అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2021-08-04T04:44:24+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఈ సారి ఏకంగా అగ్రరాజ్య రక్షణ కేంద్రం సమీపంలో..

అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోత మోగింది. ఈ సారి ఏకంగా అగ్రరాజ్య రక్షణ కేంద్రం సమీపంలో ఈ కాల్పులు జరగడం సంచలనంగా మారింది. మిలిట‌రీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్‌కు కూతవేటు దూరంలోని మెట్రో రైల్వే స్టేషన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా కాలమాన ప్రకారం.. గురువారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో స్టేషన్‌లో వరుస కాల్పులు వినబడగానే పెంటగాన్ కార్యాలయాన్ని హుటాహుటిన లాక్ డౌన్ చేశారు. తుపాకీతో మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మెట్రో స్టేషన్‌‌లో రక్తపుటేర్లు పారాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.


పెంటగాన్‌ ట్రాన్సిట్ సెంటర్‌లో వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన కారణంగా పెంటగాన్‌ను లాక్‌డౌన్ చేసినట్లు అధికారులు వెల్లడించారుు. ఈ మేరకు పెంటగాన్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలకు ప్రత్యేక సందేశం అందించింది. ‘పెంటగాన్ లాక్‌డౌన్‌లో ఉంది.  సాధార‌ణ అటువైపుగా రావ‌ద్దు’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఆర్లింగ్టన్ స‌బ‌ర్బన్ ప‌రిథిలో విధులు నిర్వర్తించాల‌ని డిఫెన్స్ ఉద్యోగుల‌ను పెంట‌గాన్ ఆదేశించిన‌ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. మొత్తం ఎంతమంది మరణించారు..? ఎంత మందికి తీవ్రగాయాలయ్యాయి..? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-04T04:44:24+05:30 IST