'చాంప్' మృతిప‌ట్ల‌ బైడెన్ భావోద్వేగం.. క‌మ‌లా హ్యారిస్‌ సంతాపం!

ABN , First Publish Date - 2021-06-20T18:06:12+05:30 IST

పెంపుడు శున‌కం చాంప్ మృతిప‌ట్ల‌ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ట్విట‌ర్‌ వేదిక‌గా భావోద్వేగ‌పూరిత పోస్ట్ చేశారు.

'చాంప్' మృతిప‌ట్ల‌ బైడెన్ భావోద్వేగం.. క‌మ‌లా హ్యారిస్‌ సంతాపం!

వాషింగ్ట‌న్‌: పెంపుడు శున‌కం చాంప్ మృతిప‌ట్ల‌ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ట్విట‌ర్‌ వేదిక‌గా భావోద్వేగ‌పూరిత పోస్ట్ చేశారు. "ఇవాళ మా కుటుంబం ల‌వింగ్ ఛాంపియ‌న్ చాంప్‌ను కోల్పోయింది. జ‌ర్మ‌న్ షెప‌ర్డ్‌ చాంప్ మృతి మ‌మ్మ‌ల్ని తీవ్రంగా క‌లిచివేసింది. చాంప్ మ‌ర‌ణంతో మా హృద‌యాలు బ‌రువెక్కాయి. గ‌డిచిన 13 ఏళ్లుగా మా ఫ్యామిలీతో క‌లిసిపోయిన‌ చాంప్ మాకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజుల‌ను అందించాడు. ఈ రోజు మా ప్రియా నేస్తాన్ని కోల్పోవ‌డం చాలా బాధ‌గా ఉంది. ఎప్పుడు ఎంతో హుషారుగా, చ‌లాకీగా ఉండే చాంప్‌తోనే మా రోజు మొద‌ల‌య్యేది. చాంప్‌ను చాలా మిస్ అవుతున్నాం" అంటూ బైడెన్ భావోద్వేగ‌పూరిత ట్వీట్ చేశారు. 


ఇక బైడెన్ జ‌న‌వ‌రి 20న‌ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత చాంప్‌, మేజ‌ర్ అనే రెండు పెంపుడు శున‌కాల‌ను త‌న‌తో పాటు వైట్‌హౌస్‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ రెండు శున‌కాలు అధ్య‌క్ష భ‌వ‌నంలో ఇమ‌డ‌లేక‌పోవ‌డంతో మార్చిలో మ‌ళ్లీ బైడెన్ పాత ఇల్లు ఉన్న డెలావ‌ర్‌లోని విల్మింగ్ట‌న్‌కు త‌ర‌లించారు. వైట్‌హౌస్ సెక్యూరిటీ సిబ్బందిపై మేజ‌ర్ దాడికి పాల్ప‌డింది. దీంతో త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో ఈ రెండు శున‌కాల‌ను పాత ఇంటికి త‌ర‌లించ‌డం జ‌రిగింది. అక్క‌డ కొన్ని రోజులు ఉంచిన త‌ర్వాత తిరిగి వైట్‌హౌస్‌కు తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో శ‌నివారం చాంప్ ఇంట్లోనే క‌న్నుమూసిన‌ట్లు బైడెన్ తెలియ‌జేశారు. ఇక‌ చాంప్ 2008 నుంచి బైడెన్ కుటుంబంతో ఉంటే, మేజ‌ర్ 2018 నుంచి ఉంటోంది. మేజ‌ర్ ఒక‌ రెస్క్యూ డాగ్‌, ఓ స్వ‌చ్ఛంద సంస్థ నుంచి దీన్ని బైడెన్ ఫ్యామిలీ ద‌త్త‌త తీసుకుంది. అధ్య‌క్ష భ‌వ‌నంలో అడుగుపెట్టిన మొద‌టి రెస్క్యూ డాగ్ కూడా మేజ‌రే కావ‌డం గ‌మనార్హం.           

Updated Date - 2021-06-20T18:06:12+05:30 IST