ఎఫ్‌డీఏ ఆమోదం దిశగా 'మోడెర్నా'..!

ABN , First Publish Date - 2020-12-18T16:14:14+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్‌తో సతమతమవుతున్న అగ్రరాజ్యానికి ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం పెద్ద ఊరటగా మారిన సంగతి తెలిసిందే.

ఎఫ్‌డీఏ ఆమోదం దిశగా 'మోడెర్నా'..!

అత్యవసర వినియోగానికి యూఎస్ నిపుణుల ప్యానెల్ సిఫార్సు !

వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్‌తో  సతమతమవుతున్న అగ్రరాజ్యానికి ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం పెద్ద ఊరటగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మోడెర్నా టీకా కూడా త్వరలోనే అమెరిక్లనకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ఆమోదానికి యూఎస్ నిపుణుల ప్యానెల్ గురువారం సిఫార్సు చేసింది. ప్యానెల్‌లోని 20 మంది సభ్యులు వ్యాక్సిన్ వినియోగానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) మోడెర్నా టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని(ఈయూఏ) వెంటనే మంజూరు చేస్తుందని వారు భావిస్తున్నారు.


ఇక ఇప్పటికే ట్రయల్స్‌లో మోడెర్నా సురక్షితమైంది, సమర్థవంతమైందిగా తేలింది. 30 వేల మందిపై జరిగిన మోడెర్నా టీకా ట్రయల్స్‌లో.. వ్యాక్సిన్ ప్రభావశీలత 94.1 శాతంగా తేలింది. అలాగే టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమీ లేవని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కనిపించే జ్వరం, చలి, తలనొప్పి లాంటి స్వల్ప లక్షణాలు కన్పించాయి. ఇక ఫైజర్‌, మోడెర్నా టీకాలు మెసెంజర్ RNA సాంకేతికతతో అభివృద్ధి చేశారు. పైగా ఫైజర్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాల్సి ఉండగా.. మోడెర్నాను సాధారణ ఫ్రీజ్‌లలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మోడెర్నాను కూడా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదించడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ పీక్ స్టేజ్‌లో ఉన్నందున ఇప్పటికే వినియోగిస్తున్న ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకా కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం మరింత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.10 లక్షల మందిని కొవిడ్ బలిగొంది. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్ బాధితులు గణనీయంగా పెరుగుతుండటం పట్ల ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో అగ్రరాజ్యం సాధ్యమైనంత త్వరగా ప్రజలకు టీకాలు అందించాలని చూస్తోంది. 


ఇదిలా ఉంటే.. అమెరికా ఇప్పటికే 200 మిలియన్ల మోడెర్నా డోసుల కోసం ఆర్డర్ చేసిందని సమాచారం. ఈ నెలలో మొదటి షిప్‌మెంట్ కింద 20 మిలియన్ల డోసులు యూఎస్‌కు అందనున్నాయి. మరో 80 మిలియన్ల డోసులు 2021 మొదటి త్రైమాసికంలో, మిగిలిన 100 మిలియన్ల డోసులు రెండో త్రైమాసికంలో అగ్రరాజ్యం చేతికి వస్తాయి. 

Updated Date - 2020-12-18T16:14:14+05:30 IST