, దాని అనుబంధ దేశాల నుంచి ప్రధాన డిఫెన్స్ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని తయారుచేశారు. రష్యా 2014లో క్రిమియా స్వాధీనం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం ఆరోపణల నేపథ్యంలో యూఎస్ ఈ కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. కాగా 5 బిలియన్ డాలర్లతో రష్యా నుంచి 5  ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు 2018లో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ సారధ్యంలోని నాటి అమెరికా ప్రభుత్వం హెచ్చరించినా భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాకు చెందిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఎంతో అధునాతనమైనది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-15T18:34:42+05:30 IST