కరోనాతో అగ్రరాజ్యం ఆగమాగం.. ఒక్కరోజే 5.80 లక్షలకుపైగా కొత్త కేసులు

ABN , First Publish Date - 2022-01-01T12:29:41+05:30 IST

ఊహించనంత వేగంగా వైరస్‌ వ్యాప్తి.. మూడో వంతుపైగా రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కేసులు.. రోజుకు పదివేల మంది పెద్దలు.. దాదాపు 400 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరిక.. ముందుముందు కొవిడ్‌ మంచు తుఫానులా ముంచెత్తనుందంటూ నిపుణుల హెచ్చరికలు..! ఒమైక్రాన్‌ కారణంగా అమెరికాలో ప్రస్తుతం పరిస్థితిది. కనీవినీ ఎరుగని రీతిలో అగ్ర రాజ్యంలో కొత్తగా 5.80 లక్షల కేసులు..

కరోనాతో అగ్రరాజ్యం ఆగమాగం.. ఒక్కరోజే 5.80 లక్షలకుపైగా కొత్త కేసులు

ఒక్క రోజులో 5.80 లక్షలకుపైగా కేసుల నమోదు..

రోజుకు 400 మంది వరకు పిల్లలు ఆస్పత్రిపాలు

సెప్టెంబరు నాటి తీవ్ర ఉధృతిలోనూ 342 మందే..

జనవరిలో విరుచుకుపడనున్న కరోనా: నిపుణులు

ఆస్ట్రేలియాలో 30 వేల కేసులు.. రోజుల్లోనే 3 రెట్లు..

ఇజ్రాయెల్‌లో వ్యాక్సిన్‌ 4వ డోసు పంపిణీ షురూ

వాషింగ్టన్‌, డిసెంబరు 31: ఊహించనంత వేగంగా వైరస్‌ వ్యాప్తి.. మూడో వంతుపైగా రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కేసులు.. రోజుకు పదివేల మంది పెద్దలు.. దాదాపు 400 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరిక.. ముందుముందు కొవిడ్‌ మంచు తుఫానులా ముంచెత్తనుందంటూ నిపుణుల హెచ్చరికలు..! ఒమైక్రాన్‌ కారణంగా అమెరికాలో ప్రస్తుతం పరిస్థితిది. కనీవినీ ఎరుగని రీతిలో అగ్ర రాజ్యంలో కొత్తగా 5.80 లక్షల కేసులు నమోదవడం తీవ్రతను చాటుతోంది. వారం రోజుల సగటు చూస్తే అమెరికాలో రోజుకు 2.90 లక్షల పాజిటివ్‌లు వచ్చాయి. సీడీసీ లెక్కల ప్రకారం డిసెంబరు 22-28 మధ్య 17 ఏళ్లలోపు పిల్లలు.. రోజుకు 370 మంది పైగా కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు. అంతకుముందటి వారంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం కావడం గమనార్హం. గత సెప్టెంబరులో అమెరికాలో వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఈ సంఖ్య 342 మాత్రమే. కాగా, మొత్తమ్మీద దేశంలో రోజుకు 10,200 మంది కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.


దీనిప్రకారం.. మొత్తం బాధితుల్లో పిల్లల శాతం చాలా స్వల్పమేనని, డెల్టా ఉధృతి సమయంలో కంటే ఇప్పుడు వారిలో తీవ్రత తక్కువే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో గత గరిష్ఠ సంఖ్యను మించి కేసులు వస్తున్నాయి. రాజధాని వాషింగ్టన్‌ డీసీ, మేరీల్యాండ్‌, ఒహియో తదితర రాష్ట్రాల్లో ఆస్పత్రులో చేరికలు 27 శాతం పెరిగాయి. ఇప్పటికీ చాలామంది యువత టీకా పొందని నేపథ్యంలో రానున్న వారాల్లో వైరస్‌ మంచు తుఫానులా విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడుతుందని, విద్యా సంస్థలు, ఇతర రంగాల వారికీ ఇబ్బందులు తప్పవని.. దీనికి సిద్ధపడి ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు ఫెడరల్‌ అధికారులు ఇప్పటికే ప్రయాణ ఆంక్షలను విధించారు. వచ్చేవారం నుంచి 12 -15 ఏళ్ల పిల్లలకు బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు.


కొవిడ్‌ గత వేరియంట్‌లను సమర్థంగా కట్టడి చేసిన ఆస్ట్రేలియాకు ఒమైక్రాన్‌ కొరుకుడు పడడం లేదు. దేశంలో శుక్రవారం 32 వేల పైగా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితమే తొలిసారి పాజిటివ్‌లు పదివేలు దాటాయి. ఇప్పుడు 3 రెట్లు పెరగడం గమనార్హం. తాజా కేసు  ల్లో 15 వేలు సిడ్నీలోనే వచ్చాయి. ఈ దేశంలోనూ ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతున్నాయి. న్యూ సౌత్‌వేల్స్‌లో ఆరుగురు మృతి చెందగా, 700 మంది ఆస్పత్రుల్లో చేరారు. కాగా, ఇజ్రాయిల్‌లో శుక్రవారం టీకా నాలుగో డోసు పంపిణీ ప్రారంభమైంది. వైరస్‌ నుంచి ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ఈ డోసు ఇస్తున్నారు. కరోనా ప్రారంభం నుంచి ఎన్నడూలేని విధంగా రష్యాలో నవంబరులో 87,500మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ గణాంకాలను బయటపెట్టారు. డెల్టా తీవ్రత తగ్గిందని అనుకుంటున్న దశలో.. ఒమైక్రాన్‌ రావడంతో రష్యాలో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 22 వేల పాజిటివ్‌లు నమోదవుతుండగా, కొవిడ్‌తో వెయ్యి మంది వరకు చనిపోతున్నారు. ఒమైక్రాన్‌ వ్యాప్తితో మిగతా ప్రపంచమంతా రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలుచేస్తుంటే.. వేరియంట్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలో మాత్రం రాత్రి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2022-01-01T12:29:41+05:30 IST