Zawahiri killed: అత్యంత రహస్యంగా యూఎస్ ఆపరేషన్...బాల్కనీలో ఉండగా డ్రోన్‌తో దాడి

ABN , First Publish Date - 2022-08-02T13:22:11+05:30 IST

అల్ ఖైదా చీఫ్ జవహరీ(Zawahiri) హత్యకు ఆపరేషన్‌ను యూఎస్ అత్యంత రహస్యంగా చేసింది....

Zawahiri killed: అత్యంత రహస్యంగా యూఎస్ ఆపరేషన్...బాల్కనీలో ఉండగా డ్రోన్‌తో దాడి

కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్): అల్ ఖైదా చీఫ్ జవహరీ(Zawahiri) హత్యకు ఆపరేషన్‌ను యూఎస్ అత్యంత రహస్యంగా చేసింది. అల్ జవహరీ కదలికలపై యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగానికి(US intelligence) కీలక సమాచారం లభించింది. జవహరీ అఫ్ఘనిస్థాన్(Afghanistan) దేశంలోని కాబూల్ నగరంలో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ భవనంలో నివాసమున్నాడని యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందడంతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశంతో యూఎస్ దాడికి దిగింది. జవహరీ బాల్కనీలో ఉండగా యూఎస్ ఆర్మీ డ్రోన్ దాడితో అతన్ని హతమార్చింది. ఈ దాడిలో జవహరీ కుటుంబసభ్యులెవరూ గాయపడలేదని యూఎస్ ఆర్మీ తెలిపింది. కెన్యా, టాంజానియా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడిలో జవహరీ కీలకపాత్ర పోషించాడని జో బిడెన్ చెప్పారు. 


జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని(Zawahiri killed), అతని హత్యతో అల్ ఖైదా ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని బిడెన్ చెప్పారు. జవహరీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఇతను మరణించాడని పలు సంవత్సరాలుగా పుకార్లు వినిపించాయి.గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత జవహరీ కాబూల్ నగరంలో ఉన్నాడని సమాచారం. జవహరీ కాబూల్ లో పాగా వేశాడని తాలిబన్లకు ముందే తెలుసని యూఎస్ పేర్కొంది. డ్రోన్ దాడిని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్(Taliban spokesman Zabihullah Mujahid) ధ్రువీకరించారు. అంతర్జాతీయ విధానాలకు యూఎస్ డ్రోన్ దాడి ఉల్లంఘన అని జబిహుల్లా చెప్పారు.  


Updated Date - 2022-08-02T13:22:11+05:30 IST