America: వలస విషాదంలో 51కి చేరిన మృతుల సంఖ్య.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-29T21:11:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ.. ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 51కి చేరింది. మృతుల్లో 39 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఉండగా.. వీరిలో మెక్సికోకు చెందిన పౌరులే అత్యధికంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోకి విదేశీ

America: వలస విషాదంలో 51కి చేరిన మృతుల సంఖ్య.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ.. ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 51కి చేరింది. మృతుల్లో 39 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఉండగా.. వీరిలో మెక్సికోకు చెందిన పౌరులే అత్యధికంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోకి విదేశీయులను అక్రమంగా రవాణా చేస్తూ 51 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఇద్దరు మెక్సికన్‌ పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కు రిజిస్ట్రేషన్‌పై అడ్రస్ ఆధారంగా నిందితుల ఆచూకి గుర్తించారు. అనంతరం నిందితులు ఇద్దరు తమ ఇంటి నుంచి బయటకు వచ్చినపుడు.. వేరు వేరుగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అరెస్టు చేసే సమయంలో నిందితుల వద్ద తుపాకులను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా ఆ ట్రక్కు డ్రైవర్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించారు. ఈ నేరంలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. కాగా.. ఈ వలస విషాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం స్పందించారు. భయంకరమైన, హృదయ విదారకరమైన ఘటనగా పేర్కొన్నారు. 



విషయం ఏంటంటే..

టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న భవనం వద్ద డ్రైవర్ ట్రక్కును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆ ట్రక్కు నుంచి సాయం కోరుతూ కేకలు వినిపించాయి. దీంతో ఓ కార్మికుడు అక్కడకు వెళ్లాడు. అనంతరం ట్రక్కులో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. కొందరు విగత జీవిలుగా, మరికొందరు అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి భయాందోళనలకు లోనయ్యాడు. వెంటనే పోలీసులను సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారుల.. ట్రక్కులో 50 మంది మరణించినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన 16 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ 16 మందిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదలడంతో.. మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది. 


Updated Date - 2022-06-29T21:11:30+05:30 IST