Biden, కమలాతో పాటు ప్రపంచ దేశాధినేతల Diwali శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2021-11-05T18:07:11+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్‌తో పాటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ తదితరులు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధికార భవనం వైట్‌హౌస్‌లో గురువారం..

Biden, కమలాతో పాటు ప్రపంచ దేశాధినేతల Diwali శుభాకాంక్షలు!

వాషింగ్టన్: దీపావళి పండుగ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్‌తో పాటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ తదితరులు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధికార భవనం వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన దీపావళి వేడుకల్లో సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీపాల పండుగను జరుపుకుంటున్న వారందరికీ బైడెన్ ట్విటర్ వేదికగా విషెస్ తెలియజేశారు. 


"చీకటిలో నుంచి సత్యం, జ్ఞానాన్ని వెతుక్కోవచ్చనే విషయాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులు, సిక్కులు, జైన్​లు, బౌద్ధులకు శుభాకాంక్షలు." అని బైడెన్ ట్వీట్ చేశారు. 


అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా దీపావళి శుభాకాంక్షలు​ తెలిపారు. ప్రపంచ దేశాల్లో దీపాల పండుగ జరుపుకుంటున్న అందరికీ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. "అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ చేసుకుంటున్న వారందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఏడాది కరోనా మహమ్మారి మధ్యలో పండుగ జరుపుకుంటున్నాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపాల పండుగ చేసుకుంటున్నాము. ఈ చీకటిపై వెలుగు విజయానికి ఇది ప్రతీక. పవిత్రమైన విలువలను యూఎస్ సర్కార్ ఎల్లప్పుడు గుర్తిస్తుంది" అని కమల ఓ వీడియో సందేశాన్ని ట్వీట్​ చేశారు.


అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా భారత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 'బ్రిటన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. బందీ చోర్ దివస్ జరుపుకుంటున్న సిక్కులకు కూడా నా విషెస్. ఈ దీపావళి మనందరికీ ప్రత్యేకంగా నిలుస్తోంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మనవాళ్లను సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. ఫ్యామిలీ, మిత్రులతో ఈ ఆనంద సమయాన్ని గడపండి. మహమ్మారి వల్ల ఎదుర్కొన్న కఠినమైన సమయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్' అంటూ బోరిస్ ఓ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు. 


అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ దీపావళి మన జీవితాల్లో మరింత వెలుగులను నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. వీరితో పాటు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స తదితరులు భారతీయులతో పాటు ప్రపంచ దేశాల్లో దీపావళి జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


Updated Date - 2021-11-05T18:07:11+05:30 IST